ఓ వైపు వినాయక చవితి సంబరాలు..మరో వైపు సమైక్య నినాదాలు.. ఆదివారం పట్టణప్రాంతాలు కిటకిటలాడాయి. ఉద్యమ పోరు మొదలై ఆదివారంతో 40 రోజులైంది. అయినప్పటికీ సాధారణ ప్రజల నుంచి ఉద్యోగుల దాకా ఎవరిలోనూ ఇసుమంతైనా పట్టు సడలలేదు. మరింత ఉద్యమస్పూర్తితో లక్ష్యసాధన వైపు ముందుకు సాగుతున్నారు.
సాక్షి, కడప: ‘గణపతిబప్పా మోరియా..జై బోలో గణేశ్‌మహారాజ్‌కి జై’..అనే భక్తి నినాదాలు ఓవైపు...‘జై సమైక్యాంధ్ర...తెలుగు తల్లిని విడగొట్టొద్దు...గుండెకోత మిగలనివ్వొద్దు’ అంటూ సమైక్య నినాదాలు మరో వైపు..రెండిటి నడుమ జిల్లాలోని పట్టణప్రాంతాలు జనంతో హోరెత్తాయి. ఉద్యమం మొదలై ఆదివారంతో 40రోజులైంది. అయినా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కడపలో అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఆర్వో ఈశ్వరయ్య, నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మయ్యతో పాటు గ్రూప్-1 అధికారుంతా కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉద్యమానికి మరింత స్పూర్తినిచ్చారు. వీరితో పాటు కడప జర్నలిస్టుల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాముల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. సాక్షి బ్యూరోఇన్‌చార్జ్ మోపూరి బాలకృష్ణారెడ్డి, సిటీకేబుల్ సూరి, సూరిబాబుతో పాటు పలువురు జర్నలిస్టులు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చేందుకు వ్యక్తిగతంగా కూడా తాము ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చామని బాలకృష్ణారెడ్డి అన్నారు. లక్ష్యసాధనకు అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఉద్యమకారులకు ఆయన అభినందనలు తెలియచేశారు. న్యాయవాదులు, కార్పొరేషన్, డీఆర్‌డీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులు, డీఆర్‌డీఏ, ఐకేపీతో పాటు పలు ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు.
పొద్దుటూరులో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు రిలేదీక్షలకు కూర్చున్నారు. రూరల్ మండలంలోని ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. ప్రైవేటు బీమా కంపెనీలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ కార్యాలయం నుంచి పాత గంగిరెడ్డి ఆస్పత్రి వరకూ వందల ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల సర్కిల్ వద్ద ఆటోలతో పాటు డ్రైవర్లు, మహిళలు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, జేఏసీ, వైఎస్సార్‌సీపీ నేత శివప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. రాజంపేటలో శ్రీకృష్ణదేవరాయ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రె వెన్యూ, న్యాయవాదులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు వైఎస్సార్‌సీపీ నేత కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో వందమంది రిలేదీక్షలకు కూర్చున్నారు. జమ్మలమడుగులో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. రాయచోటిలో తైక్వాండో విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు జేఏసీ శిబిర వద్ద బ్రాహ్మణ మిత్రమండలి ఆధ్వర్యంలో శాంతిహోమం నిర్వహించారు.ఆర్టీసీ ఉద్యోగులు చెరుకుగడలు, అరటిపిలకలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉద్యోగ జేఏసీ, క్రిస్టియన్ మిషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్‌లో ధర్నా చేపట్టారు. మైదుకూరులో న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. బద్వేలులో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అనాథవృద్ధులు, అనాథ బాలలు, బాలకార్మికులు ర్యాలీ నిర్వహించారు.
గణపయ్య సాక్షిగా సమైక్యపోరు
Published Mon, Sep 9 2013 5:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM
Advertisement
Advertisement