కేసీఆర్‌ను కలసిన ఫిలిం చాంబర్ నాయకులు
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ఫిలిం చాంబర్ అసోసియేషన్, ఏపీ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు బుధవారం టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న కె.చంద్రశేఖరరావు(కేసీఆర్)ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. మురళీమోహన్, రామానాయుడు, సురేష్‌బాబు, దిల్ రాజు, అలీ, వేణుమాధవ్ కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ..నూతనంగా బాధ్యతలు చేపట్టే ముఖ్యమంత్రికి ఫిలిం చాంబర్ , ప్రొడ్యుసర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ అని, ఆ ప్రకారమే కేసీఆర్‌ను కలిశామన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ నాయకులు, ప్రతినిధులతో సమావేశం అవుతానని కేసీఆర్ చెప్పారన్నారు. ప్రముఖ నటి జమున కూడా కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్‌ను కలిసిన మోహన్‌బాబు
కేసీఆర్‌ను సినీనటుడు మోహన్‌బాబు బుధవారం కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచాలని కేసీఆర్‌ను కోరినట్టు మోహన్‌బాబు వెల్లడించారు.
కొనసాగుతున్న అభినందనల వెల్లువ
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో జనసంద్రాన్ని తలపిస్తోంది. బుధవారం కూడా కేసీఆర్ నివాసానికి నాయకులు, ప్రజల తాకిడి కొనసాగింది. రాజకీయ నేతల నుంచి అధికారుల దాకా పెద్ద సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.