ప్రభోదానందస్వామి పార్థివదేహం
అనంతపురం, తాడిపత్రి రూరల్: ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంతకర్త, బహుగ్రంథకర్త ప్రభోదానంద స్వామి ఇక లేరు. రెండు రోజుల క్రితం గుండెపోటు గురైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని గురువారం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ మందిరం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచారు.
ఈ నెల 7న ఆస్పత్రికి తరలిస్తుండగా..
గతంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ప్రభోదానంద స్వామి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నెల 7న తిరిగి ఆయన గుండెలో నొప్పిగా ఉందంటూ బాధపడుతుంటే చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు కుమారుడు గుత్తా యోగానంద చౌదరి తెలిపారు. 1950లో జన్మించిన ప్రభోదానంద పూర్తి పేరు గుత్తా పెద్దన్న చౌదరి. స్వగ్రామం పెద్దపప్పూరు మండలం అమ్మళ్ళదిన్నె కొత్తపల్లి గ్రామం. భారత సైన్యంలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే దైవజ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగాన్ని వదిలి, తాడిపత్రి ప్రాంతానికి వచ్చారు. కొంత కాలం ఆర్‌ఎంపీగా పలువురికి వైద్య సేవలు అందించారు.
ఆధ్యాత్మిక జీవితంతో పేరు మార్పు
కులాంతర వివాహం చేసుకున్న పెద్దన్న చౌదరి.. కాలక్రమంలో ఆయుర్వేద వైద్యంపై కొన్ని పుస్తకాలు వెలువరించారు. అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు ఆయన దృష్టి మళ్లింది. ఆధ్యాత్మిక అంశాలపై పరిశోధనాత్మక రచనలు కొనసాగించారు. దైవజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనతో ‘ఇందూ జ్ఞానవేదిక’ను స్థాపించి దేవుడు ఒక్కడేనని చాటిచెబుతూ వచ్చారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లలో ఉన్న దైవజ్ఞానం అందరికీ ఒక్కటేటని బోధిస్తూ త్రైత సిద్దాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అనేక గ్రంథాలను రచించి 1980న ప్రభోదానందస్వామిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంబించారు.
వివాదాలకూ కేంద్రబిందువు
త్రైత సిద్ధాంత బోధనలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన ప్రభోదానంద స్వామి.. ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 1990లో ఓ సారి ఆశ్రమంపై దాడులు జరిగాయి. అలాగే 2018 సెప్టెంబర్ 16న ప్రభోధానంద ఆశ్రమంపై జరిగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచనలమయ్యాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఆయన రాసిన ఓ పుస్తకంపై 2017లో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతర పరిణామాలు, రాజకీయ కక్షలు కారణంగా ఆయన భక్తులకు ఆశ్రమంలో అందుబాటులో లేకుండా పోయారు. అయినా సామాజిక మాధ్యమాల ద్వారా తన బోధనలను భక్తులకు వినిపిస్తూ వచ్చారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ప్రభోదానంద స్వామి కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న ఆయన భక్తులు గురువారం ఉదయం నుంచి చిన్నపొడమల గ్రామంలోని ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. భక్తుల రాకను గమనించిన పోలీసులు అప్రమత్తమై కోవిడ్–19 నేపథ్యంలో వారికి అనుమతులు నిరాకరిస్తూ ఎక్కడికక్డ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో నుంచే భక్తులను వెనక్కు పంపిస్తూ వచ్చారు. ఆశ్రమంలోని భక్తులకు ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి రూరల్, పట్టణ సీఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రభోదానంద పార్థివ దేహం సందర్శనకు బీజేపీ నాయకులు అంకాల్‌రెడ్డి, ప్రతాపరెడ్డి ఆశ్రమానికి వచ్చారు. వారికి ఆయన కుమారుడు గుత్తా యోగానంద చౌదరి వివరాలు తెలిపారు. తహసీల్దార్ నయాజ్ అహమ్మద్, ఎంపీడీఓ రంగారావు అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం రాత్రి ప్రభోదానంద అంత్యక్రియలను ఆశ్రమంలోనే నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment