Telangana credit
-
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
- తెలంగాణ క్రెడిట్ మాదే - ఫామ్‌హౌజ్‌లో కూర్చునేవారికి అధికారమా? - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. జాతీయపార్టీ, లౌకికత్వానికి మారుపేరైన కాంగ్రెస్‌తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రాంతీయపార్టీలతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యమన్నారు. ఫాంహౌజ్‌లో కూర్చుని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు పంపిణీ చేసే వ్యక్తుల చేతికి అధికారం అప్పగిస్తే... తర్వాత ఈ ప్రాంతానికి మంజూరయ్యే పరిశ్రమలు.. పవర్ ప్రాజెక్టులు.. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ మళ్లీ ఆయన కుటుంబసభ్యులకే దక్కుతాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పురుడు పోసుకుందని, చంటిపిల్ల లాంటి ఈ తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని అన్నారు. బీజేపీది విభజించి పాలించే తీరు ప్రస్తుత ఎన్నికలు లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోరు అని ఆజాద్ అన్నారు. బీజేపీ మత రాజకీయాలను ప్రేరేపిస్తూ.. విభజించి పాలించే పాలసీతో పని చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఉన్న అన్ని కులాలు.. మతాలు.. వర్గాలను సంఘటితంగా ఉంచి.. వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం కాంగ్రెస్ సిద్ధాంతమని వెల్లడించారు. బీజేపీది నాధూరాంగాడ్సే మార్గమని.. కాంగ్రెస్‌ది అహింసామార్గమని అన్నారు. బీజేపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ అధికారంలో వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయాంలో 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు అందరికీ తెలిసిన విషయమేనని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్.. టీఆర్ఎస్.. మధ్యలో జేఏసీ!
టీ-జేఏసీ నేతల కోసం రెండు పార్టీల మధ్య పోటీ టికెట్లిస్తామంటూ ఆఫర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ - ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య.. ఇప్పుడు తెలంగాణ క్రెడిట్ కోసమే కాదు.. తెలంగాణ జేఏసీ నేతల కోసమూ పోటీ మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ ఆశించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో.. తెలంగాణ కోసం ఉద్యమం నడిపిన టీ-జేఏసీ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు అంతర్గతంగా రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు జేఏసీ నేతలతో పాటు ఒకరిద్దరు అమరవీరుల కుటుంబాలకు టికెట్లు కేటాయించడం ద్వారా టీఆర్ఎస్ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం పనిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి అనుగుణంగానే కేంద్రమంత్రి జైరాంరమేష్ ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తూ అధిష్టానం ప్రణాళికను అమలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పడు జేఏసీ నేతలను పిలిపించుకుని ఎన్నికల్లో పోటీచేయటానికి ఆసక్తి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వటానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఈ నెల 19న హైదరాబాద్‌లో కలుస్తానని కూడా జైరాం ప్రకటించారు. 18న మరోసారి తెలంగాణ జేఏసీ నేతలతో భేటీ కానున్నట్లు తాజాగా వెల్లడించారు. కాంగ్రెస్ తమను విమర్శించటమే కాకుండా జేఏసీ నేతలకు, అమరవీరుల కుటుంబ సభ్యులకు దగ్గర కావటానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం టీఆర్ఎస్కు మింగుడుపడటం లేదు. దీంతో.. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు జేఏసీని, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎదురు దాడి మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ఏర్పాటు తరువాత మొదటిసారి మంగళవారం తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ వ్యూహానికి ప్రతిగా అన్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జేఏసీలో కీలకంగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్‌ను మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా శ్రీనివాస్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన ఎం.డి.ఇబ్రహీంకు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశమిస్తామని టీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. -
‘తెలంగాణ’ సోనియా ఘనతే..
తాండూరు, న్యూస్‌లైన్: అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పడుతున్న అవమానాలు, కష్టాల నుంచి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విముక్తి కలిగించారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానమే అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వచ్చేనెల నుంచి జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని ఆరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఐదు నియోజకవర్గాల మీదుగా సాగుతుందని, తాండూరులో ముగుస్తుందన్నారు. ఐదు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని ప్రచారం చేయడంతోపాటు తెలంగాణ పునర్ నిర్మాణానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వారం రోజుల్లో పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగానా, ఎంపీగానా ఏ స్థానానికి పోటీ చేస్తారని విలేకరులు ప్రశ్నిం చగా..నాన్న ఇంద్రారెడ్డి ఎంపీ కావాలనుకున్నా నెరవేరలేదని, అందుకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అపూ పాల్గొన్నారు. -
తెలంగాణ మా ఘనతే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ మాదేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడంతో 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల సాకారమైందని ఆయన అన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా నేతలు కీలక భూమిక పోషించారని, నాడు చెన్నారెడ్డి మొదలు.. ఇంద్రారెడ్డి, దేవేందర్‌గౌడ్ వరకు తెలంగాణ కోసం పోరాటం సాగించిన చరిత్రను మరిచిపోవద్దన్నారు. ఉద్యమానికి ఊపునిచ్చింది జిల్లా వాసులేనని కొనియాడారు. తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదన్న విషయాన్ని కొన్ని పార్టీలు గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ‘టీ’కి అనుకూలంగా లేఖ ఇవ్వడంతో సీమాంధ్రలో పార్టీకి నష్టమని తెలిసినప్పటికీ, సొంత జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసినా..చంద్రబాబు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ లేఖతోనే తెలంగాణకు మార్గం సుగమమైందని మహేందర్‌రెడ్డి చెప్పారు. వేయి మంది విద్యార్థుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమన్నారు. విద్యార్థుల అమరత్వాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన యూపీఏ చైర్‌పర్సన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నదీజలాలు, ఉమ్మడి రాజధాని, సీమాంధ్ర రాజధాని, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వడం ద్వారా అక్కడి ప్రాంత వాసుల్లో నెలకొన్న భయాందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.