వాన జోరు.. ఉద్యమ హోరు | Rain Pace.. Seemandhra Movement Bash | Sakshi
Sakshi News home page

వాన జోరు.. ఉద్యమ హోరు

Published Wed, Aug 28 2013 5:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

Rain Pace.. Seemandhra Movement Bash

ఎక్కడ చూసినా వినూత్న ఉద్యమాలతో మెరుపులు మెరుస్తున్నాయి. జై సమైక్యాంధ్ర నినాదాలు పిడుగులై గర్జిస్తున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై జనం భగ్గుమనడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఉద్యమ మెరుపులు.. నినాదాల పిడుగుల్ని చూసిన వరుణుడు ఉలిక్కిపడ్డాడు. మేఘాలు లేకపోయినా ‘పశ్చిమ’పై జలధారలు కురిపించాడు. అయినా వేడి తగ్గలేదు. జనం చలించలేదు. జోరు వానలోనూ రోడ్లపైనే నిలబడి సమైక్యాంధ్ర పరిరక్షణ పోరును ముందుకు నడిపించారు. ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు, వివిధరూపాల్లో వినూత్న ప్రదర్శనలు 28వ రోజైన మంగళవారం కూడా పెద్దఎత్తున సాగాయి.
 
ఏలూరు/ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జిల్లాలో బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలతోపాటు వినూత్న పద్ధతుల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని విరమించేది లేదని అధికార, ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులు ర్యాలీలు, వినూత్న ప్రదర్శనలు, దేశ నాయకుల వేషధారణలు, విభిన్న ప్రదర్శనలతో ఉద్యమానికి వన్నె తెస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు రిలే దీక్షలో పాల్గొన్నారు. వారికి డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, ఆర్డీవో కె.నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జెడ్పీ కార్యాలయం వద్ద  పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. మహిళా కండక్టర్ల దీక్ష రెండో రోజుకు చేరింది. నగరంలో విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆడిట్, ట్రెజరీ శాఖల ఉద్యోగులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు, డీఆర్‌డీఏ, ఐకేపీ ఉద్యోగులు, ప్రైవేటు విద్యాసంస్థలు, సర్వేయర్ల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  
 
నడి రోడ్డుపై దుస్తులు కుట్టి.. తాడేపల్లిగూడెంలో మహిళా దర్జీలు రోడ్డుపై దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. భీమవరం డీఎన్నార్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జోరు వానలో వేలాది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఎస్‌ఆర్‌కేఆర్ విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండిలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు మోకాళ్లపై నడిచారు. తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, బుట్టాయగూడెం, భీమడోలు, ఆకివీడులలో బంద్ విజయవంతమైంది. ఆటోలను కూడా తిరగనివ్వలేదు.

చంటిబిడ్డలతో రిలే దీక్షల్లో... జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు చంటిబిడ్డలతో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బోసుబొమ్మ సెంటర్‌లో కళాకారుడు ఎల్‌ఆర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాల ఆలాపన ఉద్యమకారుల్లో చైతన్యం నింపింది.  
 
విద్యార్థి నిరవధిక నిరాహార దీక్ష.. నరసాపురం స్వర్ణాంధ్ర  ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి పాలకొల్లుకు చెందిన శెట్టి దుర్గాసతీష్ పాలకొల్లులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబితా జూనియర్ బాలికల కళాశాలలో కవు లు, రచయితలు, కళాకారుల సదస్సు నిర్వహించారు. కొవ్వూరులో ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు.  
 
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో... సీమాంధ్ర ప్రజలు, రైతులు నష్టపోతున్నా.. విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని తెలిసినా కాంగ్రెస్, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీ స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వకర్త చలుమోలు అశోక్‌గౌడ్ విమర్శించారు. కలపర్రు వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తణుకులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బం ధం చేశారు. దొమ్మేరులో రాష్ట్ర ఎంపీటీసీల సం ఘం మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సంఘీభావం తెలిపారు. పాలకొ ల్లులో మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య దీక్ష చేశారు.
 
గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ద్వారకాతిరుమలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరారుు. వారి ఆరోగ్యం క్షీణించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో సంఘీ భావ దీక్షలు కొనసాగుతున్నారుు. మాజీ ఎమ్మె ల్యే గ్రంధి శ్రీనివాస్ నాయకత్వాన భీమవ రంలో జాతీయ రహదారిపై వర్షంలోనూ రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీ డులలో రిలే దీక్షలు నిర్వహించారు. ఉండి దీక్షా శిబిరంలో పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిది జాన్సన్ పాల్గొన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు నుంచి యర్నగూడెం వద్ద సింగమ్మతల్లి ఆలయానికి వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కొవ్వూరు బస్టాండ్, కొవ్వూరు మెరక వీధిలో రిలే దీక్షలు కొనసాగాయి.

Related News By Category

Related News By Tags

Advertisement