సోనియాకు రుణపడి ఉంటాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఇక్కడి ప్రజలంతా రుణపడి ఉన్నారని, వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాల ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం రెండో రోజు ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’ చేవెళ్ల మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సారయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సోనియా గాంధీ నెరవేర్చారని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఉద్యమం నడుస్తున్న కాలంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నా.. తెలంగాణ ఏర్పడలేదని, ఇప్పుడు సోనియాగాంధీ వల్ల సాధ్యమవుతోందని అన్నారు. కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు తెలంగాణ ఫోరం మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. పది జిల్లాల్లోనూ యువకులు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
అందరూ ఆశీర్వదించాలి..
తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రారంభించిన ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును ప్రత్యేక రాష్ట్రంలో పూర్తి చేసుకుందామని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం ఎవరు ఉద్యమం చేసినా పూర్తిగా సహకరించానని తెలిపారు. కార్తీక్‌రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, పాదయాత్ర విజయవంతానికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు.
పునర్నిర్మాణం కాంగ్రెస్ బాధ్యత
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే పాదయా త్ర చేపట్టానని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్యా తీరుతుందన్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాను హార్టికల్చర్ జోన్‌గా ఏర్పాటుచేయడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గచ్చిబౌలిలో 300 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు.
కృష్ణా జలాల తరలింపునకు ప్రయత్నిస్తా: చంద్రశేఖర్
జిల్లా ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రకటనతో పది జిల్లాలకు స్వాతంత్య్రం వచ్చినట్లయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు కాలె యాదయ్య, డీసీసీబీ డెరైక్టర్, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్.బల్వంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.బాల్‌రాజ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ ఎం.నాగమ్మబాల్‌రాజ్, డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ఇంద్రన్న యువసేన అధ్యక్షుడు జి.రవికాంత్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.యాదగిరి, ఎండీ.అలీ, శివానందం, ఎం.రమణారెడ్డి, వనం మహేందర్‌రెడ్డి, నర్సింహులు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.