programmes
-
ట్యాంక్ బండ్‌పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ‘సండే-ఫన్డే’ సందడి మళ్లీ షురూ కానుంది. గణేష్ విగ్రహ నిమజ్జనం కారణంగా గత వారం నిలిపివేసిన సండే ఫండే కార్యక్రమం ఈ ఆదివారం (సెప్టెంబరు 26) తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ ఈవెంట్ మరింత రంగులమయం అవనుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5 నుంmr రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ సందర్శకులకు బాణాసంచా ప్రదర్శనతోపాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళల ప్రదర్శన కనులవిందు కానుంది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఉత్తమ తెలుగు పాటలను అందించే ఆర్కెస్ట్రా ఉంటాయి. దీంతోపాటు ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు కోలాటం వంటి జానపద కళల ప్రదర్శనల భారీ సందడి ఉండనుంది. అంతేకాదు తినుబండారాలు, చేనేత వస్త్రాలు, హస్తకళ స్టాల్లు, ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ కూడా ఉంది. కాగా ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణలు తెలంగాణా పోలీస్ బ్యాండ్ ఆర్కెస్ట్రా - తెలుగు పాటలు ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం బాణాసంచా వెలుగులు తినుబండారాలు చేనేత, హస్తకళల ప్రదర్శన ఉచిత మొక్కలు పంపిణీ.. ఇంకా ఎన్నో #TankBund Sunday-Funday is back on sept 26th from 5-10 pm Attractions : 1. TS Police Band 2. Orchestra - Telugu songs 3. Oggu Dolu, Gussadi & Bonalu Kolatam 4. Fireworks 5. Eateries 6. Handlooms & handicraft 7. Free saplings by @HMDA_Gov & many more @KTRTRSghmc pic.twitter.com/ikGfZ9EbsE — Arvind Kumar (@arvindkumar_ias) September 23, 2021 -
మధుర గాయకుడు జి.ఆనంద్‌కు అంతర్జాలంలో ఘననివాళి
టెక్సాస్: ప్రపంచంలోని ఏడు దేశాలనుంచి పలువురు ప్రముఖులు, కరోనాతో పరమపదించిన మధురగాయకులు జి.ఆనంద్ గారికి అంతర్జాలంలో బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు. ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి,"స్వరమాధురి’ సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6500కుపైగా కచేరీలు నిర్వహించారు. ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారు. ఆనంద్ కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయం అందక మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ కళాకారుల జాతి సంపదని వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి వున్నదని అన్నారు. కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానం ప్రభుత్వాలు పరిశీలించాలని ఆనంద్‌కు నివాళులర్పిస్తూ అన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా , శారద ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలో హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆకునూరి నిర్వహణలో ప్రారంభించారు. న్యూ జెర్సీ నుంచి దాము గేదెల అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాగంటి, ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు. అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల అమెరికాలో ఆనంద్ గారి గానాన్ని చాలా సార్లు విన్నానని వెంటిలేటర్ దొరకక ఒక గాయకుడు మరణించడం తమనెంతో కలచి వేసిందని అన్నారు. ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్, ఘంటసాల రత్నకుమార్, భువన చంద్ర , మాధవ పెద్ది సురేష్, ఆర్ పట్నాయక్, సురేష్ కొండేటి, సారిపల్లి కొండలరావు , డా.నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా.ఆళ్ల శ్రీనివాస్, శారద సింగిరెడ్డి, దాము గేదెల, రవి కొండబోలు,శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్ , హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం సురేఖ మూర్తి దివాకర్ల, జీ.వీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు ఆనంద్ గారితో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని సంతోషం ట్రినెట్ లైవ్ యూట్యూబ్ చానెల్ , సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లైవ్ ప్రసారం చేశాయి. ( చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా ) -
ఏమవ్వా ఎట్లుందే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గ్రేటర్ హైదరాబాద్‌లో ‘పరిచయం’ కార్యక్రమంతో పారిశుధ్య సిబ్బంది, వార్డుల్లో ఉండే కుటుంబాలతో పరిచయం పెంచుకొనేలా చేశాం. సిబ్బంది తమ తమ వార్డుల్లో పర్యటిస్తూ ఆ ప్రాంత ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా నగరంలో పారిశుధ్యం మెరుగుపడుతోంది. ప్రజలు కూడా శానిటేషన్‌పై శ్రద్ధ వహిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరాలంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలు కావాలి. అందుకు ఇక్కడి నుంచే మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశిస్తున్నా’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరిచయం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా నియమించిన పారిశుధ్య సిబ్బంది పేరు, సెల్‌ఫోన్ నంబర్లను విధిగా ఆయా ప్రాంతాల్లో గోడలపై రాయించాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఆయన మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. ముందుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. పాత తోట మురికివాడలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్ధానిక మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి పింఛన్లు, తాగునీరు వస్తున్నాయా లేదా ఆరా తీశారు. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు మంత్రికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించాలని వేడుకున్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం అప్పన్నపల్లిలోని వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ప్రగతి–అమలు అంశంపై నూతనంగా నియమితులైన వార్డు అధికారులు, కమిటీ సభ్యులు, కౌన్సిలర్లకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇప్పటికే తడి, పొడి చెత్త కోసం ప్రత్యేక డబ్బాలు పంపిణీ చేస్తే కొందరు వాటిలో బియ్యం, పప్పు నిల్వ ఉంచుకున్నారని మంత్రి చెప్పారు. తడిచెత్తతో వర్మి కంపోస్టు ఎరువులు, పొడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చనే విషయాన్ని గ్రహించాలన్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం వల్ల వాటిని రైతులకు విక్రయిస్తున్న మెప్మా సభ్యులు ప్రతి నెల రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారని మంత్రి వివరించారు. అన్ని మున్సిపాలిటీలకు కేటాయించిన బడ్జెట్లో పచ్చదనం కోసం 10 శాతం పచ్చదనం పరిరక్షణ కోసం కేటాయించామన్నారు. పట్టణప్రగతిలో భాగంగా నియమించిన గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు వార్డుల్లో పర్యటిస్తూ.. ప్రతి ఇంటికి ప్రజలు ఏ మొక్కలు అడిగినా ఆ మొక్కల్ని పంపిణీ చేయాలన్నారు. మొక్కలు పెరిగేలా సంబంధిత కౌన్సిలర్లే చొరవ తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం వరకు బతకకపోతే కౌన్సిలర్ తన పదవిని కోల్పోతారని హెచ్చరించారు. ఏప్రిల్ రెండు నుంచి టీఎస్‌బీపాస్.. పురపాలికల్లో అవినీతి రహిత పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2 నుంచి టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇళ్లు, భవన నిర్మాణాల కోసం ప్రజలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయానికి రానవసరం లేదని చెప్పారు. 75 గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు అవసరం ఉండబోవని స్పష్టం చేశారు. 75 గజాల నుంచి 600 గజాల వరకు నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లోపే అనుమతులు వస్తాయన్నారు. రాలేదంటే మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి అనుమతులను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారన్నారు. స్వీయ ధ్రువీకరణతో ఇంటి పనులు నిర్ణయించుకుని చెల్లించొచ్చని, ఇచ్చిన సమాచారం తప్పని నిర్ధారణ అయితే అందుకు 25 రేట్లు అధికంగా జరిమానా పడుతుందన్నారు. ఇంటి నిర్మాణ సమాచారం తప్పుగా ఇస్తే అనుమతులు రద్దు అవుతాయన్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకే.. ‘వచ్చే నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లేవు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన సంస్కరణలు, పథకాలకు శ్రీకారం చుడుతోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇలా ఏ కార్యక్రమమైనా ప్రజలకు మంచి చేయాలన్నదే మా ఉద్దేశం. ఇందులో రాజకీయ ఆపేక్ష ఏ మాత్రం లేదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎసేతర కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులనూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఇదే నా పల్లెటూరు: చికాగో ఆంధ్ర సంఘం
చికాగో: ఇదే నా పల్లెటూరు అంటూ హరివిల్లు ముగ్గులు పెట్టి, గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు అని పాటలు పాడుతూ చలి మంటల వెలుగులో కళకళలాడుతున్నాయి. మన తెలుగింటి ఆడపడుచులు చేసిన ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, పిల్లల పల్లె పాటల నృత్యాలు, ఘుమ ఘుమలాడే పిండి వంటలు, బండ్లపై ధాన్యపు రాశులు, ఎడ్ల పోటీలు, కోడి పందాలు, చలాకీగా ఎగిరిన గాలి పటాలు, పల్లె సంబరాలివన్నీ. ఇదంతా మన ఆంధ్రలో కాకుండా ఏడు సముద్రాలు దాటి మన తెలుగు కుటుంబాలు సరదాగా చికాగోలో జరుపుకున్న వేడుకలు. చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఉల్లాసంగా ఏర్పాటు చేసిన పల్లె సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రెసిడెంట్ భార్గవి నెట్టం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 280 మందికి పైగా పిల్లలు, పెద్దలు సమర్పించిన 35 సాంస్కృతిక కార్యక్రమాలకు వేయిమందికి పైగా అతిథులు పాల్గొన్నారు. బోలింగ్ బ్రూక్ హైస్కూల్ లో ఈ కార్యక్రమ వేదిక అలంకరణలను కిరణ్ మట్టె, పవిత్ర కారుమురి, ప్రవేశ ద్వారం వద్ద అలంకరణలను రాజ్ మునగా దంపతులు, జయశ్రీ సోమిశెట్టి అందించి మొత్తం ప్రాంగణానికి నూతన శోభను చేకూర్చి ప్రశంసలను అందుకున్నారు. నీలిమ బొడ్డు, సునీత రాచపల్లి, మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి, అర్చిత దామరాజు సాంప్రదాయ పద్దతిలో పన్నీరు చల్లుతూ ఆహూతులను ఆహ్వానించారు. చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మంది పైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సమత పెద్దమారు, పావని కొత్తపల్లి, శ్వేత కొత్తపల్లి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య రీతులతో పాటు అందరినీ అలరించడానికి విభిన్నమైన సినీ సంగీత కార్యక్రమాలను రూపొందించారు. గురు జానకి ఆనందవల్లి శిష్యుల పూర్వాంగం, గురు అపర్ణ ప్రశాంత్ శిష్యుల మండూక శబ్దం కూచిపూడి నృత్యాలు అందర్నీ అలరించాయి. మాటపాటలతో అదరగొట్టిన వ్యాఖ్యాతలు గురు జ్యోతి వంగర దర్శకత్వంలో పల్లెపదం నృత్యరూపకం ఆంధ్ర పల్లె జీవితాన్ని అమెరికాలో ప్రస్ఫుటింపజేసి అందరి ఆదరణ చూరగొంది. సాహితి ఆదిమూలం, పద్మాకర్ దామరాజు, సవిత యాలమూరి-వెర్నేకర్ వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కోశాధికారి గౌరి శంకర్ అద్దంకి, మాలతి దామరాజు, రామకృష్ణ తాడేపల్లి, అనురాధ గంపాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, కిరణ్మయి వంకాయలపాటి, సురేశ్ శనక్కాయల, నాగరమేశ్ నెక్కంటి, శ్యామ పప్పు తదితరులు సమర్ధవంతంగా నిర్వహించారు. సభ్యులు జమ చేసే వార్షిక సభ్యత్వ రుసుములో పాతిక శాతం సంస్థ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చికాగోలోనే కాక అమెరికా దేశంలోని తెలుగు సంఘాలలో ప్రథమమని ప్రెసిడెంట్ భార్గవి నెట్టం, కార్యదర్శి రాజ్ పోట్లూరి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఈడీ వాణి దిట్టకవి గారు తెలిపారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ..గత ఏడాది అంధ్ర రాష్ట్రంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అందించడమే సీఏఏ లక్ష్యమని వ్యవస్థాపక చైర్మన్ సుందర్ దిట్టకవి పెర్కొన్నారు. ఆహా ఏమి రుచి అంతే కాకుండా చికాగో ఆంధ్ర సంఘం వారు ఏటా తెలుగు రుచులను ఇక్కడి వారికి పరిచయం చేస్తున్నట్లు, విజయ్ కొర్రపాటి నేతృత్వంలో ఈ ఏడాది కూడా సాంప్రదాయబద్ధమైన తెలుగు విందును అందించారు. సంఘ సహ వ్యవస్థాపకులు పద్మారావు- సుజాత అప్పలనేని, శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, రాఘవ-శివబాల జాట్ల, సుందర్-వాణి దిట్టకవి, దినకర్-పవిత్ర కరుమూరి, ప్రసాద్-భార్గవి నెట్టెం, ఉమ కటికి, సంధ్య అప్పలనేని, కార్యవర్గ సభ్యులు శ్రుతి మోత్కూర్, మురళి రెడ్డివారి, శ్రీ హరి జాస్తి, విజయ్ కొర్రపాటి, విష్ణువర్ధన్ పెద్దమారు, సురేష్ పోనిపిరెడ్డి, సత్య నెక్కంటి, సాయి రవి సూరిభోట్ల, సురేష్ ఐనపూడి, రమేష్ తాంగుడు, సతీష్ దేవేళ్ళ, కార్యకర్తలు అతిథులకు కొసరి వడ్డిస్తూ భోజన ఏర్పాట్లను నిర్వహించారు. వందన సమర్పణ, భారత జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. -
వెలుగు కార్యక్రమాల అమలు భేష్
ఎన్ఆర్ఎల్ఎం బృందం కితాబు అనంతపురం టౌన్ : జిల్లాలో వెలుగు కార్యక్రమాల అమలు భేషుగ్గా ఉందని జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ప్రతినిధులు ప్రొఫెసర్ శైలేంద్ర, వికాస్, శృతి కితాబిచ్చారు. సోమవారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాలపై వారు చర్చించారు. డీఆర్డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకాలను వివరించారు. బృందం సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ బృందం మంగళ, బుధవారం యల్లనూరు, 6, 7వ తేదీల్లో రామగిరి మండలాల్లో పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో పథకాల అమలును పరిశీలించి ప్రగతి నివేదికలు జిల్లా అధికారులకు అందివ్వనున్నారు. అదనపు పీడీ సుబ్బరాయుడు, ఏఓ శ్రీనివాసులు డీపీఎంలు రామ్మోహన్, నరసయ్య, ఈశ్వరయ్య, రాధారాణి, సత్యనారాయణ, పాల్గొన్నారు. పాలక వర్గ సభ్యులతో సమావేశం జిల్లా సమాఖ్యకు చెందిన పది మంది పాలకవర్గ సభ్యులతో ఎన్ఆర్ఎల్ఎం ప్రతినిధులు ప్రత్యేకంగాసమావేశమయ్యారు. సమాఖ్య నిర్వహణ, ఆదాయ వనరులు, సబ్ కమిటీల పనితీరు, కాల్ సెంటర్, అన్న సంజీవిని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నిర్వహణపై చర్చించారు. మహిళా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.పార్వతమ్మ, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రయోజనాలు వినియోగించుకోవాలి
జిల్లా విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ ఖమ్మం వ్యవసాయం : ప్రైవేటు డెయిరీల ప్రలోభాలకు గురిగాకుండా ప్రభుత్వ విజయ డెయిరీకి పాలు పోస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని జిల్లా విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు సామినేని హరిప్రసాద్ అన్నారు. మంగళవారం ఖమ్మం రోటరీనగర్‌లోని జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆవరణలో జిల్లాస్థాయి పాల ఉత్పత్తిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రైవేటు డెయిరీలు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పాలను సేకరిస్తూ తిరిగి ఆ పాలను ఈ ప్రాంత వాసులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారన్నారు. కానీ విజయ డెయిరీ లాభాలల్లో 75 శాతం పాడి రైతులకే ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతి లీటరుకు ప్రోత్సాహకంగా రూ.4 చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం పాల రైతులకు అనేక సబ్సిడీలను కూడా ఇస్తోందని, పాడి గేదెల కోసం వివిధ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నారని వివరించారు. అనంతరం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీధర్‌రావు, పశు సంవర్ధకశాఖ శాఖ జేడీ రఘోత్తమరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉపసంచాలకుడు కె.కామేష్, జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.నాగచెన్నారావు, డీఎల్‌డీఏ చైర్మెన్ కొర్లకుంట నాగేశ్వరరావు, నాగేంద్ర, బోజెడ్ల వెంకటయ్య పాల్గొన్నారు. 20సీకెఎం269 : -
ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన
-
జననేతకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆస్పత్రులు, పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. - సాక్షి నెట్వర్క్ -
సారీ.. కేసు సీరియస్!
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : ‘ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలి. మాతాశిశు మరణాలను పూర్తిగా తగ్గించాలి.. అక్కడే తల్లి, బిడ్డ క్షేమం..’ అంటూ వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేకుండాపోయింది.. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ గ్రామీణ స్థాయిలో, పరిసర ప్రాంతాల్లో ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎక్కడికక్కడే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉన్నా ‘సారీ... కేసు సీరియస్ ప్రసవం ఇక్కడ చెయ్యలేం. జిల్లా ఆస్పత్రికి వె ళ్లండి..’ అని ఉచిత సలహా ఇచ్చి కాలక్షేపానికి వచ్చి ఆస్పత్రికి వచ్చిపోతూ గ్రామీణస్థాయి ఆస్పత్రుల సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలోని ఏ ఆస్పత్రికి ప్రసవానికి గర్భిణిని తీసుకెళ్లినా సరిగా చూడటంలేదు. ‘కేసు క్రిటికల్‌గా ఉంది. ఇక్కడుంటే తల్లి, బిడ్డకు ప్రమాదం.. మీరు జిల్లా ఆస్పత్రికి వెళ్లండి..’ అంటూ ఉచిత సలహా ఇవ్వడం మామూలైపోయింది. దీంతో అందరూ అక్కడే ప్రసవానికి ఎగబడటంతో బాలింతలకు వివిధ రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొందరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా ఆస్పత్రికి తరలివెళుతుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సంద ర్భాల్లో వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ప్రసవాలపై పూర్తి సమాచారం సేకరించింది. 2014 ఏప్రిల్ నుంచి గత నెల వరకు( ఏడాది కాలం) జిల్లా ఆస్పత్రిలో సహజ ప్రసవాలు 2,883 జరగగా, ఆపరేషన్ల ద్వారానే 1,377 నమోదయ్యాయి. ఈ లెక్కన ఇక్కడ ప్రతిరోజూ పది నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక ఐదు నుంచి ఎనిమిది వరకు ఆపరేషన్ల ద్వారానే డెవలివరీ అవుతున్నాయి. ఇలా జిల్లా ప్రధాన ఆస్పత్రికి ఎక్కువగా కేసులు వస్తుండటంతో వైద్య సిబ్బంది, వైద్యులకు ఇబ్బందిగా మారింది. -
స్మార్ట్కి దాతలు కావలెను
గురజాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అధికారులకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ వార్డుల్లో పుట్టి పెరిగి ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రవాసాంధ్రుల నుంచి నిధులు సేకరించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నదే స్మార్ట్ విలేజ్ లక్ష్యం. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం నిర్వహణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధులు, ‘జన్మభూమి-మా ఊరు’ కమిటీ సభ్యులతో కలసి గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించాలి. ఆ తరువాత ఎన్ఆర్ఐల నుంచి నిధులు సమీకరించి సమస్యలను పరిష్కరించాలి. గత నెలలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాలు నియోజకవర్గంలో మొక్కుబడిగా జరిగాయి. అధికారులు ఈ కార్యక్రమాన్ని నామ మాత్రంగానే నిర్వహించారు. కొందరు అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. మరికొందరు స్మార్ట్ విలేజ్ కార్యక్రమం తమ చావుకు వచ్చిందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ఆశాజనకంగా లేదనీ, దీని వ ల్ల పంచాయతీలకు ఒరిగేది ఏమీలేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ఈ విధమైన కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐల నుంచి నిధులు వసూలు చేసి గ్రామాభివృద్ధి జరిగే పని కాదని పలువురు అధికారులు గుసగుసలాడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధితో పాటు మండలాభివృద్ధికి కృషి చేయాల్సి వుంది. దీనికి సంబంధించి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 59 గ్రామ పంచాయతీలకు గురజాల మండలం మాడుగుల గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తేలకుట్ల సర్పంచ్ తన గ్రామంలోని 10వ వార్డును దత్తత తీసుకున్నట్టు ప్రక టించారు. ఇంతకు మినహా గ్రామాలు లేదా వార్డుల దత్తతకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ విలేజ్ సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. -
అన్యమత ప్రచారం అడ్డుకోకుంటే ప్రమాదమే
అనంతపురం కల్చరల్ : దేశంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోకుంటే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని పలువురు వక్తలు, స్వామీజీలు అభిప్రాయపడ్డారు. విశ్వహిందూ పరిషత్తు (వీహెచ్‌పీ) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నగరంలో ‘అనంత హిందూ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు అక్కిశెట్టి జయరాముడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ సంస్థ ప్రాంత అధ్యక్షుడు రామరాజు, ఆరెస్సెస్ సంఘ చాలక్ కాకర్ల రంగయ్య, ప్రాంత ప్రచార ప్రముఖ్ నాగేశ్వరరావు, రాయలసీమ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, భజరంగదళ్ సంయోజక్ భానుప్రకాష్, ఉమామహేశ్వరం మఠాధిపతి ప్రణవానంద స్వామీజీ, రాయదుర్గం రామమూర్తి స్వామీజీ, మద్దికెర సూర్యానంద స్వామీజీ, చిన్మయా మిషన్ నిర్వాహకులు స్వామి ఆత్మవిదానంద తదితరులు ప్రసంగించారు. హిందువులందరినీ ఏకం చేయడానికి, ప్రపంచ శాంతి కోసం వీహెచ్‌పీ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విశ్వ గురువుగా భాసిల్లిన భారతీయ సంస్కృతికి భంగం కలుగుతుందని అనుకున ్నప్పుడల్లా ముందుండి పోరాడిందన్నారు. పాశ్చాత్య మోజు, అన్యమత ప్రచారాలతో ఇటీవల విచ్ఛిన్నమవుతున్న సంస్కృతికి పునర్ వైభవం తేవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమస్త హిందూ జాతిని ఏకతాటిపై నిలపడానికి స్వర్ణోత్సవాలు వేదికగా నిలుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన ఆచార వ్యవహారాలను ఇతరులు ఎంతో గౌరవిస్తున్నారని, మనం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నామని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. గీతామాత, గోమాత, భరతమాత, గంగామాత అంటూ సమస్త సృష్టిని తల్లిగా చూసే మన సంస్కృతిని పాడు చేయాలనుకునే వారి ఆటలు కట్టించాలన్నారు. గోమాత ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. గో ఉత్పాదకాలతో నయం కాని జబ్బు ఏదీ లేదన్నారు. అంతకు ముందు నాయకులు, స్వామీజీలు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆకట్టుకున్న బైక్ ర్యాలీ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన బైక్‌ర్యాలీ ఆకట్టుకుంది. దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. అలాగే స్వామీజీలకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన సామూహిక విష్ణుసహస్రనామం, చిన్నారుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామసుందర్, నగర కార్యదర్శి మఠం ఆనంద్, వెంకటేష్, రాధాక్రిష్ణయ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో.. కరివేపాకులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రలోభాలు.. బెదిరింపులకు లొంగి ‘పచ్చ’ కండువా కప్పుకున్న వారికి టీడీపీలో తిరస్కారాలు.. అవమానాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా వారికి ఆహ్వానమే లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిలాంటి పార్టీని వదులుకొని టీడీపీలో చేరినందుకు తగిన శాస్తి జరుగుతోందని కుమిలిపోతున్నారు. ఓట్ల కోసం.. పదవుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ మారేది లేదన్న వారిని సైతం రకరకాల బెదిరింపులకు గురిచేసి పచ్చకండువా కప్పారు. అయితే వారి అవసరం తీరాక కరివేపాకుల్లా విసిరిపారేశారు. ఇటీవల నగరంలో మూడురోజుల పాటు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులిస్తే ఊరుకునేది లేదని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత సైతం మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు కట్టబెట్టాలని చెప్ప టం గమనార్హం. ఇకపోతే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అజీజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. అయితే ఆయనను టీడీపీలోని రెండువర్గాలు అస్సలు పట్టించుకోవటం లేదని తెలిసింది. నగరంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామన్న నిధుల మాటెత్తటం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. ఆయనతో పాటు వెళ్లిన కార్పొరేటర్లకు సైతం టీడీపీలో అవమానాల పాలవుతున్నట్లు వెల్లడించారు. జడ్పీటీసీలను పట్టించుకోని తమ్ముళ్లు : జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన 8మంది జెడ్పీటీసీలకు బలవంతంగా పచ్చకండువాలు కప్పారు. వీరిలో కొందరిని కిడ్నాప్‌చేసి భయపెట్టి టీడీపీకి మద్దతుఇవ్వాలని ఒత్తిడి చేశా రు. అయితే వారికి ఇప్పుడు ఆయా మండలాల్లో టీడీపీ నేతలు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని సమాచారం. టీడీపీ కార్యక్రమాలు నిర్వహించినా సమాచారం కూడా ఇవ్వటం లేదు. సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించారు. ఆకార్యక్రమంలో దొరవారిసత్రం జెడ్పీటీసీ ముప్పాళ్ల విజితను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. పెద్దఎత్తున నిర్వహించిన కార్యక్రమాల్లో కనీసం ప్రొటోకాల్ పాటించిన పాపాన పోలేదు. భారీఎత్తున వెలసిన ఫ్లెక్సీల్లో జెడ్పీటీసీ ఫొటో ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా చిట్టమూరు జెడ్పీటీసీ భారతి పట్ల స్థానిక టీడీపీ నేతలు ఇదేరకం గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానిం చడంలేదు. అదేవిధంగా మిగిలిన ఆరుగురి పరిస్థితీ ఇదేవిధంగా ఉందని వారి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడా నేతలకు తప్పని అవమనాలు మాజీ ఎమ్మెల్యే నెలవల వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయి తే ఆయన్ను టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టిం చుకోవటం లేదు. ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల్లో వేదికపైన తనకు తానే వెళ్లి కూర్చు న్నా.. మాట్లాడేందుకు అవకాశమే ఇవ్వలేదు. అదేవిధంగా ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయితే ఆయనకూ పార్టీలో పెద్దగా గుర్తింపు నివ్వటం లేదని సమాచారం. నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి పీఆర్పీ, ఆతర్వాత కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అయితే ఆయనకు టీడీపీలో తగిన గుర్తింపు ఇవ్వటం లేదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేవిధంగా ఆనం కుటుం బం నుంచి వెంకటరమణారెడ్డి, జయకుమార్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరా రు. అయితే వారిని ఆదాల తప్ప మిగిలిన నేతలు చేరదీయటం లేదు. అదేవిధంగా కాంగ్రెస్‌లో ఉన్న చాట్ల నరసింహారావు టీడీపీలో చేరారు. అయితే చాట్లను మంత్రి వర్గం తప్ప మిగిలిన టీడీపీవర్గాలు పట్టిం చుకోవటం లేదు. విజయాడెయిరీ చైర్మన్ రంగారెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, వైవీ రామిరెడ్డి, స్వర్ణా వెంకయ్య, హరిబాబు యాదవ్, కోటేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయితే వారిని ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధ్యానమే శక్తి
ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహాపిరమిడ్‌లో ప్రపంచ ఐదో ధ్యాన మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది మహాపిరమిడ్‌లో ధ్యానం చేశారు. బ్రహ్మర్షీ పత్రీజీ, ఇతర ధ్యాన గురువులు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కడ్తాల /ఆమనగల్లు: ధ్యానమయ జీవితం సుందరమయమని, ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారే ధ్యానులని ధ్యాన గురువు బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ పేర్కొన్నారు. ధ్యానమే ముక్తి, ధ్యానమే శక్తి అని ధ్యానంతో మనలను మనం శక్తివంతులుగా తయారు చేసుకోవచ్చని అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో జరుగుతున్న ఐదో ధ్యాన మహాచక్రాలు శుక్రవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా పత్రీజీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక వేణునాద ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రీజీ ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. గురువుల సమక్షంలో సాముహిక ధ్యానం, సంగీత ధ్యానం, ప్రకృతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం, యోగ ధ్యానం చేస్తే విశ్వమయ ప్రాణశక్తి మూడురె ట్లు అధికంగా పొందవచ్చని చెప్పారు. మనసంతా మనతో ఉంటూ, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉచ్వాసనిచ్వాసలను గమనించడమే ధ్యానమని పేర్కొన్నారు. మంత్రం, యంత్రం, తంత్రం, మాయా ఏమి లేదని, శ్వాస మీదా ధ్యాసే ధ్యానమని సూచించారు. ధ్యానం... పైసా ఖర్చులేని ప్రక్రియ: మందా నయా పైసా ఖర్చులేని కొత్త ప్రక్రియ ధ్యానమని, పత్రీజీ కొత్త తరహా ఆలోచనలతో ధ్యానాన్ని మనకు పరిచయం చేశారని, ధ్యానం ఖర్చులేని వైద్యమని నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మం దా జగన్నాథం పేర్కొన్నారు. ధ్యానంకు సమయం అంటూ లేదని, మనకు వీలు దొరికిన సమయాల్లో శ్వాసమీద ధ్యాసతో ధ్యానం చేయవచ్చని సూచించారు. శరీరంలోని అన్ని రసాయన ప్రక్రియలను సమతుల్యంలో ఉంచేంది ధ్యానమని తెలిపారు. ధ్యానంలో మనమంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కళలు- ఏడు శరీరాలు, సనాతనం-సనూతనం, విశ్వాసఫలం తదితర ధ్యాన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎంపీ జగన్నాథంను పిరమిడ్ ట్రస్టు సభ్యులతో కలిసి పత్రీజీ సన్మానించారు. -
సమసమాజాన్ని నిర్మించాలి
గుంటూరు ఈస్ట్ : సమసమాజ స్థాపన దిశగా యువతను తీర్చిదిద్దడానికి నెహ్రూ యువకేంద్రం కృషి చేయాలని అదనపు జేసీ వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. వసంతరాయపురంలోని కోల్పింగ్ సెంటరులో ఈ నెల 19వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరంలో బుధవారం జాతీయస్థాయి యువసాధికారత సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జేసీ మాట్లాడుతూ యువత దేశ సంక్షేమం, సమగ్రత కోసం కృషి చేయాలని హితవు పలికారు. జిల్లా యువ కేంద్రం కోఆర్డినేటర్ బి.జె.ప్రసన్న మాట్లాడుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన గ్రామీణ యువతీ యువకులతోపాటు మన రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన వారు శిబిరంలో పాల్గొంటున్నారని చెప్పారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. శిబిరంలో పాల్గొన్న యువత ప్రదర్శించిన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్ ఆహూతులను అలరించాయి. జానపద నృత్యాలు, కర్రసాము, చెక్క భజనలు, కోలాటం చూపరులను కట్టిపడేశాయి. వివిధ జిల్లాల యూత్ కోఆర్డినేటర్లు, కోల్పింగ్ సెంటర్ యూత్ డెరైక్టర్ ఫాదర్ బాలస్వామి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
-
ఆదర్శనీయుడు అంబేద్కర్
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు ఆయూ కార్యాలయూల్లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటాలు, ప్రధాన కూడళ్లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియూడారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం అర్బన్ : బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అంబేద్కర్ అని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. స్థానిక రెండో రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీజీసీ సభ్యులు బి.గురునాథ్‌రెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు ఎగ్గులు శ్రీనివాసులు, ట్రేడ్ యూనియన్ నేతలు కొర్రపాడు హుస్సేన్ పీరా, ఆలూమూరు శ్రీనివాస్‌రెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, బొరంపల్లి ఆంజినేయులు, సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, విద్యార్థి విభాగం నేతలు బండి పరుశురాం, నరేంద్రరెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మార్గ నిర్దేశకుడు అంబేద్కర్ అనంతపురం సిటీ : సమాజానికి మార్గ నిర్దేశకుడు బి.ఆర్. అంబేద్కర్ అని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దళితులు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రసంగించారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాం గ్రెస్ నగర అధ్యక్షుడు దాదా గాంధీ, కాంగ్రెస్ నేతలు పి.వి.అనిల్‌చౌదరి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేవమ్మ, ఐఎన్టీయూసీ నేత రమణపాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం అనంతపురం కల్చరల్ : అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాళ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. అంకాళ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి చల్లపల్లి నరసింహారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వేంకటేశ్వరరెడ్డి, జగన్మహోన్, సీనియర్ నేతలు ఓలేటి రత్నమయ్య, అమరనాథ్, రమణ, మహిళా విభాగం నేతలు ఆదిలక్ష్మమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. సమసమాజ నిర్మాత అంబేద్కర్ : ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ : సమసమాజ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అని ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడిన మహామనిషి అన్నారు. జిల్లా నేతలు ధనుంజయ యాదవ్, జలగల రమేష్, ఎగ్గుల శ్రీనివాసులు, పెన్నోబలేసు, గౌస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
కొండను తవ్వి ఎలుకను పట్టారు!
ఉపాధిహామీ పథకం అధికారుల పనితీరు నలుగురూ నవ్వుకునేలా ఉంది. ఉపాధి పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను రికవరీ చేస్తున్న వైనం చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. పథకం ప్రారంభై ఏడేళ్లు కావస్తుండగా జిల్లాలో ఇప్పటివరకు రూ.7.47 కోట్ల అవినీతి జరిగినట్టు సామాజిక తనిఖీల్లో తేల్చారు. ఇందులో కేవలం రూ.2.42 కోట్లు రికవరీ చేశారు. సామాజిక తనిఖీలు, అవినీతి సొత్తు రికవరీ చేసేందుకు రూ.6.93 కోట్లపైగా ఖర్చు చేశారు. ప్రభుత్వ పథకాలపై వాటి అమలుపై అధికారులుకున్న చిత్తశుద్ధికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి దొరకదేమో! ముకరంపుర : ఉపాధి హామీ పథకం కూలీలకంటే ఎక్కువగా అవినీతిపరులకే ‘ఉపాధి’ కల్పిస్తోందంటే అతిశయోక్తి కాదేమో! కూలీల సొమ్మును కాజేసిన వారిలో అన్ని వర్గాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు. కొత్త టెక్నాలజీలు వస్తున్నా అక్రమాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధులు సైతం అవినీతిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములే. సామాజిక తనిఖీల్లో రూ.కోట్లు పక్కదారిపట్టినట్టు గుర్తించినా.. ఆ సొమ్మును రికవరీ చేయడంలో, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. భారీగా అవినీతికి ఆజ్యం పోసి ఇప్పుడు రికవరీలోనూ తమదైన శైలిలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సామాజిక తనిఖీలతో కేసులు నమోదు చేయడం, సస్పెన్షన్లు, కిందిస్థాయి ఉద్యోగుల తొలగింపునకు మించి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకీ సామాజిక తనిఖీ... జిల్లాలో 2006లో ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించారు. 2007లో సామాజిక తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడేవారి లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు సామాజిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం 7వ సామాజిక తనిఖీ సాగుతోంది. జిల్లాలో 57 మండలాలున్నాయి. మొదటి రెండు దశల్లో 57 మండలాలు, మూడవ దశలో 56 మండలాలు, నాలుగు, ఐదు దశల్లో 57 మండలాలు, ఆరవ దశలో 56 మండలాలు, ప్రస్తుత 7వ దశలో 8 మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. మొత్తంగా 348 మండలాల్లో సామాజిక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రూ.7.47 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. ఇందులో డబ్బుల రూపేణా రూ.5.72 కోట్లున్నాయి. ఈ అవినీతి సొమ్మును రాబట్టేందుకు చర్యలు తీసుకున్నా ఫలితమివ్వలేదు. ఇప్పటివరకు రూ.2.43 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. రూ.2.09 కోట్లను ప్రభుత్వ ఖాతాలో జమచేశారు. తనిఖీలు నిర్వహించినపుడు ఆడిట్ రిసోర్స్పర్సన్లు 10 మంది, ఒక డీఆర్సీతో పాటు అంబుడ్స్‌మెన్ వెళ్తారు. స్థానికంగా ఉన్న ఆడిటర్ సహకారంతో తనిఖీలు నిర్వహిస్తారు. ఏడాదిలో రెండుసార్లు సామాజిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సామాజిక తనిఖీ పూర్తికావడానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల ప్రభుత్వ ధనాన్ని వినియోగించారు. ఈ లెక్కన రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ వీళ్లు రికవరీ చేసింది మాత్రం రూ.2.43 కోట్లే కావడం గమనార్హం. అక్రమార్కుల చిట్టా.. ఆరుసార్లు జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలకు పాల్పడిన వారి వివరాలు పరిశీలిస్తే మొత్తంగా 5,313 మందిపై కేసులు నమోదయ్యాయి. 24 మంది ఎంపీడీవోలు, 81 మంది ఏపీవోలు, 60 మంది ఏఈలు, 719 మంది టీఏలు, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు, 364 మంది సీవోలు, 2769 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు 121 మంది ఈసీలు, ఏడుగురు పీఎస్‌లు, 25 మంది సర్పంచులు, 77 మంది వీవోలు, 216 మంది బీపీఎంలు, 46 మంది గ్రౌండ్ లీడర్లు, 615 మంది మేట్లు, 187 మంది ఇతరులున్నారు. ఇందులో కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందులో ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏడుగురు టీఏలు, ఒక సీవో, ఇద్దరు ఏపీవోలు, నలుగురు ఎంపీడీవోలు, ఇద్దరు ఏఈలు, ముగ్గురు ఈసీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసులను రెండు కేటగిరీలుగా విభజించారు. బీ-కేటగిరీలో పరిశీలిస్తే సస్పెండయిన వారిలో 22 మంది ఎఫ్‌ఏలు, ఒక టీఏ, ముగ్గురు ఇతరులున్నారు. ఇందులో ప్రత్యేకించి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 12 మంది ఎఫ్‌ఏలు, ఇద్దరు టీఏలు, మరో ఇద్దరు ఏపీవోలు, 14 మంది బ్రాంచి పోస్టుమాస్టర్లు, ఐదుగురు ఎంపీడీవోలు, ఇద్దరు ఏఈలు, ఐదుగురు సర్పంచులు, ఐదుగురు మేట్లున్నారు. డబ్బు ఖర్చయినా ఫలితముంది.. ఉపాధిహామీ పథకంపై సామాజిక తనిఖీల్లో డబ్బు ఖర్చయిన మాట వాస్తవమే. ఒక్కో తనిఖీకి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చయ్యింది. కానీ ఎక్కువ కేసుల పరిష్కారం, తక్కువ అవినీతి జరగడంలో జిల్లా ముందుంది. సామాజిక తనిఖీలతో అవినీతి కూడా తగ్గింది. - ఇన్చార్జి డ్వామా పీడీ శ్రీనివాస్ కేసులు పెట్టడంతో సరిపోదు.. ఉపాధిహామీ పథకంలో సామాజిక తనిఖీలతో కేసులు పెట్టడంతో సరిపోదు. అవినీతి సొమ్మును రికవరీ చేసి కూలీలకు అందించాలి. అవినీతిలో పెద్దల హస్తం ఉంది. కేవలం కింది స్థాయి సిబ్బందిపై తోసేయడం సరికాదు. సామాజిక తని ఖీలతో కూలీలకు ఒరిగిందేమీ లేదు. - గుడికందుల సత్యం, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు -
పోలీసుల చర్యకు నిరసనగా ధర్నా
కళ్యాణదుర్గం : పోలీసుల చర్యలను నిరసిస్తూ తోపుడుబండ్ల కార్మికులు రోడ్డెక్కారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అశ్వర్థనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. తోపుడు బండ్ల కార్మికులు కిష్ట, మోహన్‌లాల్, రవూఫ్, ఖాజా తదితరులతో కలిసి ఆందోళనకు దిగారు. బళ్ళారి రోడ్డులోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి పట్టణ పురవీధులలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తోపుడు బండ్ల కార్మికులకు అన్యాయం చేయకూడదని, ఉపాధి మార్గం చూపాలని నినాదాలు చేశారు. మునిసిపల్ కార్యాలయాన్ని గంట పాటు ముట్టడించారు. కార్యాలయ ప్రధాన గేట్‌ను మూసివేశారు. అనంతరం అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరిని నిలదీశారు. ఉన్నఫలంగా తోపుడు బండ్లు తొలగించాలంటే తాము ఎలా బతకాలని ఏకరువు పెట్టారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మునిసిపల్ చెర్మైన్ వై.పి.రమేష్‌తో చర్చించారు. పది రోజులలో రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టేందుకు ఆక్రమణ దారులకు నోటీసులు పంపుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తోపుడు బండ్ల కార్మికులకు ఇబ్బంది పెడ్డకూడదని టౌన్ ఎస్ఐ జయనాయక్‌కు పోన్లో సూచించారు. దీంతో కార్మికులు అక్కడి నుంచి ర్యాలీగా టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. -
మిన్నంటిన ‘సమైక్య’ నినాదం
అనంతపురం కలెక్టరేట్/సిటీ, న్యూస్‌లైన్ : ‘సమైక్య’ నినాదం మిన్నంటింది. రాష్ట్ర విభజనను ఉద్యోగులు ముక్తకంఠంతో నిరసించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని సీమాంధ్ర ఎంపీలను హెచ్చరించారు. ఎన్జీఓలు, ఇతర ఉద్యోగులు ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీపై కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ, ట్రెజరీ ఉద్యోగులు టమోటాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి జయరామప్ప, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఫరూక్ అహమ్మద్ మాట్లాడుతూ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే నాయకులు ప్యాకేజీల కోసం ఢిల్లీ టూర్లు వేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, ఏపీ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దయాకర్, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నిర్వహించిన ‘రన్‌ఫర్ సమైక్యాంధ్ర’ విజయవంతమైంది. ఉద్యమకారులు ఒకే రంగు దుస్తులు ధరించి సమైక్య నినాదాన్ని మార్మోగించారు. స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సప్తగిరి, టవర్‌క్లాక్ సర్కిళ్ల మీదుగా పాతూరు వరకూ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి జాక్టో, యూత్ జేఏసీ, ఐఎంఏ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర ఐక్యవేదిక నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఐఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా, సీఆర్ఐటీ విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులకు సమ్మె సెగ ఏపీ ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వల్ల పలు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసింది. ఈ నెల 10 నుంచి 25 వరకు జిల్లాలో జరగాల్సిన రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఉద్యోగులు ఉన్నట్టుండి సమ్మె చేపట్టడంతో సదస్సులను వాయిదా వేయక తప్పలేదు. -
అడవిని తలపిస్తున్న మహిళా ప్రాంగణం
నెల్లూరు (పొగతోట), న్యూస్‌లైన్: మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మహిళా ప్రాంగణం అడవిని తలపిస్తూ భయాందోళన కలిగిస్తోంది. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో మహిళా ప్రాంగణాన్ని నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో చెట్లు విపరీతంగా పెరిగి అడవిని తలపిస్తోంది. విష పురుగులు సంచరిస్తుండటంతో మహిళలు భయపడుతున్నారు. ఈ ప్రాంగణంలో విద్యార్థులకు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 90 మంది గ్రామీణ విద్యార్థినులకు మూడు నెలలుగా కుట్టు శిక్షణ, మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలకు న్యూట్రిషన్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఆదరణ లేని మహిళలు, వితంతువులు అనేక మంది ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్నారు. సుమారు 200 మంది మహిళలు, విద్యార్థినులు ప్రాంగణంలో ఉంటూ ఉపాధి కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంగణం ముళ్ల చెట్లు, పిచ్చి చెట్లు పెరిగి విషపురుగులకు నిలయమైంది. రాత్రి వేళల్లో వారు వెలుపలికి రావాలంటే ఆందోళనకు గురవుతున్నారు. ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. హాస్టల్ మరమ్మతులకు గురైంది. వర్షం పడితే పైకప్పు ఉరుస్తుంది. హాస్టల్ మరమ్మతులకు రూ.8.50 లక్షలు జిల్లా పరిషత్ నిధుల నుంచి కేటయించారు. ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. పంచాయతీరాజ్ శాఖకు పనులు అప్పగించారు. సేవా సదన్‌లో ఆదరణలేని మహిళలు జీవనం సాగిస్తున్నారు. 100 మందికి పైగా మహిళలు సేవాసదన్‌లో ఉంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాంగణం అడవిని తలపిస్తోంది. సేవాసదన్ మహిళలతో అక్కడి భూమిలో కూరగాయలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటే వారికి ఆదాయం లభిస్తుంది. ప్రాంగణంలో చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ లైట్లు సక్రమంగా వెలిగేలా జిల్లా అధికారుల చర్యలు తీసుకోవాలని మహిళలు, విద్యార్థినులు కోరుతున్నారు. -
‘ఆరాధన’.. అరణ్యరోదన
వేములవాడ, న్యూస్‌లైన్: ఒకప్పుడు ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జిక్కీ, జానకీ వంటి మహామహులు గానం చేసిన వేదిక అది.. నేడు పేరెన్నికగన్న ఒక్క కళాకారుడు లేని వైనం.. గాత్ర కచేరీలకు బదులు సినీ భక్తి గీతాలాపన చేసే దైన్యం.. ఇదీ ఏటా రాజన్న ఆలయంలో నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రహసనం. క్రమంగా వేడుకలు కళతప్పుతున్నాయి. అంతేకాకుండా ఆహ్వాన పత్రిక ముద్రణ విషయంలో నిర్లక్ష్యం. కార్యక్రమ తేదీలను తప్పుగా ముద్రించిన నిర్లిప్తత. ఆరు దశాబ్దాల క్రితం అంకురించిన ఈ ఉత్సవాలు కీర్తి ఏటా దిగజారుతుంది. ఆరు దశాబ్దాల చరిత్ర.. ఈ సంవత్సరం 61వ త్యాగరాజ ఆరాధనోత్సవాలను ని ర్వహించేందుకు రాజన్న ఆలయ అధికారులు రంగం సి ద్ధం చేశారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మొదట బ్రాహ్మణుడైన చెవిటి సాంబమూర్తి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన తదనంతరం రాజన్న ఆలయం ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది. కాలక్రమేనా ఇక్కడికి వచ్చిన అధికారులు సైతం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించారు. అంతే అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిం చారు. అయితే ఏటా బడ్జెట్ పెరుగుతున్న ఉత్సవాల కీర్తి తగ్గుతుంది. ఇక ఆహ్వానపత్రికలోని రెండో పేజీలో ఉత్సవాల తేదీలను సైతం తప్పుగా ముద్రించారు. ఒకప్పటి తో పోలిస్తే ఆదాయం పదింతలు పెరిగింది. అయినా ని ర్వహణ మాత్రం అంతంతే. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఓ జూనియర్ అసిస్టెంట్ కేడర్ అధికారి తీసుకున్నారు.అయితే అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు, పాలకవర్గం దృష్టి పెట్టకపోవడం శోచనీయం. అయినవారికీ, బంధుప్రీతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.4 లక్షలతో 45 కార్యక్రమాలు ఈ సంవత్సరం సుమారు రూ. 4 లక్షలకు పైగా బడ్జెట్‌ను కేటాయించారు. కార్యక్రమాల విషయానికొస్తే 5 రోజుల పాటు 45 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆహ్వానపత్రిక సూచిస్తుంది, దురదృష్టమేమిటంటే ఈ ఐదు రోజుల్లో ఏనాడూ ఒక్క పేరెన్నికగన్న కళాకారుడి కార్యక్రమం లేకపోవడం. ఒకరిద్దరు కళాకారుల గాత్రకచేరీలు మినహా అంతా మమ అనిపించేలా తెలుస్తుంది. ఇక త్యాగరాజ కృతులు వినిపించాల్సిన వేదికపై సినీ భక్తిసంగీతం, హరికథ, బుర్రకథలకు ప్రాధాన్యతనిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. -
సీఎంకు దెయ్యం పట్టింది
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనకు దెయ్యం పట్టిందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎల్లారెడ్డిపేటలో శనివారం జరిగిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ.. సీఎం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే తెలంగాణకు అడ్డంకులు సృష్టించేం దుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసిన ప్పటికీ ప్రజలను పక్కదారి పట్టించడం కోసం సీఎం రచ్చబండ సభలను వేదికలుగా ఉపయోగించుకుంటున్నాడని దుయ్యబట్టారు. అమరుల త్యాగాల ఫలితంగా ఆంక్షలు లేని రాష్ట్రం జనవరి నాటికి ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రెట్టింపుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
ఉద్యమం ఉగ్రరూపం
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే ఒకటే లక్ష్యం, దీక్ష, పట్టుదలతో సింహపురి వాసులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. 61వ రోజూ ఉద్యమం ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నెల్లూరులోని వీఆర్సీ కూడలిలో యూటీఎఫ్, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ, గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఎన్జీఓ హోంలో ఆర్అండ్బీ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్దతు తెలిపారు. నవాబుపేట సెంటర్లో మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు రిలే దీక్ష చేశారు. ఏసీ సెంటర్లో ఆర్కెస్ట్రా కళాకారులు 12 గంటల పాటు సమైక్యస్వరయజ్ఞం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంక్షేమ భవన్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు మాదిగ గర్జన ర్యాలీ సాగింది. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపైనే కుండ లు చేస్తూ నిరసన తెలిపారు. ఏపీ అగ్రవర్ణాల పేదల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోసుబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. సూళ్లూరుపేటలో కారు డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 కార్లతో భారీ ర్యాలీ జరిగింది. డ్రైవర్ కోయా అహ్మద్ అరగుండు, అర మీసంతో నిరసన తెలిపారు. మరో డ్రైవర్ రాజశేఖర్ గుండు గీయించుకున్నాడు. తడ, నాయుడుపేట, దొరవారిసత్రంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. ఆత్మకూరులో సమైక్యవాదులు రిలేదీక్ష కొనసాగించారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో రిలేదీక్షలో ఉన్న ఉద్యోగులకు టీడీపీ నేత బొల్లినేని రామరావు సంఘీభావం ప్రకటించారు. సీతారామపురంలో చిన్నారులు దీక్షలో కూర్చున్నారు. వింజమూరు విజృంభణ విజయవంతమైంది. వరికుంటపాడులో జడదేవి యువకులు రిలేదీక్ష చేయగా, దుత్తలూరు సెంటర్లో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో ఎన్టీఆర్ అభిమానులు, లేగుంటపాడులో రైతులు దీక్షలో కూర్చున్నారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్రతీరంలో ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ రథం ముత్తుకూరుకు చేరుకోగా, సమైక్యాంధ్ర పతాకాన్ని ఈదూరు రాంమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్లో జేఏసీ నాయకులు రోడ్డుపై గోలీలాట ఆడి నిరసన తెలిపారు. కోట మండలంలోని లక్ష్మమ్మ గిరిజన కాలనీ, నార్త్ గిరిజన కాలనీ, లింగాలస్వామి గుడి కాలనీల గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. -
సడలని సంకల్పం
సాక్షి, కడప: సమైక్య ఉద్యమం ఊహించని విధంగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 31న జిల్లా వాసులు బిగించిన పిడికిలి 60రోజులైనా సడలలేదు. 60రోజుల ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు తలెత్తాయి. ఓ వైపు సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే..మరో వైపు కేంద్రం తెలంగాణపై కేబినేట్ నోట్ సిద్ధం చేస్తోందని... ఈ పరిస్థితుల్లో ఉద్యమం అవసరమా? అని కొందరు తడబడ్డారు. ఆర్థిక సమస్యలతో ఉద్యమాన్ని నడపడం కష్టమవుతోందని మరికొందరు నీరసించారు. అయితే సమైక్య ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న వారు మాత్రం ఏ దశలోనూ పట్టువీడలేదు. లక్ష్యంపై నమ్మకాన్ని కోల్పోలేదు. సమైక్యసాధన కోసం ఎప్పటికప్పుడు భవిష్యత్ కార్యాచరణ రచిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ‘సీమ’ నష్టంపైనే ప్రధానంగా ఫోకస్: ఉద్యమం మొదలైనప్పుడు సమైక్యంగా ఉండాలని అందరూ మాట్లాడారు. చాలామంది ప్రజలు కూడా ఇదే పెద్ద సమస్య అని భావించారు. అయితే ఉద్యమకాలంలో సమైక్యనేతల గళం కూడా మారుతోంది. విడిపోతే సీమకు ముఖ్యంగా జిల్లాకు వాటిల్లే నష్టాలను ఏకరువు పెడుతున్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదని, విడిపోతే మరిన్ని కష్టాలు తప్పవని వివరిస్తున్నారు. మొన్నటి వరకూ జల కేటాయింపులంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఉద్యమ ప్రభావంతో అధికశాతం మంది విడిపోతే ఏ ప్రాజెక్టు ఏమవుతుందో, ఏ ప్రాంతం ఎడారిగా మారుతుందో ఇట్టే చేప్పే అవగాహన తెచ్చుకున్నారు. విడిపోతే తలెత్తే నష్టాలపై ఇప్పుడే ఉద్యమించాలని సంకల్పించారు. సమష్టిగా ఉద్యమిస్తున్నారు. అందుకే ఉద్యమం రోజురోజుకూ బలోపేతం అవుతోంది. ఓవైపు ఆర్థికంగా నష్టపోతున్నా ఉద్యమానికి ప్రజలు, వ్యాపారుల నుంచి మద్దతు లభిస్తోంది. విజయవంతగా సాగుతోంది. పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడినా: దాదాపు రెన్నెళ్లుగా పిల్లల చదువులు ఆగిపోయాయి. ఉద్యమంతో పిల్లల చదువుకు నష్టం వాటిల్లుతోందని, తరగతులకు వెళదామని కొందరు టీచర్లు ఆలోచిస్తున్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌పై అధికంగా ఆధారపడుతున్నామని, విడిపోతే అది శాశ్వతంగా దూరమవుతుందని విద్యావంతులు విద్యార్థులకు వివరిస్తున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెబుతున్నారు. దీంతో విద్యార్థులూ సమైక్యరాష్ట్రంలో భాగస్వాములవుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులతో..: ఉద్యమంలో ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగులూ సమ్మెలో ఉండటంతో సెప్టెంబరు 1న జీతాలు అందలేదు. అక్టోబరు 1న కూడా అందే పరిస్థితి లేదు. దీంతో అటెండర్లు, చిన్నస్థాయి ఉద్యోగులతో పాటు చాలామంది ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరిలో ఉద్యమంతో ఇబ్బంది పడుతున్నామనే బాధ లేదు. విడిపోతే తలెత్తే కారణాలు తెలుసుకుని బాసటగా నిలుస్తున్నారు. జిల్లాలోని 26వేలమంది ఉద్యోగులకు ఇప్పటికే 80 కోట్ల రూపాయల వేతనాలు నిలిచిపోయాయి. ఉద్యమంతో జిల్లాకు దాదాపు 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినప్పటికీ తెలంగాణలోని సకల జనుల సమ్మెను సీమాంధ్ర సకలజనుల సమ్మె దాటిపోయింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 2011 సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకూ సకలజనుల సమ్మె కొనసాగింది. ప్రస్తుతం సమైక్యరాష్ట్రం కోసం ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యమం సాగుతోంది. ఇప్పటికి సకజనుల సమ్మె మొదలై 45 రోజులు పూర్తయింది. వైఎస్సార్సీపీ ప్రకటనపై ఉద్యోగుల్లో చర్చ: అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తీర్మానం చేయాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగుల్లో మద్దతు లభిస్తోంది. -
గణపయ్య సాక్షిగా సమైక్యపోరు
ఓ వైపు వినాయక చవితి సంబరాలు..మరో వైపు సమైక్య నినాదాలు.. ఆదివారం పట్టణప్రాంతాలు కిటకిటలాడాయి. ఉద్యమ పోరు మొదలై ఆదివారంతో 40 రోజులైంది. అయినప్పటికీ సాధారణ ప్రజల నుంచి ఉద్యోగుల దాకా ఎవరిలోనూ ఇసుమంతైనా పట్టు సడలలేదు. మరింత ఉద్యమస్పూర్తితో లక్ష్యసాధన వైపు ముందుకు సాగుతున్నారు. సాక్షి, కడప: ‘గణపతిబప్పా మోరియా..జై బోలో గణేశ్మహారాజ్కి జై’..అనే భక్తి నినాదాలు ఓవైపు...‘జై సమైక్యాంధ్ర...తెలుగు తల్లిని విడగొట్టొద్దు...గుండెకోత మిగలనివ్వొద్దు’ అంటూ సమైక్య నినాదాలు మరో వైపు..రెండిటి నడుమ జిల్లాలోని పట్టణప్రాంతాలు జనంతో హోరెత్తాయి. ఉద్యమం మొదలై ఆదివారంతో 40రోజులైంది. అయినా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కడపలో అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఆర్వో ఈశ్వరయ్య, నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మయ్యతో పాటు గ్రూప్-1 అధికారుంతా కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉద్యమానికి మరింత స్పూర్తినిచ్చారు. వీరితో పాటు కడప జర్నలిస్టుల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాముల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. సాక్షి బ్యూరోఇన్చార్జ్ మోపూరి బాలకృష్ణారెడ్డి, సిటీకేబుల్ సూరి, సూరిబాబుతో పాటు పలువురు జర్నలిస్టులు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చేందుకు వ్యక్తిగతంగా కూడా తాము ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చామని బాలకృష్ణారెడ్డి అన్నారు. లక్ష్యసాధనకు అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఉద్యమకారులకు ఆయన అభినందనలు తెలియచేశారు. న్యాయవాదులు, కార్పొరేషన్, డీఆర్డీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులు, డీఆర్డీఏ, ఐకేపీతో పాటు పలు ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పొద్దుటూరులో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు రిలేదీక్షలకు కూర్చున్నారు. రూరల్ మండలంలోని ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. ప్రైవేటు బీమా కంపెనీలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ కార్యాలయం నుంచి పాత గంగిరెడ్డి ఆస్పత్రి వరకూ వందల ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల సర్కిల్ వద్ద ఆటోలతో పాటు డ్రైవర్లు, మహిళలు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, జేఏసీ, వైఎస్సార్సీపీ నేత శివప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. రాజంపేటలో శ్రీకృష్ణదేవరాయ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రె వెన్యూ, న్యాయవాదులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు వైఎస్సార్సీపీ నేత కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో వందమంది రిలేదీక్షలకు కూర్చున్నారు. జమ్మలమడుగులో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. రాయచోటిలో తైక్వాండో విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు జేఏసీ శిబిర వద్ద బ్రాహ్మణ మిత్రమండలి ఆధ్వర్యంలో శాంతిహోమం నిర్వహించారు.ఆర్టీసీ ఉద్యోగులు చెరుకుగడలు, అరటిపిలకలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉద్యోగ జేఏసీ, క్రిస్టియన్ మిషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. మైదుకూరులో న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. బద్వేలులో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అనాథవృద్ధులు, అనాథ బాలలు, బాలకార్మికులు ర్యాలీ నిర్వహించారు.