ప్రొద్దుటూరు టౌన్: అతను మతిస్థిమితం లేని వ్యక్తి. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద, సార్వకట్టవీధిలోని ఉన్న చెత్త కుండీల వద్ద కూర్చుని ఉండేవాడు. అలాంటి వ్యక్తికి కొందరు స్వామీజీ వేషం వేశారు. పిల్లలు లేని వారు స్వామీజీ వద్దకు వస్తే పిల్లలు పుడతారని, ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే ఇక దోచుకోవడం వారి వంతైంది. ఎర్రగుంట్ల రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక ఉన్న ఓ చెట్టును ఆసరాగా చేసుకున్నారు. అక్కడ స్వామీజీ వేషం వేసి ఓ కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన వారికి ఆ వ్యక్తితో(స్వామీజీ) మట్టి ఇప్పిస్తున్నారు. ఈ స్వామీజీ మోసాన్ని పసిగట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
పెద్ద ఎత్తున పూజలు..
ఇంకేముంది మహిళలు పెద్ద ఎత్తున స్వామీజీ వద్దకు రావడం, హారతులు ఇవ్వడం, పూలమాలలు వేయడం మొదలుపెట్టారు. ఈ తతంగం రెండు నెలలుగా జరుగుతోంది. అయితే స్వామి వేషంలో ఉన్న వ్యక్తి వచ్చిన వారిని చూస్తూ కూర్చుంటాడు. అక్కడ స్వామీజీ శిష్యులుగా చెప్పుకుంటున్న వారు మహిళల పట్ల స్వామీజీ స్పర్శ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు చెబుతున్నారు.
హుండీ ఏర్పాటు...
అక్కడే ఓ హుండీ ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఆశ్రమం నిర్మించాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్కడే ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి పరుపు, మంచం ఏర్పాటు చేశారు. వంట సామాన్లు, అన్నదానాల పేరుతో పెద్ద ఎత్తున నిత్యావసరాలు వసూలు చేస్తున్నారు. స్వామీజీ పేరుతో జరుగుతున్న అసాంఘిక చర్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎట్టకేలకు అరెస్టు
ఎర్రగుంట్ల: పెన్నానది సమీపంలోని య్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో దెయ్యాలు వదిలిస్తానంటూ మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. అలాగే ఇతిన్న ప్రోత్సహించిన లోమడ సుబ్బారెడ్డిని కూడా అరెస్టు చేశామన్నారు. అయ్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో స్వామి అనే వ్యక్తి మహిళలకు దెయ్యాలు ఉన్నాయంటూ వారిని లోబరుచుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని భూమిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసి దొంగ స్వామిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దొంగ బాబా అరెస్ట్
Published Wed, Dec 24 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement