తాండూరు, న్యూస్‌లైన్: అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పడుతున్న అవమానాలు, కష్టాల నుంచి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విముక్తి కలిగించారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానమే అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వచ్చేనెల నుంచి జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
జిల్లాలోని ఆరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఐదు నియోజకవర్గాల మీదుగా సాగుతుందని, తాండూరులో ముగుస్తుందన్నారు. ఐదు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని ప్రచారం చేయడంతోపాటు తెలంగాణ పునర్ నిర్మాణానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వారం రోజుల్లో పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగానా, ఎంపీగానా ఏ స్థానానికి పోటీ చేస్తారని విలేకరులు ప్రశ్నిం చగా..నాన్న ఇంద్రారెడ్డి ఎంపీ కావాలనుకున్నా నెరవేరలేదని, అందుకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అపూ పాల్గొన్నారు.
‘తెలంగాణ’ సోనియా ఘనతే..
Published Tue, Dec 10 2013 6:54 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement