అప్పటి, ఇప్పటి పరిస్థితులు వేరు
- పార్టీ ఫిరాయింపులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
- తెలంగాణలో ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారమన్న బాబు
- ఏపీలో అభివృద్ధిని చూసి వచ్చారట!
- ఫిరాయింపుదారుల్లో సమర్థులకు మంత్రి పదవులిచ్చామని వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల నాటి పరిస్థితులు, ఏపీలో ఇప్పటి పరిస్థితులు వేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. అలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో సమర్థులున్నారని, అందుకే వారికి మంత్రి పదవులు కట్టబెట్టానని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం స్పీకర్ పరిధిలో ఉంటుందని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనదేనని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు శనివారం విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా సింహాచలం శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కొండపై బీబీసీ కాటేజ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు, రాష్ట్రంలో తాజా రాజకీయాలపై ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగనివ్వండి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారు. వస్తున్న వారిని ఎలా అడ్డుకుంటాం? మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో సమర్థులను మంత్రివర్గంలో చేర్చుకున్నాం.
రాజ్యాంగం ప్రకారం కేబినెట్‌లోకి ఎవరినైనా తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. తెలంగాణలో మా పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి పొందినప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘన అని నేను ఎక్కడా అనలేదు. మా పార్టీ నుంచి తీసుకున్నారు.. మంత్రి పదవి ఇవ్వడం సరికాదన్నాను అంతే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకోలేదా? అప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గుర్తు రాలేదా?
ఫిరాయింపుదారులకు న్యాయం చేయాలిగా!
ఏపీలో మంత్రివర్గ విస్తరణ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు.. అన్నీ చక్కబడతా యి. నాపై నమ్మకంతో వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చారు. వారిలో సమర్థులున్నారు. వారికి కూడా న్యాయం చేయాలిగా! అందువల్లే టీడీపీలో అందరికీ న్యాయం చేయలేకపోయా. నాకున్న పరిమితి 26 మందే. అంతకు మించి కేబినెట్‌ను విస్తరించలేం కదా!
నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది
ప్రత్యేక ప్యాకేజీపై కేబినెట్‌లో తీర్మానం చేసి పంపిస్తున్నందున చట్టబద్ధత వచ్చినట్టే. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పునర్విభజన చట్టానికి సవరణ తీసుకొస్తే చాలు.