అనంతపురం కల్చరల్ : దేశంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోకుంటే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని పలువురు వక్తలు, స్వామీజీలు అభిప్రాయపడ్డారు. విశ్వహిందూ పరిషత్తు (వీహెచ్‌పీ) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నగరంలో ‘అనంత హిందూ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు.
వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు అక్కిశెట్టి జయరాముడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ సంస్థ ప్రాంత అధ్యక్షుడు రామరాజు, ఆరెస్సెస్ సంఘ చాలక్ కాకర్ల రంగయ్య, ప్రాంత ప్రచార ప్రముఖ్ నాగేశ్వరరావు, రాయలసీమ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, భజరంగదళ్ సంయోజక్ భానుప్రకాష్, ఉమామహేశ్వరం మఠాధిపతి ప్రణవానంద స్వామీజీ, రాయదుర్గం రామమూర్తి స్వామీజీ, మద్దికెర సూర్యానంద స్వామీజీ, చిన్మయా మిషన్ నిర్వాహకులు స్వామి ఆత్మవిదానంద తదితరులు ప్రసంగించారు. హిందువులందరినీ ఏకం చేయడానికి, ప్రపంచ శాంతి కోసం వీహెచ్‌పీ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
విశ్వ గురువుగా భాసిల్లిన భారతీయ సంస్కృతికి భంగం కలుగుతుందని అనుకున ్నప్పుడల్లా ముందుండి పోరాడిందన్నారు. పాశ్చాత్య మోజు, అన్యమత ప్రచారాలతో ఇటీవల విచ్ఛిన్నమవుతున్న సంస్కృతికి పునర్ వైభవం తేవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమస్త హిందూ జాతిని ఏకతాటిపై నిలపడానికి స్వర్ణోత్సవాలు వేదికగా నిలుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మన ఆచార వ్యవహారాలను ఇతరులు ఎంతో గౌరవిస్తున్నారని, మనం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నామని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. గీతామాత, గోమాత, భరతమాత, గంగామాత అంటూ సమస్త సృష్టిని తల్లిగా చూసే మన సంస్కృతిని పాడు చేయాలనుకునే వారి ఆటలు కట్టించాలన్నారు. గోమాత ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. గో ఉత్పాదకాలతో నయం కాని జబ్బు ఏదీ లేదన్నారు. అంతకు ముందు నాయకులు, స్వామీజీలు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆకట్టుకున్న బైక్ ర్యాలీ
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన బైక్‌ర్యాలీ ఆకట్టుకుంది. దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. అలాగే స్వామీజీలకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన సామూహిక విష్ణుసహస్రనామం, చిన్నారుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామసుందర్, నగర కార్యదర్శి మఠం ఆనంద్, వెంకటేష్, రాధాక్రిష్ణయ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
అన్యమత ప్రచారం అడ్డుకోకుంటే ప్రమాదమే
Published Mon, Feb 16 2015 3:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement