కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసు కున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లా ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పచ్చని రాష్ట్రంలో రేపిన చిచ్చుపై నిరసనాగ్ని ఎగిసి పడుతోంది. కులమతాలకు అతీతంగా.. చిన్నాపెద్ద భేదం లేకుండా.. పట్టణాలు, పల్లెలు సమైక్య గళం వినిపిస్తున్నాయి. వృత్తి ఏదైనా అందరి లక్ష్యం ఒక్కటే. ఆందోళనలు వేరైనా.. పోరు‘బాట’లో కలిసి నడుస్తుండటం విశేషం.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రంజాన్.. నాగులచవితి పర్వదినాలను పురస్కరించుకుని సమైక్య ఉద్యమానికి విరామం ప్రకటించినా పోరు కొనసాగింది. ఇక ఆదివారం సెలవు రోజైనా సమైక్యవాదులు విశ్రమించక తమ వాణి వినిపించారు. ఎప్పటిలానే జై సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా హోరెత్తింది. కర్నూలులో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు.. టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు రిలే దీక్షలు నిర్వహించారు.
జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కురువ సంఘం ప్రతినిధులు కూడా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుపైనే కరాటే కిక్స్‌తో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. డోన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీరాములు ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. బనగానపల్లెలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. టిప్పర్లు, ట్రాక్టర్ ఓనర్ల సంఘం ఆధ్వర్యంలోనూ వాహనాలతో ర్యాలీ చేపట్టారు.
నంద్యాలలో గిరిజన(సుగాలి) మహిళలు మూడు బృందాలుగా విడిపోయి సమైక్యాంధ్రకు మద్దతుగా నృత్యాలు చేశారు. లాయర్లు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోడుమూరు, గూడూరులో క్రిస్టియన్లు సమైక్యాంధ్ర కోసం రోడ్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మిగనూరులో వ్యాపార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పీసీసీ సంయుక్త కార్యదర్శి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జరిగింది. తాపీ క్వారీ సంక్షేమ సంఘం కేసీఆర్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో వికలాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు.
దేవనకొండలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎద్దులబండ్ల ర్యాలీ చేపట్టారు. మద్దికెరలో యువత పోలీస్‌స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రిలే దీక్ష నిర్వహించారు. ఆదోనిలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. క్రైస్తవులు రోడ్డుపైనే సమైక్యాంధ్ర కొనసాగాలని ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలాఉండగా సోమవారం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు.
లక్ష్యం.. సమైక్యం
Published Mon, Aug 12 2013 3:42 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM
Advertisement
Advertisement