కేసీఆర్ టికెట్ల ప్రతిపాదనలపై జేఏసీ నేతల అసంతృప్తి
నేడు జేఏసీ ముఖ్యుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా బలం లేని స్థానాలను చూపించి పోటీచేయమంటే ఎలా పోటీచేయగలమని తెలంగాణ జేఏసీ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఓట్లు తక్కువగా ఉన్న నియోజకవర్గాలను, టీఆర్‌ఎస్‌కు నిర్మాణం లేని స్థానాలను, కాంగ్రెస్ పెద్ద నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీచేయాలంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా జేఏసీ నేతలు అంటున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, కో కన్వీనర్ దేవీ ప్రసాద్, అధికార ప్రతినిధి సి.విఠల్ తదితరులు ప్రత్యక్ష ఎన్నికల్లో పొల్గొనబోమని ఇప్పటికే ప్రకటించారు.
అయితే వీరి ప్రకటన వెనుక పోటీపై విముఖత కంటే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన స్థానాలే కారణమని తెలుస్తోంది. ఇప్పటిదాకా జేఏసీ నేతలకు ప్రతిపాదించిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు బలం లేదని, ఓడిపోయే స్థానాల్లోనే పోటీచేయాలం టూ జేఏసీ నేతలను ఆహ్వానించారని ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నవారి కి అవకాశం ఇవ్వాలనే కేసీఆర్ యోచన మంచిదే అయినా ఓడిపోయే స్థానాలనే ప్రతిపాదించడంపట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జేఏసీ ముఖ్యనేత అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలే లేవు. వీటిలో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కోరారు.
సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ ఇప్పటికే ఒక ఇన్‌చార్జిని మార్చి అంతర్గత అసంతృప్తిని మూట గట్టుకుంది. మరోసారి కూడా ఇన్‌చార్జీని మారిస్తే మరింత నష్టం జరుగుతుంది. దానికితోడు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, విప్ జయప్రకాశ్‌రెడ్డికి ఆ నియోజకవర్గంలో బలమైన పట్టుంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీఎన్‌జీఓ అధ్యక్షులు దేవీ ప్రసాద్‌కు సూచించారు. దేవీ ప్రసాద్ మాత్రం మెదక్‌లో అవకాశం ఇస్తే పోటీచేస్తానని, లేకుంటే ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు.
మహేశ్వరం, తాండూరు(అప్పటికి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరలేదు), సంగారెడ్డిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని జేఏసీ అధికార ప్రతినిధి విఠల్‌కు సూచిస్తే వెనుకంజ వేశారు. మరో అధికారప్రతినిధి కత్తి వెంకటస్వామి వరంగల్ తూర్పు లేదా పశ్చిమ నియోజకవర్గాల్లో అవకాశం ఇవ్వాలని కోరితే మలక్‌పేటలో పోటీచేయాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ముస్లింలు బలంగా ఉండే మలక్‌పేటలో మజ్లిస్ తప్ప మరో పార్టీ గెలిచే పరిస్థితి లేదు.
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్‌లో తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్‌ను పోటీచేయమంటున్నారు. ఆర్థికంగా, నిర్మాణపరంగా, రాజకీయంగా బలంగా ఉన్న రాజనర్సింహపై రసమయి గెలిచే అవకాశం ఉందా?
తెలంగాణవాదం చాలా తక్కువగా ఉన్న రాజేందర్‌నగర్‌లో లేదా మహేశ్వరం నుంచి పోటీచేయాలని అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డికి ప్రతిపాదించారు. విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి సత్తుపల్లి లేదా వికారాబాద్ ఇచ్చినా ఫలితంలేదు. జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కేసీఆర్ ఇంకా ఎలాంటి ప్రతిపాదననూ చేయలేదు.
నేడు జేఏసీ ముఖ్యుల సమావేశం
ఈ నేపథ్యంలో జేఏసీ ముఖ్యుల సమావేశం శుక్రవారం జరగనుంది. అన్ని పార్టీలకు రాజకీయంగా సమాన దూరంలో ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే విధంగా వ్యవహరించాలని జేఏసీ అనుకుంటున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో అవసరమైన నిర్మాణాత్మక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే తెలంగాణ ప్రభుత్వానికి ఎజెండాను నిర్దేశించి, అమలుకోసం ఒత్తిడి తెచ్చే ప్రజా ఉద్యమ సంఘంగా జేఏసీని కొనసాగించాలని భావిస్తున్నారు.