నాగరాజు, పద్మావతి దంపతులు (ఫైల్)
‘మూడుముళ్లు’ ఏకం చేశాయి..‘అగ్నిసాక్షి’గా ఏడడుగులు నడిచారు.. ఎన్నికష్టాలొచ్చినా ఒకరికొకరం తోడూనీడగా ఉందామనుకున్నారు. దర్జాగా బతకలేకున్నా ఉన్నంతలో ఆదర్శంగా బతుకుతున్నారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతి‘రూపాలు’ను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నారు.. ఆ దాంపత్యాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. అంతలోనే అనారోగ్యమనే మిత్తి.. గుండెను నులిమింది. భార్య నుంచి భర్తను వేరు చేసింది. భర్తలేని లోకం శూన్యమని ఆమె భావించింది.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషాద ఘటనతో అభంశుభం తెలియని చిన్నారులు దిక్కులేని వారయ్యారని అందరి కళ్లు చెమర్చగా.. గార్లదిన్నె శోకసంద్రమైంది.
అనంతపురం , గార్లదిన్నె: జ్వరంతో బాధపడుతున్న భర్త గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. భర్త లేని జీవితం శూన్యమని భార్య ఆత్మహత్య చేసింది. వివరాల్లోకెళ్తే.. మండల కేంద్రం గార్లదిన్నెలో కిరాణా అంగడి నిర్వహిస్తున్న నాగరాజు (45) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉన్నపళంగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే భర్త లేని ఈ లోకంలో తాను జీవించలేనని భార్య పద్మావతి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు 108లో ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటికే ఆమె కూడా మృతి చెందింది. ఇదిలా ఉండగా నాగరాజు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.
అయోమయంలో పిల్లలు..
నాగరాజు, పద్మావతి దంపతులకు ఆరో తరగతి చదువుతున్న గౌతమ్, తొమ్మిదో తరగతి చదువుతున్న చైతన్య కుమారులు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment