తెలంగాణ సోనియా పుణ్యమే | Sabitha Indra Reddy Son Karthik Reddy Padayatra | Sakshi
Sakshi News home page

తెలంగాణ సోనియా పుణ్యమే

Published Thu, Jan 9 2014 12:41 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సభలో ప్రసంగిస్తున్న కార్తీక్‌రెడ్డి - Sakshi

సభలో ప్రసంగిస్తున్న కార్తీక్‌రెడ్డి

నార్సింగి, చేవెళ్ల, మొయినాబాద్, న్యూస్‌లైన్:  ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. బుధవారం ‘తెలంగాణ నవ నిర్మా ణ పాదయాత్ర’ పేరుతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాజేంద్రనగర్ మండలం అరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జానారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గ్రామగ్రామాన తెలియజేయడంతోపాటు స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు కార్తీక్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటు కావాలని కలలుకన్న రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డిలతోపాటు ప్రాణత్యాగాలు చేసిన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి తదితరులకు జోహార్లు పలికారు. తెలంగాణ రాష్ర్టంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ఆరె మైసమ్మ అమ్మ వద్ద నుంచి ప్రారంభించిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని, కార్తీక్ రెడ్డి 100 కి.మీటర్ల పాదయాత్ర సైతం విజయవంతం అవుతుందన్నారు.
 
 సోనియాకు రుణపడి ఉంటారు
 ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన  యాదిరెడ్డి ఢిల్లీ నడిబొడ్డున ఆత్మబలిదానం చేసి మన ఆకాంక్షను సోనియాగాంధీకి తెలిపారన్నారు. పాదయాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
 
 అమరుల కుటుంబాలను ఆదుకోవాలి
 ఆత్మబలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతోందని, వారి కుటుంబాలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదుకోవాలని కార్తీక్‌రెడ్డి అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ 1969 నుంచి ఇప్పటివరకు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన అమరుల కుటుంబాలకు గచ్చిబౌలిలోని ఏపీఐఐసీకి చెందిన 40 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సీమాంధ్రులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా పట్టించుకోకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపారని, పార్లమెంటులో కూడా పాస్ చేయించేందుకు కృషి చేస్తున్న సోనియాగాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని తెలిపేందుకే  పాదయాత్రను చేస్తున్నానని కార్తీక్‌రెడ్డి తెలిపారు.  
 
 తొలగిన మనస్పర్థలు
 కార్తీక్‌రెడ్డి పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించింది. ఇన్నాళ్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షడిని నేనంటే నేనేనని కెఎం.ప్రతాప్‌రెడ్డి, కె.మల్లేశ్‌లు పాత్రికేయుల సమావేశాలు పెట్టి ప్రకటించుకునే వారు. ఈ సభా వేదికపై ఒకరికొకరు అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడని పిలుచుకోవడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు సంబరపడ్డారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ తులసీరాం, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, మాజీ అధ్యక్షుడు కేఎం.ప్రతాప్, సీనియర్ నాయకులు పి.రాజు, నవాబ్‌ముంతాజ్, సదాలక్ష్మి, ఏ.మాధవరెడ్డి, జె.సత్యనారాయణ, ఇ.నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు యం.జైపాల్‌రెడ్డి, కె.అశోక్‌యాదవ్, శిశుపాల్‌సింగ్, అశోక్, ఆంజనేయులు, వై.నరేష్, చాంద్‌పాషా, కృష్ణారెడ్డి, నవీన్, సాగర్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 
 గైర్హాజరైన నియోజకవర్గ కన్వీనర్
 రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర ప్రారంభం, బహిరంగసభకు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బి. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గైర్హాజరయ్యారు. ఆయన ఇంటిముందే కార్యక్రమం జరుగుతున్నా హాజరుకాలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరవర్గం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రణధీర్‌రెడ్డి, శంషాబాద్‌కు చెందిన సీనియర్ నాయకుడు వేణు, వారి అనుచరులు పాల్గొనలేదు.
 
 ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళులు
 పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కార్తీక్‌రెడ్డి మండల పరిధి కౌకుంట్ల శివారులోని తన తండ్రి, మాజీ హోం మంత్రి పి.ఇంద్రారెడ్డి సమాధికి నివాళులర్పించారు. అంతకుముందు నగరంలోని శ్రీనగర్‌కాలనీలో గల స్వగృహంలో తల్లి, మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి కౌకుంట్లకు వచ్చారు.
 
 చిలుకూరులో పూజలు
 చిలుకూరు బాలాజీని సైతం కార్తీక్‌రెడ్డి దర్శించుకున్నారు. సోదరులు కౌశిక్‌రెడ్డి, కళ్యాణ్‌రెడ్డిలతో కలిసి ఉదయం 10 గంటలకు ఆయన ఆలయానికి వచ్చారు. ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ వారికి స్వాగతం పలికారు. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పట్టువస్తాలను పూజారులు కార్తీక్‌రెడ్డికి ఆశీర్వాదంగా అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement