swamyji
-
'అప్పటి వరకు ఇబ్బందులు తప్పవు.. రాబోయే రోజుల్లో మరిన్ని చావులు'
హుబ్లీ: కార్తీకమాసం నుంచి ఉగాది వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని ధార్వాడలో కోడి శ్రీ మఠం స్వామీజీ జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరి వరకు, ఆ తర్వాత కూడా అశుభాలే ఉంటాయన్నారు. గాలి వానలు, భుకంపాలు, అగ్నిప్రమాదాలు, చావులు వంటివి పెరుగుతాయన్నారు. రోగాలతో జీవరాశులు మృత్యువాత పడుతాయన్నారు. రాజకీయ అస్థిరత ఉంటుందని, అన్ని పార్టీలు విడిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. మూడు పార్టీల్లో చిలికలు తప్పవన్నారు.తాను ఏ వ్యక్తినీ ఉద్దేశించి చెప్పడం లేదని, తాను సన్యాసినని పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగుతాయని, రబీ పంటలు అన్నదాతకు చేతికందుతాయన్నారు. చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..) -
మూగబోయిన ప్రభోదాశ్రమం
అనంతపురం, తాడిపత్రి రూరల్: ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంతకర్త, బహుగ్రంథకర్త ప్రభోదానంద స్వామి ఇక లేరు. రెండు రోజుల క్రితం గుండెపోటు గురైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని గురువారం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ మందిరం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఈ నెల 7న ఆస్పత్రికి తరలిస్తుండగా.. గతంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ప్రభోదానంద స్వామి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నెల 7న తిరిగి ఆయన గుండెలో నొప్పిగా ఉందంటూ బాధపడుతుంటే చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు కుమారుడు గుత్తా యోగానంద చౌదరి తెలిపారు. 1950లో జన్మించిన ప్రభోదానంద పూర్తి పేరు గుత్తా పెద్దన్న చౌదరి. స్వగ్రామం పెద్దపప్పూరు మండలం అమ్మళ్ళదిన్నె కొత్తపల్లి గ్రామం. భారత సైన్యంలో వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే దైవజ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగాన్ని వదిలి, తాడిపత్రి ప్రాంతానికి వచ్చారు. కొంత కాలం ఆర్ఎంపీగా పలువురికి వైద్య సేవలు అందించారు. ఆధ్యాత్మిక జీవితంతో పేరు మార్పు కులాంతర వివాహం చేసుకున్న పెద్దన్న చౌదరి.. కాలక్రమంలో ఆయుర్వేద వైద్యంపై కొన్ని పుస్తకాలు వెలువరించారు. అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు ఆయన దృష్టి మళ్లింది. ఆధ్యాత్మిక అంశాలపై పరిశోధనాత్మక రచనలు కొనసాగించారు. దైవజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనతో ‘ఇందూ జ్ఞానవేదిక’ను స్థాపించి దేవుడు ఒక్కడేనని చాటిచెబుతూ వచ్చారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో ఉన్న దైవజ్ఞానం అందరికీ ఒక్కటేటని బోధిస్తూ త్రైత సిద్దాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అనేక గ్రంథాలను రచించి 1980న ప్రభోదానందస్వామిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంబించారు. వివాదాలకూ కేంద్రబిందువు త్రైత సిద్ధాంత బోధనలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన ప్రభోదానంద స్వామి.. ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 1990లో ఓ సారి ఆశ్రమంపై దాడులు జరిగాయి. అలాగే 2018 సెప్టెంబర్ 16న ప్రభోధానంద ఆశ్రమంపై జరిగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచనలమయ్యాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఆయన రాసిన ఓ పుస్తకంపై 2017లో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతర పరిణామాలు, రాజకీయ కక్షలు కారణంగా ఆయన భక్తులకు ఆశ్రమంలో అందుబాటులో లేకుండా పోయారు. అయినా సామాజిక మాధ్యమాల ద్వారా తన బోధనలను భక్తులకు వినిపిస్తూ వచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రభోదానంద స్వామి కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న ఆయన భక్తులు గురువారం ఉదయం నుంచి చిన్నపొడమల గ్రామంలోని ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. భక్తుల రాకను గమనించిన పోలీసులు అప్రమత్తమై కోవిడ్–19 నేపథ్యంలో వారికి అనుమతులు నిరాకరిస్తూ ఎక్కడికక్డ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో నుంచే భక్తులను వెనక్కు పంపిస్తూ వచ్చారు. ఆశ్రమంలోని భక్తులకు ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి రూరల్, పట్టణ సీఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రభోదానంద పార్థివ దేహం సందర్శనకు బీజేపీ నాయకులు అంకాల్‌రెడ్డి, ప్రతాపరెడ్డి ఆశ్రమానికి వచ్చారు. వారికి ఆయన కుమారుడు గుత్తా యోగానంద చౌదరి వివరాలు తెలిపారు. తహసీల్దార్ నయాజ్ అహమ్మద్, ఎంపీడీఓ రంగారావు అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం రాత్రి ప్రభోదానంద అంత్యక్రియలను ఆశ్రమంలోనే నిర్వహించారు. -
మీ టూ సుడిలో స్వామీజీ
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: సినీ రంగాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల ‘మీటూ’ విస్తరిస్తోంది...తాజాగా బుధవారంనాడు ఒక మహిళ... స్వామీజీ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదంటూ ఫేస్బుక్లో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త మీడియా దృష్టికి వెళ్లడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా వనకల్లు మఠం బసవ రమానంద స్వామీజీ పై ఆ మహిళ ఈ ఆరోపణలు చేసింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ.. స్వామీజీ పని ఇప్పిస్తానని చెప్పి ఒంటరిగా మఠానికి పిలిపించి అత్యాచారం చేశాడని పేర్కొంది. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని, నీ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన జరిగాక 7 నెలల క్రితం డాబస్‌పేట పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, స్వామీజీపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరపకుండా డాబస్‌పేట ఎస్సై శంకర్ నాయక్ బీ–రిపోర్టు వేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించింది. కక్షతో చేయిస్తున్నారు: రమానందస్వామీజీ రమానంద స్వామీజీ స్పందిస్తూ, ఇవన్నీ తనపై కక్షతో మధుమయానంద స్వామీజీ ఆ మహిళతో నాటకం ఆడిస్తున్నాడని, ఆమెతో పరిచయమే లేదని, ఎటువంటి వైద్య పరీక్షలకయినా తాను సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ ఈ ఆరోపణ రుజువయితే మఠాన్ని వదిలి ప్రాణత్యాగం చేసుకుంటానని సవాలు చేశారు. ఆ మహిళతో తనకు కూడా పరిచయంలేదని, పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసి ఆమెకు మద్దతుగా మాత్రమే నిలిచానని మధుమయానందస్వామి చెబుతున్నారు. ఒక మహిళ, ఇద్దరు స్వామీజీల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందోనని వనకల్లు మల్లేశ్వర మఠం భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
తప్పయిపోయింది స్వామీజీ..!
ఆయన ఒక స్వామీజీ. నీతి, నిజాయితీ, ఓర్పు, సత్యవాక్పాలన, అహింసల విశిష్టతలను, వాటిని పాటించడం వల్ల సమాజానికి కలిగే మంచిని చక్కగా వివరిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఓ ఆకతాయికి కొంటె బుద్ధి పుట్టింది. భక్తి ఉన్నవాడిలా నటిస్తూ, స్వామీజీ దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించాడు. చిరునవ్వుతో ఏమిటన్నట్టు చూశారు స్వామీజీ. ‘‘స్వామీ, నాదో సందేహం. దయచేసి తీరుస్తారా?’’ అనడిగాడు. ‘‘చెప్పు నాయనా’’ అన్నారు స్వామీజీ చల్లగా. ‘‘ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు కదా, వారి పేర్లు చెబుతారా’’ అన్నాడు. స్వామీజీకి అతని ఉద్దేశ్యం అర్థమైనా కోపం తెచ్చుకోలేదు. ‘‘అలాగే నాయనా! తప్పకుండా చెబుతాను. అయితే ఒక నిబంధన. నేను ఏకబిగిన చెప్పుకుని పోతూ ఉంటాను.నువ్వు నిద్రాహారాలను వదిలేసి మరీ స్వయంగా రాసుకోవాలి. పూర్తయిన తర్వాత తిరిగి నాకు చదివి వినిపించాలి.సిద్ధమేనా మరి?’’అనడిగారు స్వామీజీ. అతనికి దిమ్మ తిరిగినట్లయింది. ‘ఇంటి దగ్గర తన తాత, నాయనమ్మ రామకోటి, శివకోటి కొన్ని ఏళ్లుగా రాస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కోటి నామాలకే అంత సమయం పడితే, మూడు కోట్ల నామాలను పూర్తి చేసేసరికి నేను ముసలివాడిని కావడం ఖాయం. ఆయన్నేదో ఇరుకున పెట్టాలనుకుంటే చివరకు నేనే ఇరుక్కుపోయేలా ఉన్నానే, తప్పయిపోయింది.’ అనుకున్నాడు. వెంటనే చెంపలు వేసుకుంటూ, ‘క్షమించండి స్వామీ, కొంటెతనం కొద్దీ అలా అడిగాను. మీరు ముక్కోటి నామాలనూ చెప్పినా, రాసుకునేంత ఓపిక గానీ, ఆసక్తి గానీ లేవు నాకు’’ అన్నాడు. స్వామీజీ చిరునవ్వుతో ‘‘నాయనా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను అనేక అంశలుగా భావించి వివిధ నామాలతో, రూపాలతో పూజిస్తుంటారు. నిజానికి ముక్కోటి దేవతలు అని మాట వరసకుఅనేదేకానీ, నిజంగా మూడుకోట్ల మంది దేవతలున్నారని కాదు. నువ్వు నిజంగా తెలుసుకునేందుకు అడిగి ఉంటే నువ్వు పెరుగుతావని సంతోషించేవాడిని. కానీ నన్నేదో ఇబ్బంది పెట్టాలనుకుని అడిగావు. ఇంకొకరిని తక్కువ చేయడానికి నీ తెలివితేటలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అర్థమైందా?’’ అన్నారు. అర్థమైందన్నట్లుగా మరోసారి లెంపలు వేసుకుంటూ, ఈసారి భక్తితో మనస్ఫూర్తిగా స్వామీజీకి నమస్కరించాడు. డి.వి.ఆర్. -
మరణ కారణం.. అవయవ వైఫల్యం
కర్ణాటక , బొమ్మనహళ్లి: ఉడుపిలోని శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామీజీ (55) ఆకస్మికంగా మరణించిన మిస్టరీలో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. జులైలో ఆయన మఠంలో కన్నుమూయడం తెలిసిందే. దీనిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో కీలకమైన పోస్టుమార్టం ఫోరెన్సిక్ నివేదిక వెలువడింది. ఆయనపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, స్వామీజీ కాలేయం పనిచేయక, శరీరంలో రక్తం గడ్డకట్టడంవల్ల మృతి చెందారని మణిపాల్ వైద్యులు ఫోరెన్సిక్ నివేదికలో తెలిపారు. మంగళూరు నగరంలో ఉన్న సైన్స్ ప్రయోగశాల, కేఎంసీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇచ్చిన నివేదికలో స్వామీజీ కాలేయం పూర్తిగా చెడిపోయి ఉందని పేర్కొన్నారు. ఈ నివేదికను పోలీసులకు అందజేయడం జరిగింది. మూత్రపిండాల వైఫల్యం అన్ననాళంలో రంధ్రాలు పడటం, శరీరంలో ఎక్కడ చూసినా రక్తం గడ్డ కట్టిందని, మరణానికి ఇవే కారణాలని వైద్యులు తెలిపారు. దీనికి తోడు మూత్రపిండాలు కూడా పనిచేయడం లేదని, కడుపులోకి పెద్దమొత్తంలో రక్తం చేరిందని, ఇదే విషంగా మారి మరణించి ఉంటారని వైద్యులు తెలిపారు. మంగళూరు సైన్స్ ప్రయోగశాలలో రూపొందించిన నివేదిక పైన పోలీసులు వైద్యులను రెండుసార్లు సుమారు 10కి పైగా ప్రశ్నలను అడిగారు. వైద్యులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అనంతరం ఎఫ్ఎస్ఎల్ నివేదికను పోలీసులు స్వీకరించినట్లు తెలిసింది. అనారోగ్యం వల్లనే స్వామీజీ కన్నుమూశారని, ఆయన పైన ఎలాంటి విష ప్రయోగం జరగలేదని వైద్యులు తెలిపారు. -
విశేషమైన క్షేత్రం అంతర్వేది
సఖినేటిపల్లి (రాజోలు) : చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది క్షేత్రం విశేషమైన క్షేత్రమని మైసూరు శ్రీదత్త పీఠం అధిపతి గణపతి సచ్చితానంద స్వామీజీ అన్నారు. అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామి దర్శనానికై బుధవారం వచ్చిన స్వామీజీకి ఆలయ మాజీ ప్రధానార్చకుడు వాడపల్లి బుచ్చిబాబు, ప్రస్తుత ప్రధానార్చకుడు కిరణ్, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి, స్థానాచార్య రామరంగాచార్యులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆశీస్సులు పలికారు. సమాజంలో అందరికీ ధర్మబుద్ది కలిగించమని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. అంతరాలయంలో ఉన్నంతసేపు వైకుంఠంలో ఉన్నట్లుగా ఉందని స్వామీజీ పేర్కొన్నారు. -
అన్యమత ప్రచారం అడ్డుకోకుంటే ప్రమాదమే
అనంతపురం కల్చరల్ : దేశంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోకుంటే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని పలువురు వక్తలు, స్వామీజీలు అభిప్రాయపడ్డారు. విశ్వహిందూ పరిషత్తు (వీహెచ్‌పీ) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నగరంలో ‘అనంత హిందూ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు అక్కిశెట్టి జయరాముడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ సంస్థ ప్రాంత అధ్యక్షుడు రామరాజు, ఆరెస్సెస్ సంఘ చాలక్ కాకర్ల రంగయ్య, ప్రాంత ప్రచార ప్రముఖ్ నాగేశ్వరరావు, రాయలసీమ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, భజరంగదళ్ సంయోజక్ భానుప్రకాష్, ఉమామహేశ్వరం మఠాధిపతి ప్రణవానంద స్వామీజీ, రాయదుర్గం రామమూర్తి స్వామీజీ, మద్దికెర సూర్యానంద స్వామీజీ, చిన్మయా మిషన్ నిర్వాహకులు స్వామి ఆత్మవిదానంద తదితరులు ప్రసంగించారు. హిందువులందరినీ ఏకం చేయడానికి, ప్రపంచ శాంతి కోసం వీహెచ్‌పీ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విశ్వ గురువుగా భాసిల్లిన భారతీయ సంస్కృతికి భంగం కలుగుతుందని అనుకున ్నప్పుడల్లా ముందుండి పోరాడిందన్నారు. పాశ్చాత్య మోజు, అన్యమత ప్రచారాలతో ఇటీవల విచ్ఛిన్నమవుతున్న సంస్కృతికి పునర్ వైభవం తేవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమస్త హిందూ జాతిని ఏకతాటిపై నిలపడానికి స్వర్ణోత్సవాలు వేదికగా నిలుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన ఆచార వ్యవహారాలను ఇతరులు ఎంతో గౌరవిస్తున్నారని, మనం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నామని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. గీతామాత, గోమాత, భరతమాత, గంగామాత అంటూ సమస్త సృష్టిని తల్లిగా చూసే మన సంస్కృతిని పాడు చేయాలనుకునే వారి ఆటలు కట్టించాలన్నారు. గోమాత ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. గో ఉత్పాదకాలతో నయం కాని జబ్బు ఏదీ లేదన్నారు. అంతకు ముందు నాయకులు, స్వామీజీలు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆకట్టుకున్న బైక్ ర్యాలీ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన బైక్‌ర్యాలీ ఆకట్టుకుంది. దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. అలాగే స్వామీజీలకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన సామూహిక విష్ణుసహస్రనామం, చిన్నారుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామసుందర్, నగర కార్యదర్శి మఠం ఆనంద్, వెంకటేష్, రాధాక్రిష్ణయ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దొంగ బాబా అరెస్ట్
ప్రొద్దుటూరు టౌన్: అతను మతిస్థిమితం లేని వ్యక్తి. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద, సార్వకట్టవీధిలోని ఉన్న చెత్త కుండీల వద్ద కూర్చుని ఉండేవాడు. అలాంటి వ్యక్తికి కొందరు స్వామీజీ వేషం వేశారు. పిల్లలు లేని వారు స్వామీజీ వద్దకు వస్తే పిల్లలు పుడతారని, ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే ఇక దోచుకోవడం వారి వంతైంది. ఎర్రగుంట్ల రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక ఉన్న ఓ చెట్టును ఆసరాగా చేసుకున్నారు. అక్కడ స్వామీజీ వేషం వేసి ఓ కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన వారికి ఆ వ్యక్తితో(స్వామీజీ) మట్టి ఇప్పిస్తున్నారు. ఈ స్వామీజీ మోసాన్ని పసిగట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పూజలు.. ఇంకేముంది మహిళలు పెద్ద ఎత్తున స్వామీజీ వద్దకు రావడం, హారతులు ఇవ్వడం, పూలమాలలు వేయడం మొదలుపెట్టారు. ఈ తతంగం రెండు నెలలుగా జరుగుతోంది. అయితే స్వామి వేషంలో ఉన్న వ్యక్తి వచ్చిన వారిని చూస్తూ కూర్చుంటాడు. అక్కడ స్వామీజీ శిష్యులుగా చెప్పుకుంటున్న వారు మహిళల పట్ల స్వామీజీ స్పర్శ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు చెబుతున్నారు. హుండీ ఏర్పాటు... అక్కడే ఓ హుండీ ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఆశ్రమం నిర్మించాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్కడే ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి పరుపు, మంచం ఏర్పాటు చేశారు. వంట సామాన్లు, అన్నదానాల పేరుతో పెద్ద ఎత్తున నిత్యావసరాలు వసూలు చేస్తున్నారు. స్వామీజీ పేరుతో జరుగుతున్న అసాంఘిక చర్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు అరెస్టు ఎర్రగుంట్ల: పెన్నానది సమీపంలోని య్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో దెయ్యాలు వదిలిస్తానంటూ మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. అలాగే ఇతిన్న ప్రోత్సహించిన లోమడ సుబ్బారెడ్డిని కూడా అరెస్టు చేశామన్నారు. అయ్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో స్వామి అనే వ్యక్తి మహిళలకు దెయ్యాలు ఉన్నాయంటూ వారిని లోబరుచుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని భూమిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసి దొంగ స్వామిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.