ప్రొద్దుటూరు క్రైం: ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన ఇల్లూరి నాగమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులుండేవారు. భర్త చాలా ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తెకు కూడా వివాహం చేసింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత కుమార్తె మృతి చెందింది. నాగమ్మ కుమారులు బాలచెరువు, వెంకటస్వామిలు గనులలో ట్రాక్టర్‌కు కూలీలుగా వెళ్లేవారు. ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ల క్రితం ట్రాక్టర్‌లో రాళ్లు తీసుకొని వెళ్లే సమయంలో తిప్పలూరు వద్ద లారీ ఢీ కొన్న సంఘటనలో మృతి చెందారు.
కుమారుల మరణంతో కుంగిపోయి..
భర్త, కుమార్తె చనిపోయినా కుమారులున్నారనే ధైర్యంతో జీవిస్తున్న నాగమ్మ చెట్టంత కొడుకులు కూడా మృత్యువాత పడటంతో మానసికంగా కుంగిపోయింది. తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా రాలిపోతుండటంతో ఆమె ఎంతగానో కలత చెందింది.‘ నా అనే వాళ్లందరూ చనిపోయారు.. ఇక నేనుఎవరి కోసం బతకాలనుకొని చావాలని ప్రయత్నం చేశాను.. కానీ దేవుడు నా చావును ఒప్పుకోలేదు’ అని నాగమ్మ కనీళ్లపర్యంతమైంది. నాకు ఎన్నేళ్లు ఉన్నాయో తెలియదు.. చావు రావాలని రోజూ కోరుకుంటున్నా.. భగవంతుడు మరచిపోయినట్టుండాడు.. అని ఆమె అంటుంటే ఆమె దీన స్థితిని చూసిన వారు అయ్యోపాపం అంటున్నారు.
దాదాపు నాలుగేళ్ల నుంచి ఆమె జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు కాలు విరిగింది. దీంతో నడవలేని స్థితిలో ఉండిపోయింది. బుధవారం మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ నాగమ్మను పరామర్శించారు. ఆపరేషన్ చేయించేందుకు ఆమె వైద్యులతో మాట్లాడారు. అనాథ శరణాలయంలో చేర్పిస్తాం ఉంటావా అని ప్రశ్నించగా.. ఎందుకమ్మా.. నా కష్టం ఇంకొకరి మీద వెయ్యాలా.. వద్దులేమ్మా..అని సున్నితంగా తిరస్కరించింది. ఆస్పత్రికి వచ్చే సందర్శకులు ఆమెకు సమయానికి ఇంత అన్నం పెడుతూ, తమకు తోచింది చేతిలో పెట్టి వెళ్తున్నారు. అందరినీ కోల్పోయి వృద్ధాప్యంలో కష్టమైన జీవితాన్ని నెట్టుకొస్తున్న నాగమ్మను మానవతావాదులు చేరదీయడం అవసరం.
భగవంతుడా.. నన్ను తీసుకెళ్లు..!
Published Thu, Feb 19 2015 3:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement