సాక్షి, కడప: జిల్లాలో సమైక్య ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షంలోనూ సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు శిరోముండనం చేయించుకున్నారు. ఛాతీలపై ‘జై సమైక్యాంధ్ర’ అని రాసుకుని పట్టణంలోని పలు వీధుల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇంగ్లీషు భోదించే ఉపాధ్యాయులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. న్యాయవాదుల రిలేదీక్షలు 39వ రోజుకు చేరాయి. మైదుకూరులో ఆటోకార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలతో హోరెత్తించారు. దాదాపు రెండుగంటలపాటు కూడలిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో 80మంది రిలేదీక్షలలో కూర్చున్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు చీపుర్లతో వీధులను శుభ్రం చేసి వినూత్న నిరసన తెలిపారు. బద్వేలులో విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలేదీక్షలో కూర్చున్నారు. ఉపాధ్యాయులు చెవిలో పూలు ఉంచుకుని నిరసన తెలిపారు. జమ్మలమడుగులో మాదిగ దండోరా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డప్పులు వాయిస్తూ ర్యాలీ నిర్వహించారు.
గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్, రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 8మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రొద్దుటూరులో న్యాయవాదులు, ఉత్తమ ఉపాధ్యాయులు రిలేదీక్షలకు కూర్చున్నారు. జీవనజ్యోతి పబ్లిక్ స్కూలు విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కడపలో న్యాయవాదులు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు కలెక్టరేట్ వద్ద పలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జర్నలిస్టుల రిలేదీక్షలు కూడా కొనసాగుతున్నాయి.
సమ్మెలో విద్యుత్ కార్మికులు:
ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు సమైక్యసమ్మెలో ఉన్నారు. ఈ జాబితాలోకి విద్యుత్ కార్మికులు కూడా చేరారు. బుధవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్‌కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. గురువారం పూర్తిగా విధులకు దూరం కానున్నారు. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా, ఫీజులు పోయినా, తీగలు తెగిపోయినా ఆ ప్రాంత ప్రజలు అంధకారంలో ఉండాల్సిందే!
జోరు వానలో... సమైక్యహోరు
Published Thu, Sep 12 2013 2:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement