క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు హెచ్చరిక
సాక్షి, అమరావతి: మంత్రివర్గ విస్తరణపై పలువురు నాయకులు శ్రుతి మించి ప్రవర్తించారని, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వారి తీరు తనకు బాధ కలిగించిందన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో భగ్గుమన్న ఆగ్రహ జ్వాల గురించి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. నాయకులు ఎవరికైనా అభ్యంతరాలుంటే తనతో నేరుగా చెప్పాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మనందరి లక్ష్యం 2019 ఎన్నికల్లో గెలవడమేనన్నారు. అయినా అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు.
కొందరికి అర్హత ఉన్నా 26 మందికి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న నిబంధన అడ్డుగా మారిందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే సహించేది లేదన్నారు. పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడనని చెప్పారు. ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలన్న విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలన్నారు.
మైనారిటీ శాఖను స్వయంగా పర్యవేక్షించాలని ఎంఏ షరీఫ్ సీఎంను కోరారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం కల్పించలేకపోయామని చెప్పారు. కానీ కేబినెట్ హోదా స్థాయి కలిగిన కార్పొరేషన్ పదవిని వారికి వారం.. పది రోజుల్లోనే ఇస్తానని చెప్పారు. కాగా, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను 6వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తానని కాల్వ పేర్కొన్నారు.