లక్ష్మీవరతీర్థ స్వామి (ఫైల్)
కర్ణాటక , బొమ్మనహళ్లి: ఉడుపిలోని శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామీజీ (55) ఆకస్మికంగా మరణించిన మిస్టరీలో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. జులైలో ఆయన మఠంలో కన్నుమూయడం తెలిసిందే. దీనిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో కీలకమైన పోస్టుమార్టం ఫోరెన్సిక్ నివేదిక వెలువడింది. ఆయనపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, స్వామీజీ కాలేయం పనిచేయక, శరీరంలో రక్తం గడ్డకట్టడంవల్ల మృతి చెందారని మణిపాల్ వైద్యులు ఫోరెన్సిక్ నివేదికలో తెలిపారు. మంగళూరు నగరంలో ఉన్న సైన్స్ ప్రయోగశాల, కేఎంసీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇచ్చిన నివేదికలో స్వామీజీ కాలేయం పూర్తిగా చెడిపోయి ఉందని పేర్కొన్నారు. ఈ నివేదికను పోలీసులకు అందజేయడం జరిగింది.
మూత్రపిండాల వైఫల్యం
అన్ననాళంలో రంధ్రాలు పడటం, శరీరంలో ఎక్కడ చూసినా రక్తం గడ్డ కట్టిందని, మరణానికి ఇవే కారణాలని వైద్యులు తెలిపారు. దీనికి తోడు మూత్రపిండాలు కూడా పనిచేయడం లేదని, కడుపులోకి పెద్దమొత్తంలో రక్తం చేరిందని, ఇదే విషంగా మారి మరణించి ఉంటారని వైద్యులు తెలిపారు. మంగళూరు సైన్స్ ప్రయోగశాలలో రూపొందించిన నివేదిక పైన పోలీసులు వైద్యులను రెండుసార్లు సుమారు 10కి పైగా ప్రశ్నలను అడిగారు. వైద్యులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను పోలీసులు స్వీకరించినట్లు తెలిసింది. అనారోగ్యం వల్లనే స్వామీజీ కన్నుమూశారని, ఆయన పైన ఎలాంటి విష ప్రయోగం జరగలేదని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment