ఆయనకు నిరాశ తప్పదా?
కర్నూలు: అధికార పార్టీలో చేరిన ఓ నేతకు మంత్రి పదవి ఊరిస్తూనే ఉంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఉగాది పండుగ సందర్భంగా తీపి కబురు వినిపిస్తుందని ఆశపడుతున్న సదరు నేతకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని..జూన్ తర్వాతే ఉంటుందని తాజాగా అధిష్టానం సంకేతాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉగాది పండుగకు తీపి కబురు వినే అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా సదరు నేత నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. మరోవైపు పదవి వరించే సమయం దూరమవుతున్న కొద్దీ... కొత్త కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆ నేత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు కేసులు ఉన్న విషయాన్ని జిల్లాలోని మరో వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేసుల వ్యవహారం తెలేదాకా మంత్రి పదవి ఇవ్వవద్దని... కేసుల నుంచి బయట పడిన వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని కూడా సూచిస్తున్నట్టు సమాచారం. అయితే, తాజాగా తులసిరెడ్డిపై దాడి ఘటనతో వ్యవహారం మరింత సంక్లిష్టమైనట్టు తెలుస్తోంది. ఈ తరహాలో కొత్త కొత్త సమస్యలు వచ్చి అసలుకే ఎసరు వస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
వెంటాడుతున్న కేసుల భయం?
వాస్తవానికి పార్టీలో చేరకముందు సదరు నేతపై అధికారపార్టీ అనేక కేసులను నమోదు చేయించింది. ఆయనపై రౌడీషీట్ కేసు ఉందని, ఫ్యాక్షనిస్తు అని...ఎమ్మెల్యే పదవికి కూడా అర్హుడు కాదని ఘాటు వ్యాఖ్యలను అనేక సందర్భాల్లో అధికారపార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ కేసులే ఇప్పుడు సదరు నేతకు అడ్డుగా వస్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఎర్రచందనం స్మగ్లరు, రౌడీ షీటర్‌కు పదవి ఇస్తే పార్టీ పరువు ఏం కాను..’ అని పార్టీలోని మరో వర్గం వాదిస్తోంది. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన అందిస్తామని చెబుతూనే ఇటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వడం అంటే ప్రజలకు ఏం సందేశాన్ని పంపుతున్నామో ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అంతేకాకుండా మంత్రి పదవి ఇస్తే అధికార పార్టీలో చేరితే చాలు అన్ని ఆరోపణలు మాఫీ అవుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి పంపినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులు తెగేదాకా మంత్రి పదవి ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీకి చెందిన వ్యక్తిపైనే హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో పార్టీలోని మరో వర్గం మరింత పట్టుబిగించినట్టు తెలుస్తోంది. ఫలితంగా మంత్రి పదవి వ్యవహారం అధికార పార్టీలో మరింత క్లిష్ట సమస్యగా మారిపోయింది.
మా పరిస్థితి ఏంటి...!
మరోవైపు మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని మరో వర్గం అధిష్టానం ముందు వాపోతోంది. నిన్నా మొన్న చేరిన వ్యక్తులకు మంత్రి పదవి ఇస్తే కార్యకర్తలకు ఏం సందేశం పంపినట్టు అవుతుందో ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. తమకు ఇవ్వకుండా కొత్త నేతలకు..అదీ కేసులున్న వారికి ఇస్తే పార్టీకే నష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఇస్తేనే పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. మొత్తం మీద జిల్లాలో మంత్రి పదవి వ్యవహారం ఇంకా చిచ్చురేపుతూనే ఉంది.