సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంత్రివర్గ విస్తరణలో మన జిల్లాకు మరో బెర్త్ లభించే ఛాన్స్ కనిపించడంలేదు. ప్రస్తుతం జిల్లా నుంచి తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా ఈనెల 16న మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలుగురున్నారు. ఇటీవల టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. తీగల, కాలె సాంకేతికంగా ఆయా పార్టీల సభ్యులుగానే కొనసాగుతున్నారు.
సామాజిక సమీకరణల నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలను కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేదు. అంతేకాకుండా మంత్రివర్గాన్ని కూడా 18 మంత్రులకే పరిమితం చేయడం కూడా ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నుం చి ప్రతిసారి ఇరువురు మంత్రులుగా వహిం చేవారు. రెవెన్యూ, హోంలాంటి కీలక శాఖ లు కూడా జిల్లాకు దక్కేవి. 14 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలోనే రెండో పెద్ద జిల్లాగా ఉన్నప్పటికీ, మంత్రుల సంఖ్యను పరిమితి దాటకూడదనే నిబంధన జిల్లా ఎమ్మెల్యేలకు ప్రతిబంధకంగా మారింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జూన్ 2న ప్ర మాణం స్వీకారం చేసిన రోజునే మహేందర్‌రెడ్డిని కూడా తన కేబినెట్‌లో చేర్చుకున్నారు. సీనియర్ శాసనసభ్యుడు కావడం, జిల్లా రాజకీయాలను శాసించేస్థాయికి ఎదిగిన మహేందర్‌కు బెర్త్ కట్టబెట్టడం ద్వారా టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో పట్టు సాధించాలని కేసీఆర్ భావించారు. ఆయన ఊహించినట్లుగానే తగిన సంఖ్యాబలం లేనప్పటికీ మహేందర్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోగలిగారు. ఆ తర్వాత టీడీపీకి చెందిన తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యను కూడా టీఆర్ ఎస్ గూటికి చేర్చారు.
హరీశ్వర్ ఆశలు ఆవిరి!
సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు. గతంలో టీడీపీలో కొనసాగిన హరీశ్వర్.. చంద్రబాబుతో విభేదించి కారెక్కారు. ఆయన చేరిక తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన మహేందర్‌రెడ్డి విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో కొలువుదీరారు. ‘ఓడిపోయినందుకు బాధపడాల్సిన పనిలేదని, సీనియర్ నేతగా సముచిత స్థానం కల్పిస్తా.’నని ముఖ్యమంత్రి అప్పట్లో హామీ ఇచ్చారు.
పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా హరీశ్వర్‌కు మంత్రివర్గంలో చోటు ఇస్తారని అంతా ఆశించారు. కేసీఆర్ భరోసాతో మంత్రి కావాలనే చిరకాలవాంఛ నెరవేరుతుందని హరీశ్వర్ భావించారు. అయితే, ఎమ్మెల్సీ పదవిపై ఆశలు సన్నగిల్లడంతో ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్ష పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. ఈ పదవిపైనా కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నామినేటెడ్ పోస్టులపై కన్ను
మహేందర్‌రెడ్డితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు సంజీవరావు (వికారాబాద్), సుధీర్‌రెడ్డి (మేడ్చల్), కనకారెడ్డి(మల్కాజిగిరి) జిల్లా నుంచి టీఆర్‌ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సాంప్రదాయాలు పాటిస్తే మాత్రమే జిల్లాకు రెండో పదవి దక్కే వీలుంది. అయితే ఇప్పటికి కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం.. సామాజిక సమతుల్యత కారణంగా ఒక మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేబినెట్‌లో అవకాశం దక్కకున్నా, నామినేటెడ్ పోస్టుల్లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు సాంస్కృతిక శాఖ చైర్మన్ పదవిని కట్టబెట్టడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పిడమర్తి రవిని దళిత సంక్షేమ శాఖ చైర్మన్‌గా నియమించడంతో ఆశావహుల్లో కార్పొరేషన్ పదవులపై ఆశలు రెట్టింపయ్యాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ ముగిస్తే నెలల తరబడి ఎదురుచూస్తున్న తమకు నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని దిగువ శ్రేణి నేతలు ఆశిస్తున్నారు.
విస్తరణలో నో ఛాన్స్!
Published Sun, Dec 14 2014 12:01 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement