సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అదరం, బెదరమని సమైక్య వాదులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడమే తమ ఏకైక లక్ష్యమంటూ పోరాటంలో ముందుకు సాగుతున్నారు.
విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, గెజిటెడ్ ఆఫీసర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభజన కుట్రకు తెరదీసిన వారిపై నిప్పులుగక్కుతున్నారు. ఆదివారం సైతం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగించారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, గూడూరు తదితర నియోజక వర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు దీక్షలకు సంఘీభావం పలికి నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. మొత్తంగా 33వ రోజూ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది.
నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట గెజిటెడ్ అధికారుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లో నిరసన తెలిపారు. వీఆర్‌సీ సెంటర్‌లో యూటీఎఫ్, వీఎస్‌యూ అధ్యాపక జేఏసీల నాయకులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజీవ్
విద్యామిషన్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్వీఎం కార్యాలయం, ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాలు జరిగాయి. విద్యుత్ ఉద్యోగులు టౌన్‌హాలులో సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందించారు.
గూడూరులో రిలే దీక్షలు సాగిస్తున్న వారికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ మద్దతు పలికారు. బ్రాహ్మణసేవా సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జర్నలిస్టులు వీధులు చిమ్ముతూ నిరసన తెలిపారు. చిల్లకూరు మండలం కొత్తగుంటలో ఆటో యూనియన్ నేతలు రిలే దీక్షలో కూర్చున్నారు.
వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్‌లో మానవహారం నిర్వహించడంతో పాటు ఆటాపాటలతో నిరసన తెలిపారు.
సైదాపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భీముడు, దుర్యోధనుడు, యముడు తదితర వేషధారణలో ఉన్న వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండు వద్ద వసతి గృహాల నాల్గో తరగతి ఉద్యోగులు, వార్డెన్లు రిలే దీక్ష చేశారు. మున్సిపల్ బస్టాండు నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రిలే దీక్షలు చేశారు. సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు ఆరో రోజుకు చేరాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు దీక్షలో కూర్చున్నారు. ఉదయగిరి-సీతారాంపురం రోడ్డుపై వాలీబాల్‌ఆడారు. దుత్తలూరు సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది రిలే దీక్ష చేశారు. వరికుంటపాడులో దీక్షలో ఉన్న వారికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మద్దతు ప్రకటించారు.
సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 19 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు. విభజనతో వచ్చే నష్టాలపై మదర్ సేవాసంస్థ కరపత్రాలు పంచిపెట్టింది. నాయుడుపేట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష, యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ మందిరం వద్ద రిలేదీక్షలు నిర్వహించారు. యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రక్తదానం చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ చేసి రిలే దీక్షలో ఉన్న వారికి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.
తడలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఉపాధ్యాయ జేఏసీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డుపైనే భోజనం చేశారు.
టీపీగూడూరు మండలంలోని ఐదు పంచాయతీల్లో తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా పర్యటించారు. చింతోపులో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పొదలకూరులో ప్రభుత్వ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి.
కోవూరులోని ఎన్జీఓ హోమ్‌లో మైనార్టీ నాయకులు రిలే దీక్ష చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వవ్వేరు బ్యాంకు నుంచి బస్టాండు మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ విగ్రహ కూడలి వరకు ర్యాలీ జరిగింది.
కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రంకురోడ్డుపై ముగ్గువేసి గొబ్బెమ్మలను పెట్టి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌లోకి బస్సులను రానివ్వకుండా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. అనంతరం రిలే దీక్షలు కొనసాగించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్వర్యంలో వికలాంగులు, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ శిబిరంలో ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు.
అదరం..బెదరం
Published Mon, Sep 2 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement