సడలని సంకల్పం | Being unexpectedly united movement | Sakshi
Sakshi News home page

సడలని సంకల్పం

Published Sat, Sep 28 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

Being unexpectedly united movement

సాక్షి, కడప:  సమైక్య ఉద్యమం ఊహించని విధంగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 31న జిల్లా వాసులు బిగించిన పిడికిలి 60రోజులైనా సడలలేదు. 60రోజుల ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు తలెత్తాయి.
 
 ఓ వైపు సమైక్య రాష్ట్రం కోసం  ఉద్యమిస్తుంటే..మరో వైపు కేంద్రం తెలంగాణపై కేబినేట్ నోట్ సిద్ధం చేస్తోందని... ఈ పరిస్థితుల్లో ఉద్యమం అవసరమా? అని కొందరు తడబడ్డారు. ఆర్థిక సమస్యలతో ఉద్యమాన్ని నడపడం కష్టమవుతోందని మరికొందరు నీరసించారు. అయితే సమైక్య ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న  వారు మాత్రం ఏ దశలోనూ పట్టువీడలేదు. లక్ష్యంపై నమ్మకాన్ని కోల్పోలేదు. సమైక్యసాధన కోసం ఎప్పటికప్పుడు భవిష్యత్ కార్యాచరణ రచిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు.
 
 ‘సీమ’ నష్టంపైనే ప్రధానంగా ఫోకస్:
 ఉద్యమం మొదలైనప్పుడు సమైక్యంగా ఉండాలని  అందరూ మాట్లాడారు. చాలామంది ప్రజలు కూడా ఇదే పెద్ద సమస్య అని భావించారు. అయితే ఉద్యమకాలంలో సమైక్యనేతల గళం కూడా మారుతోంది. విడిపోతే సీమకు ముఖ్యంగా జిల్లాకు వాటిల్లే నష్టాలను ఏకరువు పెడుతున్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదని, విడిపోతే మరిన్ని కష్టాలు తప్పవని వివరిస్తున్నారు.
 
 మొన్నటి వరకూ జల కేటాయింపులంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఉద్యమ ప్రభావంతో అధికశాతం మంది విడిపోతే ఏ ప్రాజెక్టు ఏమవుతుందో, ఏ ప్రాంతం ఎడారిగా మారుతుందో ఇట్టే చేప్పే అవగాహన తెచ్చుకున్నారు. విడిపోతే తలెత్తే నష్టాలపై ఇప్పుడే ఉద్యమించాలని సంకల్పించారు. సమష్టిగా ఉద్యమిస్తున్నారు. అందుకే ఉద్యమం రోజురోజుకూ బలోపేతం అవుతోంది. ఓవైపు ఆర్థికంగా నష్టపోతున్నా ఉద్యమానికి ప్రజలు, వ్యాపారుల నుంచి మద్దతు లభిస్తోంది. విజయవంతగా సాగుతోంది.
 పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడినా:
 దాదాపు రెన్నెళ్లుగా పిల్లల చదువులు ఆగిపోయాయి. ఉద్యమంతో  పిల్లల చదువుకు నష్టం వాటిల్లుతోందని, తరగతులకు వెళదామని కొందరు టీచర్లు ఆలోచిస్తున్నారు.  ఉద్యోగాల కోసం హైదరాబాద్‌పై అధికంగా ఆధారపడుతున్నామని,  విడిపోతే అది శాశ్వతంగా దూరమవుతుందని విద్యావంతులు విద్యార్థులకు వివరిస్తున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెబుతున్నారు. దీంతో విద్యార్థులూ సమైక్యరాష్ట్రంలో భాగస్వాములవుతున్నారు.
 
 జీతాలు లేక ఇబ్బందులతో..:
 ఉద్యమంలో ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగులూ సమ్మెలో ఉండటంతో సెప్టెంబరు 1న జీతాలు అందలేదు. అక్టోబరు 1న కూడా అందే పరిస్థితి లేదు. దీంతో అటెండర్లు, చిన్నస్థాయి ఉద్యోగులతో పాటు చాలామంది ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరిలో ఉద్యమంతో ఇబ్బంది పడుతున్నామనే బాధ లేదు. విడిపోతే తలెత్తే కారణాలు తెలుసుకుని బాసటగా నిలుస్తున్నారు.  
 
 జిల్లాలోని 26వేలమంది ఉద్యోగులకు ఇప్పటికే 80 కోట్ల రూపాయల వేతనాలు నిలిచిపోయాయి. ఉద్యమంతో జిల్లాకు దాదాపు 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినప్పటికీ తెలంగాణలోని సకల జనుల సమ్మెను సీమాంధ్ర సకలజనుల సమ్మె దాటిపోయింది.  ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 2011 సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకూ సకలజనుల సమ్మె కొనసాగింది. ప్రస్తుతం సమైక్యరాష్ట్రం కోసం ఆగస్టు 12వ తేదీ  అర్ధరాత్రి నుంచి ఉద్యమం సాగుతోంది. ఇప్పటికి సకజనుల సమ్మె మొదలై 45 రోజులు పూర్తయింది.
 
 వైఎస్సార్‌సీపీ  ప్రకటనపై ఉద్యోగుల్లో చర్చ:
 అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తీర్మానం చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగుల్లో మద్దతు లభిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement