Parliament Budget Session 2024: మాటల యుద్ధం | Parliament Budget Session 2024: Charanjit Singh Channi vs Ravneet Singh Bittu verbal spat in Lok Sabha gets personal | Sakshi
Sakshi News home page

Parliament Budget Session 2024: మాటల యుద్ధం

Published Fri, Jul 26 2024 4:43 AM | Last Updated on Fri, Jul 26 2024 4:43 AM

Parliament Budget Session 2024: Charanjit Singh Channi vs Ravneet Singh Bittu verbal spat in Lok Sabha gets personal

లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు  

పలుమార్లు వాయిదా పడిన సభ  

బియాంత్‌సింగ్‌ హత్యను ప్రస్తావించిన కాంగ్రెస్‌ ఎంపీ చన్నీ  

అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యుడు బిట్టూ  

న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్‌ ఎంపీ, పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్‌ బిట్టూ తాత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్‌ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు అమరీందర్‌సింగ్‌ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్‌ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్‌ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. 

సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్‌ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్‌ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు.  

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ  
దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్‌ సింగ్‌) జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్‌ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే.  

ఆంధ్రా–బిహార్‌ బడ్జెట్‌: సౌగతా రాయ్‌ 
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతా రాయ్‌ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్‌ బడ్జెట్‌ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్‌ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్‌ మాత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్‌ వ్యాఖ్యానించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement