ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు/ పులివెందుల అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దువ్వూరు మండలం కానగూడూరు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరులోని ఆచార్ల కాలనీకి చెందిన షేక్ రఫీ, అతని సోదరుడు మాబూవల్లి, కుమారుడు బాబాఫకృద్దీన్ గాయపడ్డారు. పైన పేర్కొన్న ముగ్గురు కర్నూలు జిల్లా కృష్ణాపురం పుట్టాలమ్మకు బైక్‌లో బయలుదేరారు.
మార్గమధ్యంలో కానగూడూరు సమీపంలోని హాస్టల్ వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన ఆల్వీన్ లారీ వారి బైక్‌ను ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. రఫీ, అతని కుమారుడు బాబాఫకృద్దీన్(8) తీవ్రంగా గాయపడగా, మాబూవల్లికి స్వల్పగాయాలయ్యాయి. వారిని 108లో ప్రొద్దుటూరుకు, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. వారిలో బాబాఫకృద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని చూసి తల్లి మహబూబ్‌చాన్ కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పులివెందుల మున్సిపల్ పరిధి రచ్చుమర్రిపల్లె సమీపంలో జరిగిన సంఘటనలో నగరిగుట్టకు చెందిన ప్రతాప్(22), శ్రీను(24) తీవ్రంగా గాయపడ్డారు. పైన పేర్కొన్న ఇద్దరూ రచ్చుమర్రిపల్లె సమీపంలోని తోట పనులు చేసుకుని బైక్‌లో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారని బంధువులు తెలిపారు. అయితే మార్గమధ్యంలో పులివెందుల వైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ప్రతాప్ కాళ్లు విరిగిపోగా, శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు రోడ్డు ప్రమాదాలు
Published Sun, Jan 5 2014 2:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement