టీ-జేఏసీ నేతల కోసం రెండు పార్టీల మధ్య పోటీ
టికెట్లిస్తామంటూ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ - ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య.. ఇప్పుడు తెలంగాణ క్రెడిట్ కోసమే కాదు.. తెలంగాణ జేఏసీ నేతల కోసమూ పోటీ మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ ఆశించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో.. తెలంగాణ కోసం ఉద్యమం నడిపిన టీ-జేఏసీ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఒకవైపు అంతర్గతంగా రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు జేఏసీ నేతలతో పాటు ఒకరిద్దరు అమరవీరుల కుటుంబాలకు టికెట్లు కేటాయించడం ద్వారా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం పనిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి అనుగుణంగానే కేంద్రమంత్రి జైరాంరమేష్ ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తూ అధిష్టానం ప్రణాళికను అమలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పడు జేఏసీ నేతలను పిలిపించుకుని ఎన్నికల్లో పోటీచేయటానికి ఆసక్తి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వటానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఈ నెల 19న హైదరాబాద్‌లో కలుస్తానని కూడా జైరాం ప్రకటించారు. 18న మరోసారి తెలంగాణ జేఏసీ నేతలతో భేటీ కానున్నట్లు తాజాగా వెల్లడించారు.
కాంగ్రెస్ తమను విమర్శించటమే కాకుండా జేఏసీ నేతలకు, అమరవీరుల కుటుంబ సభ్యులకు దగ్గర కావటానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం టీఆర్‌ఎస్‌కు మింగుడుపడటం లేదు. దీంతో.. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు జేఏసీని, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీపై టీఆర్‌ఎస్ ఎదురు దాడి మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ఏర్పాటు తరువాత మొదటిసారి మంగళవారం తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ వ్యూహానికి ప్రతిగా అన్నట్లు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జేఏసీలో కీలకంగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్‌ను మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించారు.
మహబూబ్‌నగర్ అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా శ్రీనివాస్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఎం.డి.ఇబ్రహీంకు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశమిస్తామని టీఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు.
కాంగ్రెస్.. టీఆర్‌ఎస్.. మధ్యలో జేఏసీ!
Published Wed, Mar 12 2014 1:44 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement