మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకుడిని చేసిన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. నాన్న లేని లోకం శూన్యం అనిపించింది. ఏడుస్తూ ఏడుస్తూ గుండె పోటుకు గురై తనూ ప్రాణం వదిలాడు. 24 గంటల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గుత్తి : గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళితే.. చెట్నేపల్లికి చెందిన గద్దల ఓబులేసు(89)కు నాగభూషణం, సూర్య చంద్ర (49), మస్తానప్ప అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఓబులేసు రైల్వే ఉద్యోగిగా పని చేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ఉద్యోగ విరమణ తర్వాత నుంచి ఓబులేసు తన రెండవ కుమారుడైన విశాలాంధ్ర స్టాఫ్‌రిపోర్టర్ సూర్య చంద్రతోనే ఉండేవాడు. అనారోగ్యం కారణంగా సోమవారం సాయంత్రం ఓబులేసు కన్నమూశాడు. తండ్రి మరణాన్ని సూర్య చంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉండిపోయాడు.అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సూర్య చంద్రకు ఛాతీలో నొప్పి వచ్చింది.
కుటుంబసభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అనంతపురం రెఫర్ చేశారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యచంద్రకు భార్య సులోచన, కుమార్తెలు సుజన, రచన, కుమారులు రాహుల్, సిదార్థ ఉన్నారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకు మరణించడంతో చెట్నేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరూ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తండ్రీ కొడుకుల మృతదేహాలు పక్కపక్కనే ఉండటం చూపరులను సైతం కన్నీరు పెట్టించింది.
కుటుంబ సభ్యులకు పరామర్శ
తండ్రీ కొడుకులు( ఓబులేసు, సూర్యచంద్ర) మరణిచారన్న వార్త తెలుసుకుని వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెరుమాళ్ల జీవానందరెడ్డి, సభ్యులు గాలి నరసింహారెడ్డి, హనుమంతురెడ్డి, రామకృష్ణ, నారప్ప, రవితో పాటు వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ హుసేన్‌పీరా చెట్నేపల్లికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment