తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ మాదేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ మాదేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడంతో 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల సాకారమైందని ఆయన అన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా నేతలు కీలక భూమిక పోషించారని, నాడు చెన్నారెడ్డి మొదలు.. ఇంద్రారెడ్డి, దేవేందర్‌గౌడ్ వరకు తెలంగాణ కోసం పోరాటం సాగించిన చరిత్రను మరిచిపోవద్దన్నారు. ఉద్యమానికి ఊపునిచ్చింది జిల్లా వాసులేనని కొనియాడారు.
తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదన్న విషయాన్ని కొన్ని పార్టీలు గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ‘టీ’కి అనుకూలంగా లేఖ ఇవ్వడంతో సీమాంధ్రలో పార్టీకి నష్టమని తెలిసినప్పటికీ, సొంత జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసినా..చంద్రబాబు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ లేఖతోనే తెలంగాణకు మార్గం సుగమమైందని మహేందర్‌రెడ్డి చెప్పారు. వేయి మంది విద్యార్థుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమన్నారు. విద్యార్థుల అమరత్వాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన యూపీఏ చైర్‌పర్సన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నదీజలాలు, ఉమ్మడి రాజధాని, సీమాంధ్ర రాజధాని, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వడం ద్వారా అక్కడి ప్రాంత వాసుల్లో నెలకొన్న భయాందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.