కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: లక్ష గళ ఘోషతో కర్నూలు నగరం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు లక్షల జన మహా మానవహారంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నగరాన్ని ఒక వస్తువుగా చేసి, దానికి మానవహారం వేసినట్లుగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేసమయంలో హారంగా నిలబడి కేంద్రానికి రాష్ట్ర విభజనపై తమ నిరసనను తెలియజెప్పారు. అరగంట పాటు నగరమంతా ఒకేసారి సాగిన ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా ఒకేసారి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో కర్నూలు దిక్కులు పిక్కటిల్లాయి. జిల్లా విద్యాసంస్థల జేఏసీ శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన లక్షల జన మహా మానవహారం విజయవంతమైంది.
ఉదయం 10.30 గంటలకు స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో ఔటు పేల్చిన వెంటనే అప్పటికే రహదారులపై చేరుకున్న లక్షలాది మంది ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, బీఈడీ, టీటీసీ, పండిట్ ట్రైనింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, ఆయా కళాశాలల సిబ్బంది, బ్యాంకింగ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మేధావులుఅన్ని రకాల కుల సంఘాలు, అన్ని జేఏసీ సంఘాల సభ్యులు, స్థానిక, స్థానికేతరులు మానవహారంగా ఏర్పడ్డారు.
ఎక్కడ చూసినా జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్రజలు తమ వాణిని వినిపించారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమాన్ని జేఏసీ నాయకులు డాక్టర్ కె. చెన్నయ్య, వి. జనార్దన్‌రెడ్డి, జి. పుల్లయ్య, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, సోమశేఖర్, రాఘవరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, స్వామి, నాగరాజు తదితరులు పర్యవేక్షించారు.
ఇకపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
నెలరోజులుగా సీమాంధ్ర ప్రజలు అలుపెరగకుండా ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రజాప్రతినిదులు సైతం రాజీనామాలు చేయకుండా ఢిల్లీలో దాక్కుని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటన్నింటినీ చూస్తున్న ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇకపై శాంతియుతంగా ఉద్యమాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, ప్రజలు ఆవేశంతో ఉన్నారని అన్నారు. తాము కూడా రెండో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి కేంద్రం మేల్కొనే ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యమాన్ని మరో ఏడాదిపాటైనా నిర్వహంచేందుకు వెనుకాడబోమన్నారు.
రాజీనామాలు చేస్తేనే విభజన ఆగుతుంది
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయని, అప్పుడు రాష్ట్ర విభజన మాటే తలెత్తదని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల పదవీ కాలం కాపాడుకునేం దుకు, అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఉబలాటపడుతున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వస్తే తిరగబడతారని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొనాలంటే తప్పనిసరిగా రాజీనామాలు చేసి ఆమోదించుకుని రావాలని చెప్పారు.
సమైక్య హారం.. సమర నినాదం
Published Sat, Aug 31 2013 4:26 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement