అనంతపురం కలెక్టరేట్/సిటీ, న్యూస్‌లైన్ : ‘సమైక్య’ నినాదం మిన్నంటింది. రాష్ట్ర విభజనను ఉద్యోగులు ముక్తకంఠంతో నిరసించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని సీమాంధ్ర ఎంపీలను హెచ్చరించారు. ఎన్‌జీఓలు, ఇతర ఉద్యోగులు ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీపై కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ, ట్రెజరీ ఉద్యోగులు టమోటాలు వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి జయరామప్ప, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఫరూక్ అహమ్మద్ మాట్లాడుతూ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే నాయకులు ప్యాకేజీల కోసం ఢిల్లీ టూర్లు వేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, ఏపీ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దయాకర్, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నిర్వహించిన ‘రన్‌ఫర్ సమైక్యాంధ్ర’ విజయవంతమైంది.
ఉద్యమకారులు ఒకే రంగు దుస్తులు ధరించి సమైక్య నినాదాన్ని మార్మోగించారు. స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సప్తగిరి, టవర్‌క్లాక్ సర్కిళ్ల మీదుగా పాతూరు వరకూ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి జాక్టో, యూత్ జేఏసీ, ఐఎంఏ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర ఐక్యవేదిక నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఐఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా, సీఆర్‌ఐటీ విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులకు సమ్మె సెగ
ఏపీ ఎన్‌జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వల్ల పలు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసింది. ఈ నెల 10 నుంచి 25 వరకు జిల్లాలో జరగాల్సిన రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఉద్యోగులు ఉన్నట్టుండి సమ్మె చేపట్టడంతో సదస్సులను వాయిదా వేయక తప్పలేదు.
మిన్నంటిన ‘సమైక్య’ నినాదం
Published Mon, Feb 10 2014 2:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement