టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ.. వెల్‌కమ్ | Congress party wel comes to join TRS MLAs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ.. వెల్‌కమ్

Published Sat, Mar 15 2014 2:33 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ.. వెల్‌కమ్ - Sakshi

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ.. వెల్‌కమ్

* ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా కాంగ్రెస్‌లో చేరవచ్చు: దిగ్విజయ్
* తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు మా పార్టీకే ఉంటాయి
* ఒంటరిగా పోటీ చేసేందుకైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది..
* టీఆర్‌ఎస్ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే పొత్తులపై పరిశీలిస్తాం
* విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారు
* 28లోగా తెలంగాణ, సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపిక

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలు సహా ఆ పార్టీకి చెందిన నేతలెవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని, వారికి ఆహ్వానం పలుకుతామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. వారితో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేతలు, తాను కూడా అందుబాటులో ఉంటామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే ప్రజాదరణ ఉందని, అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పొత్తుల కోసం టీఆర్‌ఎస్ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే పరిశీలిస్తామని తెలిపారు. ‘‘తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని సోనియాకు హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారు. రాజకీయ పార్టీగా కొనసాగిస్తామన్నారు.
 
  పొత్తులపై కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ చైర్మన్ కేకేకు ఫోన్ చేసి చర్చలకు రమ్మన్నాం. వస్తామని ముందుగా చెప్పారు. ఆ తరువాత రావడంలేదని చెప్పారు. ఇప్పుడు పొత్తులపై మాట్లాడాలనుకుంటే టీఆర్‌ఎస్సే ప్రతిపాదనలతో ముందుకు రావాలి. పొత్తులు వద్దనుకుంటే అది వారిష్టం. టీఆర్‌ఎస్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనది. తెలంగాణ వచ్చాక రాజకీయ పార్టీగా కొనసాగాల్సిన అవసరంలేదు. కేసీఆర్‌తో చర్చించాకే తెలంగాణ బిల్లు రూపొందించాం. విలీనంపై టీఆర్‌ఎస్ మాట తప్పడం మోసపూరితమనను. కానీ అదో రాజకీయ ఎత్తుగడ’’ అని చెప్పారు. తొలి సీఎంగా అవకాశమివ్వాలని కేసీఆర్ అడిగారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ ప్రతిపాదన కేసీఆర్ నుంచి నేరుగా రాలేదని సమాధానమిచ్చారు. విస్తృత చర్చల తరువాతే తెలంగాణపై  కాంగ్రెస్ పార్టీ చివరిగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.

రెండు రాష్ట్రాలూ పరస్పర  సమన్వయం, సహకారాలతో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగాములుగా నిలుస్తాయన్న నమ్మకం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన వారిని ఆదుకొనే అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దలేదని, అసెంబ్లీలో చర్చించి ఆమోదం పొందాకే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కానీ, కిరణ్ దాన్నే సాకుగా చూపి తమకు ఇచ్చిన మాటను తప్పి పార్టీ పెట్టడం విచారకరమన్నారు. తెలంగాణలో ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కోవడానికి, పార్టీ పటిష్టానికే పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంటును నియమించామని, మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కాదని చెప్పారు. ఇద్దరూ సమానులు, సమర్థులేనని అన్నారు. తెలంగాణ సీఎం దళితుడా కాదా అన్నది ఇప్పుడుచెప్పలేమన్నారు.

ఎన్నికల్లో గెలిచాక సీఎల్పీ సభ్యులు సీఎంను ఎన్నుకుంటారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై నమ్మకం లేదా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, గెలుస్తామనే నమ్మకం కూడా మాకు ఉందని చెప్పారు. జానారెడ్డికి అసంతృప్తి లేదని, ఆయన ఇంటిలో విందు కూడా ఇచ్చారని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రలలో అభ్యర్థుల ఎంపికను ఈనెల 28లోగా పూర్తిచేస్తామని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, మరో 20 ఏళ్లు అక్కడ అధికారంలోకి రాలేమని జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘జైరాం ఆయన స్టయిల్లో అలా చెప్పారేమో! దానిపై వ్యాఖ్యానించలేను’’ అని అన్నారు. ‘‘సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు అనేక మంది సమర్థులు వస్తున్నారు.
 
  రఘువీరారెడ్డి సమర్ధుడైన సీనియర్ నేత. ఎన్నికల్లో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు’’ అని చెప్పారు. వామపక్షాలతో పొత్తులపై ప్రశ్నించగా.. అవి తమ మిత్రపక్షాలేనన్నారు. వంద కోట్లకు పైగా ఉన్న ప్రజల్లో ఒకటి రెండు వేల మంది అభిప్రాయాలు సేకరించే సర్వేలను పటి ్టంచుకోబోమని చెప్పారు. వైఎస్ జగన్‌ది కాంగ్రెస్ డీఎన్‌యేనని తెలిపారు. రాహుల్ గాంధీకి తాను గురువునో, మార్గదర్శినో కాదని, ఆయన సొంత ఆలోచనల ప్రకారమే నడుస్తున్నారని చెప్పారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ గురించి తమకు తెలియదంటూనే, ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దిగ్విజయ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement