jai samaikayandhra
-
సమైక్య హారం.. సమర నినాదం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: లక్ష గళ ఘోషతో కర్నూలు నగరం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు లక్షల జన మహా మానవహారంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నగరాన్ని ఒక వస్తువుగా చేసి, దానికి మానవహారం వేసినట్లుగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేసమయంలో హారంగా నిలబడి కేంద్రానికి రాష్ట్ర విభజనపై తమ నిరసనను తెలియజెప్పారు. అరగంట పాటు నగరమంతా ఒకేసారి సాగిన ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా ఒకేసారి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో కర్నూలు దిక్కులు పిక్కటిల్లాయి. జిల్లా విద్యాసంస్థల జేఏసీ శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన లక్షల జన మహా మానవహారం విజయవంతమైంది. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో ఔటు పేల్చిన వెంటనే అప్పటికే రహదారులపై చేరుకున్న లక్షలాది మంది ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, బీఈడీ, టీటీసీ, పండిట్ ట్రైనింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, ఆయా కళాశాలల సిబ్బంది, బ్యాంకింగ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మేధావులుఅన్ని రకాల కుల సంఘాలు, అన్ని జేఏసీ సంఘాల సభ్యులు, స్థానిక, స్థానికేతరులు మానవహారంగా ఏర్పడ్డారు. ఎక్కడ చూసినా జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్రజలు తమ వాణిని వినిపించారు. వీరికి వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమాన్ని జేఏసీ నాయకులు డాక్టర్ కె. చెన్నయ్య, వి. జనార్దన్‌రెడ్డి, జి. పుల్లయ్య, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, సోమశేఖర్, రాఘవరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, స్వామి, నాగరాజు తదితరులు పర్యవేక్షించారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నెలరోజులుగా సీమాంధ్ర ప్రజలు అలుపెరగకుండా ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రజాప్రతినిదులు సైతం రాజీనామాలు చేయకుండా ఢిల్లీలో దాక్కుని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటన్నింటినీ చూస్తున్న ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇకపై శాంతియుతంగా ఉద్యమాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, ప్రజలు ఆవేశంతో ఉన్నారని అన్నారు. తాము కూడా రెండో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి కేంద్రం మేల్కొనే ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యమాన్ని మరో ఏడాదిపాటైనా నిర్వహంచేందుకు వెనుకాడబోమన్నారు. రాజీనామాలు చేస్తేనే విభజన ఆగుతుంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయని, అప్పుడు రాష్ట్ర విభజన మాటే తలెత్తదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల పదవీ కాలం కాపాడుకునేం దుకు, అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఉబలాటపడుతున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వస్తే తిరగబడతారని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొనాలంటే తప్పనిసరిగా రాజీనామాలు చేసి ఆమోదించుకుని రావాలని చెప్పారు. -
వాన జోరు.. ఉద్యమ హోరు
ఎక్కడ చూసినా వినూత్న ఉద్యమాలతో మెరుపులు మెరుస్తున్నాయి. జై సమైక్యాంధ్ర నినాదాలు పిడుగులై గర్జిస్తున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై జనం భగ్గుమనడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఉద్యమ మెరుపులు.. నినాదాల పిడుగుల్ని చూసిన వరుణుడు ఉలిక్కిపడ్డాడు. మేఘాలు లేకపోయినా ‘పశ్చిమ’పై జలధారలు కురిపించాడు. అయినా వేడి తగ్గలేదు. జనం చలించలేదు. జోరు వానలోనూ రోడ్లపైనే నిలబడి సమైక్యాంధ్ర పరిరక్షణ పోరును ముందుకు నడిపించారు. ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు, వివిధరూపాల్లో వినూత్న ప్రదర్శనలు 28వ రోజైన మంగళవారం కూడా పెద్దఎత్తున సాగాయి. ఏలూరు/ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జిల్లాలో బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలతోపాటు వినూత్న పద్ధతుల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని విరమించేది లేదని అధికార, ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులు ర్యాలీలు, వినూత్న ప్రదర్శనలు, దేశ నాయకుల వేషధారణలు, విభిన్న ప్రదర్శనలతో ఉద్యమానికి వన్నె తెస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు రిలే దీక్షలో పాల్గొన్నారు. వారికి డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, ఆర్డీవో కె.నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జెడ్పీ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. మహిళా కండక్టర్ల దీక్ష రెండో రోజుకు చేరింది. నగరంలో విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆడిట్, ట్రెజరీ శాఖల ఉద్యోగులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు, డీఆర్డీఏ, ఐకేపీ ఉద్యోగులు, ప్రైవేటు విద్యాసంస్థలు, సర్వేయర్ల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నడి రోడ్డుపై దుస్తులు కుట్టి.. తాడేపల్లిగూడెంలో మహిళా దర్జీలు రోడ్డుపై దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. భీమవరం డీఎన్నార్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జోరు వానలో వేలాది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండిలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు మోకాళ్లపై నడిచారు. తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, బుట్టాయగూడెం, భీమడోలు, ఆకివీడులలో బంద్ విజయవంతమైంది. ఆటోలను కూడా తిరగనివ్వలేదు. చంటిబిడ్డలతో రిలే దీక్షల్లో... జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు చంటిబిడ్డలతో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బోసుబొమ్మ సెంటర్లో కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాల ఆలాపన ఉద్యమకారుల్లో చైతన్యం నింపింది. విద్యార్థి నిరవధిక నిరాహార దీక్ష.. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి పాలకొల్లుకు చెందిన శెట్టి దుర్గాసతీష్ పాలకొల్లులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబితా జూనియర్ బాలికల కళాశాలలో కవు లు, రచయితలు, కళాకారుల సదస్సు నిర్వహించారు. కొవ్వూరులో ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో... సీమాంధ్ర ప్రజలు, రైతులు నష్టపోతున్నా.. విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని తెలిసినా కాంగ్రెస్, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీ స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వకర్త చలుమోలు అశోక్‌గౌడ్ విమర్శించారు. కలపర్రు వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తణుకులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బం ధం చేశారు. దొమ్మేరులో రాష్ట్ర ఎంపీటీసీల సం ఘం మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సంఘీభావం తెలిపారు. పాలకొ ల్లులో మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య దీక్ష చేశారు. గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ద్వారకాతిరుమలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరారుు. వారి ఆరోగ్యం క్షీణించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో సంఘీ భావ దీక్షలు కొనసాగుతున్నారుు. మాజీ ఎమ్మె ల్యే గ్రంధి శ్రీనివాస్ నాయకత్వాన భీమవ రంలో జాతీయ రహదారిపై వర్షంలోనూ రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీ డులలో రిలే దీక్షలు నిర్వహించారు. ఉండి దీక్షా శిబిరంలో పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిది జాన్సన్ పాల్గొన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు నుంచి యర్నగూడెం వద్ద సింగమ్మతల్లి ఆలయానికి వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కొవ్వూరు బస్టాండ్, కొవ్వూరు మెరక వీధిలో రిలే దీక్షలు కొనసాగాయి. -
లక్ష్యం.. సమైక్యం
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసు కున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లా ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పచ్చని రాష్ట్రంలో రేపిన చిచ్చుపై నిరసనాగ్ని ఎగిసి పడుతోంది. కులమతాలకు అతీతంగా.. చిన్నాపెద్ద భేదం లేకుండా.. పట్టణాలు, పల్లెలు సమైక్య గళం వినిపిస్తున్నాయి. వృత్తి ఏదైనా అందరి లక్ష్యం ఒక్కటే. ఆందోళనలు వేరైనా.. పోరు‘బాట’లో కలిసి నడుస్తుండటం విశేషం. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రంజాన్.. నాగులచవితి పర్వదినాలను పురస్కరించుకుని సమైక్య ఉద్యమానికి విరామం ప్రకటించినా పోరు కొనసాగింది. ఇక ఆదివారం సెలవు రోజైనా సమైక్యవాదులు విశ్రమించక తమ వాణి వినిపించారు. ఎప్పటిలానే జై సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా హోరెత్తింది. కర్నూలులో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్లో కాంగ్రెస్ కార్యకర్తలు.. టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు రిలే దీక్షలు నిర్వహించారు. జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కురువ సంఘం ప్రతినిధులు కూడా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుపైనే కరాటే కిక్స్‌తో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. డోన్‌లో వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీరాములు ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. బనగానపల్లెలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. టిప్పర్లు, ట్రాక్టర్ ఓనర్ల సంఘం ఆధ్వర్యంలోనూ వాహనాలతో ర్యాలీ చేపట్టారు. నంద్యాలలో గిరిజన(సుగాలి) మహిళలు మూడు బృందాలుగా విడిపోయి సమైక్యాంధ్రకు మద్దతుగా నృత్యాలు చేశారు. లాయర్లు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోడుమూరు, గూడూరులో క్రిస్టియన్లు సమైక్యాంధ్ర కోసం రోడ్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మిగనూరులో వ్యాపార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పీసీసీ సంయుక్త కార్యదర్శి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జరిగింది. తాపీ క్వారీ సంక్షేమ సంఘం కేసీఆర్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో వికలాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవనకొండలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎద్దులబండ్ల ర్యాలీ చేపట్టారు. మద్దికెరలో యువత పోలీస్‌స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రిలే దీక్ష నిర్వహించారు. ఆదోనిలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. క్రైస్తవులు రోడ్డుపైనే సమైక్యాంధ్ర కొనసాగాలని ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలాఉండగా సోమవారం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు.