jai samaikayanadhra
-
ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్
పలమనేరు/తిరుపతి, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టి అవమానపరిచి ఉమ్మేసిన వారికే ఓట్లు వేస్తారా అని జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుప్రజల దయాదాక్షిణ్యాలతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఓటుతో బుద్దిచెప్పాలని ఆయన కోరారు. పీలేరు నుంచే కిరణ్ పోటీ!: మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. ఈనెల 17వ తేదీన నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డిని నిలిపి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కిరణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. . శుక్రవారం పీలేరు నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్యులతో సమావేశమై తాను పీలేరు నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. -
టీ-బిల్లు మాడి మసైపోతుంది
తిరుపతిరూరల్, న్యూస్‌లైన్: ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకువస్తున్న తెలంగాణ బిల్లు మాడిమసై పోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం రూరల్ మండలం రామానుజపల్లె కూడలి వద్ద తెలంగాణ బిల్లుకు వ్యతి రేకంగా సోమవారం భోగిమంటల్లో బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్లు సీట్లే లక్ష్యంగా జరుగుతున్న సోని యాగాంధీ కుట్రలో భాగమే రాష్ట్ర విభజన అంశమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ కుట్రదారులకు ఎదురునిలబడి పోరాడుతున్నారన్నారు. టీడీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కై అసెంబ్లీ సాక్షిగా విభజనకు అనుకూలం గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకలిగే ఏకైక నాయకుడు జగనన్నే అని ప్రజ లు విశ్వసిస్తున్నారన్నారు. భోగి సందర్భంగా అందరికీ భోగభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం భోగి మంటల్లో తెలంగాణ ప్రతులను వేసి తగుల బెట్టారు. ఈ ప్రాంతం జై సమైక్యాంధ్ర... జై జగన్ నినాదాలతో హోరెత్తింది. వైఎస్ఆర్ సీపీ రూరల్ మండలాధ్యక్షుడు ఉపేంద్రారెడ్డి, నాయకులు గోవిందరెడ్డి, సుధాకర్‌రెడ్డి, చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
సాగరతీరంలో సమైక్య ఘోష
సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సాగరతీరం శనివారం సాయంత్రం జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఉద్యోగ సంఘాలు చేపట్టిన సాగరజల లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. సమైక్యాంధ్ర ధూం..ధాం అంటూ కుటుంబ సభ్యులతో సహా ఉద్యోగ సంఘాలు బీచ్‌రోడ్డులో చేపట్టిన నిరసన మిన్నంటింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, విశాఖ జిల్లా అధికారుల సంఘం, ఉద్యోగ/ఉపాధ్యాయ/కార్మిక/కర్షక సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వేలాదిమంది తరలివచ్చారు. అల్లూరి సీతారామారాజు విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం వేలాది మంది ర్యాలీగా ఆర్కేబీచ్ వైపు బయల్దేరారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాజీనామా చేయని మంత్రుల తీరును దుయ్యబట్టారు. ర్యాలీలో గుడ్‌షెపర్డ్ స్కూల్ విద్యార్థులు 1000 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం బీచ్ రోడ్డులో కాళికామాత దేవాలయం వద్ద సభ నిర్వహించారు. వివిధ వర్గాల నాయకులు సంఘీభావంగా చేతులు కలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ఆటపాటలతో అలరించారు. దేశభక్తి గేయాలతో కార్యక్రమం ఆకట్టుకుంది. బాణసంచా, ఆకాశపు లాంతర్లతో బీచ్‌రోడ్డు మిరుమిట్లు గొలిపింది. ఫ్లాష్మ్యాబ్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విడిపోతే వెనకబడిపోతాం... రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పాలకులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాల్సిందేనని ఈ సభలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1990లో పీవీ నర్సింహరావు సంస్కరణలు చేపట్టిన సమయంలో రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చి ఉంటే నిర్దేశించిన నిష్పత్తిలో మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకునేవాళ్లమని అన్నారు. ఇటువంటి ఆలోచన లేకపోవడం వల్లనే హైదరాబాద్‌ను ఎంతో ఉన్నతంగా సీమాంధ్రులంతా రెక్కల కష్టంతో తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రం విడిపోతే మళ్లీ అంతటి అభివృద్ధి సాధించలేమన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రవిభజన కారణంగా రైతాంగం, విద్యార్థులు ఎంతో నష్టపోవాల్సివస్తుందన్నారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారులు హోదా మరిచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆర్టీసీ సీమాంధ్ర ఉద్యమకర్తలు పీపీఎం రాజు (ఈయూ), ఎంవీఆర్ మూర్తి (ఎన్ఎంయూ) మాట్లాడుతూ 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఉద్యోగులు రాత్రనక, పగలనక సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని అన్నారు. ఏపీఎన్జీవో జిల్లా సభ్యుడు గోపాలకృష్ణ ప్రసంగిస్తూ మంత్రుల వ్యవహారశైలిని ఎండగట్టారు. ఉద్యమనేత ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణానికే ఆరేళ్లు పట్టిందంటే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర అభివృద్ధికి ఎన్నేళ్లు పడుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల, ఉద్యోగ సంఘాల ఉద్యమకర్తలు వై.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, గణపతి, యోగేశ్వరరావు, ఇమంది పైడిరాజు, ఎం.ఆదినారాయణ, జగన్నాథరావు, శ్యామసుందర్, వై.నర్సింహరావు, విజయప్రసాద్, శ్రీరామమూర్తి, చిట్టిరాజు, డికుమార్రావు, చంద్రశేఖర్, హరిప్రసాద్‌లు పాల్గొన్నారు. -
రణ నారీ భేరి
జై సమైక్యాంధ్ర అంటూ సమైక్య వాదులు శనివారం రాజంపేటలో రణభేరి మోగించారు. భానుడి సెగను సైతం లెక్కచేయక కేంద్రానికి వినపడేలా సమైక్య నినాదాలు చేశారు. వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సమైక్య వాదులను ఉత్తేజపరిచాయి. రాజంపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై రగిలిన గుండెలతో రాజంపేటలో శనివారం రణభేరి మోగించారు. స్థానిక ప్రభుత్వ క్రీడామైదానంలో సమైక్యాంధ్రపరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లక్షగళ సమైక్య రణభేరి పెద్దఎత్తున నిర్వహించారు. ఈ రణభేరికి సమైక్యవాదులు వేలాదిగా తరలివచ్చారు. భానుడి సెగను సైతం లెక్క చేయకుండా కేంద్రానికి వినబడేలా నినదించారు. ఆధ్యంతం సమైక్యహోరుతో రణభేరి కొనసాగింది. విభజనపై వ్యతిరేకతను ఎలుగెత్తి చాటారు. ఎమ్మెల్యే ఆకేపాటి, కాంగ్రెస్ ఇన్చార్జి మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య పాల్గొన్నారు. వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సభికులను ఉత్తేజపరిచాయి. అల్లూరి సీతారామరాజు, తెలుగుతల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి. తెలుగుతల్లి ఆక్రందనే సీమాంధ్ర ఉద్యమమని ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసి బయటికి వస్తే అసెంబ్లీ, పార్లమెంటులో విభజన బిల్లు ఎలా ఆమోదం పొందుతుందన్నారు. విభజన వల్ల అనేక విధాలుగా నష్టపోయేది సీమాంధ్ర అన్నారు. విభజన కాక ముందే కేసీఆర్ చేస్తున్న ప్రకటనలతో సీమాంధ్ర ఉద్యమం మరింత ఎగిసిపడుతోందన్నారు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలే తప్ప పదవుల కోసం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలంగాణావాసులు వెనకబడి ఉన్నారని చెప్పడం అవాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత అభివృద్థి చెందింది తెలంగాణవారేనన్నారు. మన ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద భాగ్యనగరంగా అవతరించిందన్నారు. ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం రెండృుగా చీలిపోతే రాయలసీమ ఎడారిగా మిగిలిపోతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యమాలతో రగిలిపోతుంటే ఇంతవరకు కేంద్రం ఏ మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. మోదుగుల కళావతమ్మ కళాశాల అధినేత పెంచలయ్య, ఉద్యోగ రాజంపేట జేఏసీ చైర్మన్ ఎస్వీరమణ తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. సభ ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. -
గర్జించిన మహిళాలోకం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర నినాదాలతో కర్నూలు నగరం మారుమ్రోగింది. శనివారం మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, న్యాయవాదులు సమైక్య శంఖారావాన్ని పూరించారు. మహిళా ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో డీఆర్డీఏ-ఐకేపీ, మహిళా ఉద్యోగులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఆయాలు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ తదితర అన్ని శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద ర్యాలీని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, కోశాధికారి శ్రీరాములు తదితరులు ప్రారంభించారు. రాజ్‌విహార్ వరకు చేపట్టిన ర్యాలీలో వేలాది మంది మహిళలు ఉద్యమ గళం వినిపించారు. సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం మండుటెండలోనే మానవహారం నిర్మించి రాకపోకలను స్తంభింపజేశారు. ర్యాలీ సందర్భంగా ప్రసంగాలు లేకుండా నినాదాలతోనే హోరెత్తించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగుల సంఘం నేతలు విజయకుమారి, సరస్వతి, జ్ఞానేశ్వరమ్మ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నేతలు అరుణకుమారి, రాణి, మాధవీశ్యామల, విజయశంకర్, రెవెన్యూ శాఖకు చెందిన నాగమణి, మధుమతి, రామలక్ష్మి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సింధుభైరవి, భాగ్యరేఖ, కళ్యాణి, విజయకుమారి, ఏపీజీఎల్ఐ ఉద్యోగులు ఇందిరాదేవి, పద్మావతి, మాధవీ కళ్యాణి, సౌజన్య, జానకి, నాగమణి బాయి తదితరులు పాల్గొన్నారు. -
అందరి నోటా అదే మాట
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై సరిగ్గా నెలన్నరైంది. అయినా సడలని సంకల్పంతో సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై మండిపడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, మేధావులు, మహిళలు, కవులు, కళాకారులు, కర్షకులు, శ్రామికులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల ప్రజలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సమర నినాదం చేస్తున్నారు. 45వ రోజైన శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. ఏపీ ఎన్జీఓ సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తపాలా, బీఎస్ఎన్ఎల్ తదితర అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ఎదుట నిరసనలు చేపట్టారు. అనంతపురం నగరంలో ఎస్వీ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు భారీ ప్రరద్శన నిర్వహించారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించి.. సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగించారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. అధ్యాపక జేఏసీ నేతలు వేపమండలతో నిరసన ర్యాలీ చేశారు. సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌లను చింపాంజీలుగా చిత్రీకరించిన ఫ్లెక్సీలతో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు స్థానిక ఫాతీమాబీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖ, హంద్రీ-నీవా, ఎన్జీవో, హౌసింగ్ ఉద్యోగులు, న్యాయవాదులు, ముస్లిం జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హమాలీ కార్మికులు దీక్ష చేపట్టారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తూనే... పోస్టాఫీసు, బ్యాంకులను బంద్ చేయించారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి చిలమత్తూరులో సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కళ్యాణదుర్గంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఘెరావ్ చేశారు. కళ్యాణదుర్గంలో వాల్మీకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తూనే నిరసన ర్యాలీలు చేశారు. ధర్మవరంలో సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో ఐకేపీ మహిళలు వంటా వార్పు చేపట్టారు. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ, ఉద్యోగ జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు రిలే దీక్షలను కొనసాగించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ బైకుల ర్యాలీ, మానవహారం చేపట్టారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ చేశారు. ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో న్యాయవాదులు, మున్సిపల్ ఉపాధ్యాయులు రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు రాస్తారోకో, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు స్కూల్ బస్సులతో ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో జేఏసీ నేతలు కారు శుభ్రం చేసి, చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల, రాయదుర్గంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు,వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యమే ధ్యేయమంటూ కణేకల్లులో కురుబ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోలు లాంతర్లలో నిరసన తెలిపారు. కనగానపల్లిలో సమైక్యవాదులు పరిశ్రమల కేంద్రాన్ని మూసివేయించారు. రామగిరి మండలం పేరూరు నుంచి ధర్మవరానికి బైకు ర్యాలీ చేపట్టారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యవాదులు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు,యాడికిలో విలేకరులు, ఉరవకొండలో వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపప్పూరులో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు రాజీనామా చేశారు. ‘నారీగర్జన’కు సర్వం సిద్ధం సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం అనంతపురం నగరంలో ‘నారీగర్జన’ నిర్వహించనున్నారు. ఇందుకు మహిళా ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న రైతు గర్జన నిర్వహించడానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమాయత్తమయ్యారు. కాగా రాష్ట్ర విభజన నిర్ణయంపై తీవ్ర కలత చెంది ఓడీ చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్‌కు చెందిన సమైక్యవాది చంద్ర అలియాస్ ధర్మరాజు(48), అనంతపురం ఆర్టీసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రామశేషయ్య (54), చిన్న వడుగూరుకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు హనుమంత రెడ్డి (60) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. -
సై.. సమైక్యాంధ్ర...!
ఒక్క లక్ష్యం కోసం.. అన్ని వర్గాల వారు సమైక్యపోరులో ‘మేము సైతం’ అంటూ పోరు సాగిస్తున్నారు. రాజకీయపార్టీల అండలేదు.. వారి నుంచి దన్ను లేదు..అయినా ఏ మాత్రం పట్టుసడలించకుండా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు అడుగులేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సకలజనుల సమ్మె పేరుతో 42రోజుల పాటు పోరు జరిగింది. సమైక్యరాష్ట్రంగానే కొనసాగాలని సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం 44రోజులు దాటి నేటితో 45 రోజులకు చేరింది. సాక్షి, కడప: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ‘సకలజనుల సమ్మె’ పేరుతో 42రోజుల పాటు ఉద్యమం నడిచింది. 2011 సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకూ ఆ సమ్మె కొనసాగింది. ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలు సమ్మెను విరమించారు. ప్రస్తుతం సమైక్యరాష్ట్రం కోసం సీమాంధ్రలోని 13 జిల్లాలలో ఉద్యమం నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై జూలై 30న ఏఐసీసీ ప్రకటన చేసింది. దీంతో అదే నెల 31 నుంచి సాధారణ ప్రజానీకం ఉద్యమాన్ని నడిపారు. వారంరోజుల పాటు నిరవధికంగా జిల్లా బంద్‌ను కొనసాగించారు. ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు...ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ సమైక్యరాష్ట్రం కోసం ఇబ్బందులను పక్కనపెట్టి సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలో తమవంతు పోరు సాగించారు. ఆగస్టు 1 నుంచి న్యాయవాదులతో పాటు పలువురు ఉద్యోగులు రిలేదీక్షలు మొదలుపెట్టారు. ఆపై అదే నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. ఉద్యమం నిరాటంకంగా సాగేందుకు సమైక్యపరిరక్షణ కమిటీ, జేఏసీ నేతలతో పాటు అందరూ ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ భవిష్యత్ ఉద్యమకార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. అక్కడ రాజకీయపార్టీల అండ...ఇక్కడ ప్రజలే సారథులుగా: తెలంగాణలో 42రోజులు జరిగిన సకలజనుల సమ్మె పూర్తిగా రాజకీయపార్టీల అండతో, మద్దతుతో సాగింది. ఓ రాజకీయ ఉద్యమంలా పోరు నడిచింది. కానీ సమైక్య ఉద్యమం ఏ రాజకీయపార్టీ అండ లేకుండా స్వతంత్రంగా సాగుతోంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకూ వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలు సాగాయి. టీడీపీ ఆధ్వర్యంలో కొద్దిరోజులు దీక్షాశిబిరం నడిచింది. అయితే ఉద్యోగులు, సామాన్య ప్రజలు మాత్రం అలుపెరగకుండా పోరు చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ఎవరో ఒకరు, ఏదోఒక నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేధిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలో కూర్చుంటున్నారు. 43రోజులుగా నిరవధికంగా న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారు. జిల్లా యంత్రాంగంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా తక్కిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు. జిల్లా చరిత్రలో ఇన్ని రోజుల పాటు కలెక్టరేట్ నిర్మానుష్యంగా పాలన లేకుండా ఉండటం ఇదే ప్రథమం. స్తంభించిన పాలన: రెవెన్యూతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రభుత్వపాలన స్తంభించింది. ప్రభుత్వశాఖల సముదాయమైన ఓల్డ్రిమ్స్లో ఏ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. జిల్లాలోని మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడిఫైళ్లు అక్కడే నిలిచిపోయాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించే ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. వీరిపై ప్రభుత్వం ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించినా బెదరలేదు. దీంతో జిల్లాలోని 26వేలమందికి ఈ నెల 1న రూ. 80 కోట్ల మేరకు జీతాలు అందలేదు. అయినా ఎవరూ బాధపడటంలేదు. నీరసించలేదు. మరింత పట్టుదలతో పోరు సాగిస్తున్నారు. -
జోరు వానలో... సమైక్యహోరు
సాక్షి, కడప: జిల్లాలో సమైక్య ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షంలోనూ సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు శిరోముండనం చేయించుకున్నారు. ఛాతీలపై ‘జై సమైక్యాంధ్ర’ అని రాసుకుని పట్టణంలోని పలు వీధుల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇంగ్లీషు భోదించే ఉపాధ్యాయులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. న్యాయవాదుల రిలేదీక్షలు 39వ రోజుకు చేరాయి. మైదుకూరులో ఆటోకార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలతో హోరెత్తించారు. దాదాపు రెండుగంటలపాటు కూడలిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో 80మంది రిలేదీక్షలలో కూర్చున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు చీపుర్లతో వీధులను శుభ్రం చేసి వినూత్న నిరసన తెలిపారు. బద్వేలులో విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలేదీక్షలో కూర్చున్నారు. ఉపాధ్యాయులు చెవిలో పూలు ఉంచుకుని నిరసన తెలిపారు. జమ్మలమడుగులో మాదిగ దండోరా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డప్పులు వాయిస్తూ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్, రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 8మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రొద్దుటూరులో న్యాయవాదులు, ఉత్తమ ఉపాధ్యాయులు రిలేదీక్షలకు కూర్చున్నారు. జీవనజ్యోతి పబ్లిక్ స్కూలు విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కడపలో న్యాయవాదులు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు కలెక్టరేట్ వద్ద పలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జర్నలిస్టుల రిలేదీక్షలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మెలో విద్యుత్ కార్మికులు: ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు సమైక్యసమ్మెలో ఉన్నారు. ఈ జాబితాలోకి విద్యుత్ కార్మికులు కూడా చేరారు. బుధవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్‌కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. గురువారం పూర్తిగా విధులకు దూరం కానున్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, ఫీజులు పోయినా, తీగలు తెగిపోయినా ఆ ప్రాంత ప్రజలు అంధకారంలో ఉండాల్సిందే! -
గణపయ్య సాక్షిగా సమైక్యపోరు
ఓ వైపు వినాయక చవితి సంబరాలు..మరో వైపు సమైక్య నినాదాలు.. ఆదివారం పట్టణప్రాంతాలు కిటకిటలాడాయి. ఉద్యమ పోరు మొదలై ఆదివారంతో 40 రోజులైంది. అయినప్పటికీ సాధారణ ప్రజల నుంచి ఉద్యోగుల దాకా ఎవరిలోనూ ఇసుమంతైనా పట్టు సడలలేదు. మరింత ఉద్యమస్పూర్తితో లక్ష్యసాధన వైపు ముందుకు సాగుతున్నారు. సాక్షి, కడప: ‘గణపతిబప్పా మోరియా..జై బోలో గణేశ్మహారాజ్కి జై’..అనే భక్తి నినాదాలు ఓవైపు...‘జై సమైక్యాంధ్ర...తెలుగు తల్లిని విడగొట్టొద్దు...గుండెకోత మిగలనివ్వొద్దు’ అంటూ సమైక్య నినాదాలు మరో వైపు..రెండిటి నడుమ జిల్లాలోని పట్టణప్రాంతాలు జనంతో హోరెత్తాయి. ఉద్యమం మొదలై ఆదివారంతో 40రోజులైంది. అయినా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కడపలో అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఆర్వో ఈశ్వరయ్య, నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మయ్యతో పాటు గ్రూప్-1 అధికారుంతా కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉద్యమానికి మరింత స్పూర్తినిచ్చారు. వీరితో పాటు కడప జర్నలిస్టుల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాముల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. సాక్షి బ్యూరోఇన్చార్జ్ మోపూరి బాలకృష్ణారెడ్డి, సిటీకేబుల్ సూరి, సూరిబాబుతో పాటు పలువురు జర్నలిస్టులు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చేందుకు వ్యక్తిగతంగా కూడా తాము ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చామని బాలకృష్ణారెడ్డి అన్నారు. లక్ష్యసాధనకు అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఉద్యమకారులకు ఆయన అభినందనలు తెలియచేశారు. న్యాయవాదులు, కార్పొరేషన్, డీఆర్డీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులు, డీఆర్డీఏ, ఐకేపీతో పాటు పలు ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పొద్దుటూరులో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు రిలేదీక్షలకు కూర్చున్నారు. రూరల్ మండలంలోని ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. ప్రైవేటు బీమా కంపెనీలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ కార్యాలయం నుంచి పాత గంగిరెడ్డి ఆస్పత్రి వరకూ వందల ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల సర్కిల్ వద్ద ఆటోలతో పాటు డ్రైవర్లు, మహిళలు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, జేఏసీ, వైఎస్సార్సీపీ నేత శివప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. రాజంపేటలో శ్రీకృష్ణదేవరాయ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రె వెన్యూ, న్యాయవాదులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు వైఎస్సార్సీపీ నేత కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో వందమంది రిలేదీక్షలకు కూర్చున్నారు. జమ్మలమడుగులో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. రాయచోటిలో తైక్వాండో విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు జేఏసీ శిబిర వద్ద బ్రాహ్మణ మిత్రమండలి ఆధ్వర్యంలో శాంతిహోమం నిర్వహించారు.ఆర్టీసీ ఉద్యోగులు చెరుకుగడలు, అరటిపిలకలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉద్యోగ జేఏసీ, క్రిస్టియన్ మిషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. మైదుకూరులో న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. బద్వేలులో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అనాథవృద్ధులు, అనాథ బాలలు, బాలకార్మికులు ర్యాలీ నిర్వహించారు. -
సమైక్య హారం.. సమర నినాదం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: లక్ష గళ ఘోషతో కర్నూలు నగరం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు లక్షల జన మహా మానవహారంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నగరాన్ని ఒక వస్తువుగా చేసి, దానికి మానవహారం వేసినట్లుగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేసమయంలో హారంగా నిలబడి కేంద్రానికి రాష్ట్ర విభజనపై తమ నిరసనను తెలియజెప్పారు. అరగంట పాటు నగరమంతా ఒకేసారి సాగిన ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా ఒకేసారి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో కర్నూలు దిక్కులు పిక్కటిల్లాయి. జిల్లా విద్యాసంస్థల జేఏసీ శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన లక్షల జన మహా మానవహారం విజయవంతమైంది. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో ఔటు పేల్చిన వెంటనే అప్పటికే రహదారులపై చేరుకున్న లక్షలాది మంది ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, బీఈడీ, టీటీసీ, పండిట్ ట్రైనింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, ఆయా కళాశాలల సిబ్బంది, బ్యాంకింగ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మేధావులుఅన్ని రకాల కుల సంఘాలు, అన్ని జేఏసీ సంఘాల సభ్యులు, స్థానిక, స్థానికేతరులు మానవహారంగా ఏర్పడ్డారు. ఎక్కడ చూసినా జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్రజలు తమ వాణిని వినిపించారు. వీరికి వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమాన్ని జేఏసీ నాయకులు డాక్టర్ కె. చెన్నయ్య, వి. జనార్దన్‌రెడ్డి, జి. పుల్లయ్య, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, సోమశేఖర్, రాఘవరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, స్వామి, నాగరాజు తదితరులు పర్యవేక్షించారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నెలరోజులుగా సీమాంధ్ర ప్రజలు అలుపెరగకుండా ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రజాప్రతినిదులు సైతం రాజీనామాలు చేయకుండా ఢిల్లీలో దాక్కుని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటన్నింటినీ చూస్తున్న ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇకపై శాంతియుతంగా ఉద్యమాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, ప్రజలు ఆవేశంతో ఉన్నారని అన్నారు. తాము కూడా రెండో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి కేంద్రం మేల్కొనే ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యమాన్ని మరో ఏడాదిపాటైనా నిర్వహంచేందుకు వెనుకాడబోమన్నారు. రాజీనామాలు చేస్తేనే విభజన ఆగుతుంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయని, అప్పుడు రాష్ట్ర విభజన మాటే తలెత్తదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల పదవీ కాలం కాపాడుకునేం దుకు, అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఉబలాటపడుతున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వస్తే తిరగబడతారని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొనాలంటే తప్పనిసరిగా రాజీనామాలు చేసి ఆమోదించుకుని రావాలని చెప్పారు. -
జన ఉప్పెన
సాక్షి, కడప : రాష్ట్రం ముక్కలు కాకుండా అడ్డుకునేందుకు జిల్లా ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జైసమైక్యాంధ్ర అంటూ నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి చేరుకుని జాతీయ రహదారులపై రాస్తారోకోలు, మానవహారాలు, వంటా వార్పులతో వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ ఆందోళనలు చేపడుతున్నారు. బుధవారం 22వ రోజు సైతం సమైక్య నినాదంతో జిల్లా మార్మోగింది. వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. దీంతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు ఉద్యమానికి మరింత ఊపు తెస్తున్నాయి. కడపలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్బాష, ఎస్.నాగిరెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షలు బుధవారంతో మూడవరోజు ముగిశాయి. ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రె డ్డి సంఘీభావం తెలిపారు. రకరకాల విన్యాసాలు, ఆటపాటలతో పలువురు దీక్షలకు సంఘీభావం తెలిపారు. పశు వైద్య సిబ్బంది వినూత్నంగా రోడ్లపై ఈలలు(విజిల్స్) వేస్తూ నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు భారీర్యాలీ నిర్వహించారు. డీఆర్డీఏ, ఐకేపీ సిబ్బంది, వస్త్ర వ్యాపారులు, విద్యుత్, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు ఇర్కాన్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధంచేశారు. దీంతోభారీ సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. టెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ విన్యాసాలు ప్రదర్శించారు. జమ్మలమడుగులో 16 మండలాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు, తహశీల్దార్లు, సిబ్బంది, ఆర్డీఓ రఘునాథరెడ్డి, జీఎన్ఎస్ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి నేతృత్వంలో భారీర్యాలీ చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావాన్ని తెలిపారు. న్యాయవాదులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని సత్యాగ్రహం చేపట్టారు. దొమ్మర నంద్యాల హైస్కూలు విద్యార్థులు భారీ సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.విలేకరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పులివెందులలో వైఎస్ విజయమ్మ దీక్షలకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్నిమండల కేంద్రాల్లో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు కబడ్డీ, మహిళా ఉద్యోగులు ఆటపాటలతో నిరసన తెలిపారు. పంచాయతీ మినిస్టీరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది వంటా వార్పు చేపట్టారు. ప్రొద్దుటూరులో వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా శివాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో రెండవరోజు రిలే దీక్షలు సాగాయి. పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమైక్య నినాదాలతో పుట్టపర్తి సర్కిల్ మార్మోగింది. వర్షంలోనే తడుస్తూ వేలాది మంది విద్యార్థులు జాతీయజెండాలు చేతబూని సమైక్య నినాదాలు చేపట్టారు. కమలాపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వైద్యులు సంఘీభావం తెలిపారు. సి.గోపులాపురం వద్ద గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డగించి వంటా వార్పు చేపట్టారు. రాయచోటిలో న్యాయవాదులు, మాధవరం గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు నోటికి నల్లరిబ్బన్లు ధరించిమౌన ప్రదర్శన చేసి నేతాజీ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కాంగ్రెస్ నేత రాంప్రసాద్‌రెడ్డి సమైక్యాంధ్ర సీడీలను ఆవిష్కరించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదవరోజు చేరుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్ష భగ్నంకు నిరసనగా గురువారం రైల్వేకోడూరు బంద్‌కు పిలుపునిచ్చారు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా బద్వేలులో వైఎస్సార్సీపీ నేతలు రిలే దీక్షలు ప్రారంభించారు. న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో విలేకరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు వంటా వార్పు చేపట్టారు. రాజంపేటలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఆస్పత్రిలోనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డికి జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రిలే దీక్షలు చేస్తున్నవారికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. మైదుకూరులో ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యవాదులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు.