government employes
-
జీపీఎస్‌తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్
సాక్షి, అమరావతి: సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా.. వారి ఆర్థిక అభ్యున్నతికి స్థిరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ మరోవైపు సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ పొందేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో భారీగా ఉంది. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేస్తే.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి వేతనాలు, పెన్షన్లకు వ్యయమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ భరించలేవని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. జీపీఎస్‌తోనే అధిక పెన్షన్ ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మూల వేతనం (బేసిక్)లో 20 శాతం పెన్షన్ వస్తోంది. సీపీఎస్ వల్ల ఎంత పెన్షన్ వస్తుందనేది పూర్తిగా వడ్డీ రేట్లమీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే పెన్షన్ మొత్తం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తే 8 శాతం వరకు వడ్డీ ఇచ్చేవారు. ఈ 8 శాతం వడ్డీ ప్రస్తుతం 4 శాతానికి తగ్గిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌లో అయితే మూల వేతనంలో 33% పెన్షన్ రానుంది. దీనివల్ల పెన్షన్ 65 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూ.15,647 వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్‌లో అయితే సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం రూ.25,856 పెన్షన్ రానుంది. అదే ఆఫీసర్ సబార్డినేట్ ఉద్యోగికి ప్రస్తుత సీపీఎస్‌లో పదవీ విరమణ అనంతరం రూ.9,579 పెన్షన్ వస్తుండగా, అదే ఉద్యోగికి ప్రతిపాదిత జీపీఎస్‌లో రూ.15,829 పెన్షన్ రానుంది. రాష్ట్ర జనాభా, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఆచరణ సాధ్యం కాకే.. సీపీఎస్‌తో ఉద్యోగులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు కోరుతున్న మేరకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యం కాదని ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు వర్తింపచేయడం అసాధ్యమని వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగుల 20 శాతం కంట్రిబ్యూషన్ కొనసాగిస్తూ పాత పెన్షన్ పథకం వర్తింపచేస్తే 2100 నాటికి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.21,88,047 కోట్లు అవుతుందని వివరించింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 119 శాతంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం ఏకంగా 395 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 20 శాతం కంట్రిబ్యూషన్ లేకుండా సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేస్తే 2100 నాటికి వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.22,81,207 కోట్లు అవుతుందని తెలిపింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 124 శాతమని వెల్లడించింది. కాగా, రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం 446 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జీపీఎస్ వల్ల మేలు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కరోనా, రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులుగా మనం ప్రభుత్వం గురించి కూడా కొంత ఆలోచించాలి. ప్రతిదానిపై వ్యతిరేకంగా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉండదు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మన గురించి ఆలోచించే ప్రభుత్వానికి సహకరించడం మంచిది. – కళ్లేపల్లి మధుసూదనరాజు, అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం జీపీఎస్‌ను ఆహ్వానిస్తున్నాం.. మెజారిటీ రాష్ట్రాల్లో సీపీఎస్ అమలవుతోంది. అయితే తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్ జగన్ జీపీఎస్‌ను ప్రతిపాదించారు. పాత పెన్షన్ విధానంలో బేసిక్‌పై 50 శాతం పెన్షన్ ఇచ్చేవారు. జీపీఎస్ కింద ఇప్పుడు 33.5 శాతం పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన చాలా బాగుంది. ఉద్యోగులు రిటైర్ అయ్యాక మంచిగా ఉండాలని తాను ఆలోచిస్తున్నట్లు పీఆర్సీ ప్రకటించే సమయంలోనే సీఎం ఉద్యోగ సంఘాలతో చెప్పారు. సీపీఎస్ విషయంలో బాధపడుతున్న ఉద్యోగులకు 33.5 శాతం పెన్షన్ గ్యారంటీ ఆహ్వానించదగ్గ విషయం. – కె.జాలిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ -
భర్త బాధ్యతలో సగం..
వేంసూరు: గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. భర్త ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉచితంగా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఉషారాణి. వేంసూరు మండలం అమ్మపాలెం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతుల వరకు 60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నక్కా మోహన్‌రావు ఒక్కరే ఏడు తరగతులకు విద్యాబోధన చేస్తున్నారు. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఏడు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోహన్‌రావు పాఠాలు బోధించడంతో మానసికంగా, శారీరంగా అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. ఇది గమనించిన ఆయన సతీమణి ఉషారాణి భర్తకు సాయంగా నిలవడంతో పాటు విద్యార్థులకు పాఠాలు బోధించాలనే సంకల్పంతో తాను కూడా పాఠశాలకు వెళ్లోంది. డీఈడీ చదవడంతో లాక్డౌన్ తరువాత పాఠశాల తెరిచిన దగ్గరి నుంచి నేటి వరకు తన భర్తతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా పాఠశాలకు తీసుకువెళ్లి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా విద్యార్థులకు సేవ చేస్తోంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. (చదవండి: రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!) -
ప్రభుత్వ ఉద్యోగులకు శఠగోపం!
-
సమ్మెతో యూపీఏ కళ్లు తెరిపిస్తాం
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో రాష్ట్ర విభజనబిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెతో యూపీఏ ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు అన్నారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ భవన్లో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత ఉద్యోగులు సుశిక్షిత సైనికుల వలే కంకణ బద్ధులై సమైక్యపోరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రుల సత్తా ఇప్పటికే కేంద్రం రుచి చూసిందని, ఈ దఫా సమ్మెతో యూపీఏ సర్కారు దిగిరాక తప్పదన్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఎన్జీఓ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే మహాప్రదర్శనకు అన్ని శాఖల ఉద్యోగులు తరలిరావాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలను మూయిస్తామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్ కుమార్ చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, చిత్తశుద్ధితో తెలంగాణా బిల్లును అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో రమణారెడ్డి, శేకర్రావు, మధుసూధన్‌రావు, సతీష్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామసందర్శన భేష్
‘అన్ని పనులకు నిధులు అవసరం లేదు... ప్రభుత్వ టీచర్లు సమయానికి బడికి వెళ్లాలి. విద్యార్థులకు పాఠాలు బోధించాలి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. సబ్ సెంటర్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఏఎన్ఎంలు గ్రామాల్లో పర్యటించి అవసరమైన వైద్య సేవలు అందించాలి. అంగన్వాడీ కార్యకర్తలు ప్రీ స్కూల్ నడపటంతోపాటు మాతాశిశు సంరక్షణలో పాలుపంచుకోవాలి. హాస్టళ్లలో వార్డెన్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, కార్యదర్శులు స్థానికంగా అందుబాటులో ఉండాలి. వీటికి డబ్బులతో పని లేదు. ఎవరికివారుగా ప్రభుత్వ ఉద్యోగులు.. అధికారులు తమ విధుల పట్ల బాధ్యతగా, అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. వీటిని పట్టించుకోకపోతే... ప్రభుత్వ పాఠశాలలన్నా.. వైద్య శాలలన్నా... అంగన్వాడీలన్నా... ప్రభుత్వ పథకాలన్నా ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే పంచాయతీ, వార్డు స్థాయి నుంచే ప్రభుత్వ సేవలు మెరుగుపడాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు, పర్యవేక్షణతోనే అది సాధ్యమవుతుంది. ఆ సదుద్దేశంతోనే వారానికోరోజు ‘గ్రామసందర్శన’కు బయల్దేరుతున్నాను..’ అని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అభిప్రాయపడ్డారు. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : విజయనగరం జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ వీరబ్రహ్మయ్య తన స్వీయ ఆలోచనతో విజయవంతంగా నిర్వహించిన గ్రామ సందర్శన కార్యక్రమాన్ని కరీంనగర్లోనూ పక్కాగా ఆచరణలో పెట్టారు. రెండు నెలలపాటు అనారోగ్యంతో సెలవులో ఉన్న కలెక్టర్... వచ్చీ రాగానే గ్రామ సందర్శనకు బయల్దేరారు. గడిచిన ఆరు నెలలుగా... 23 వారాలుగా నిర్విరామంగా సాగుతున్న ఈ కార్యక్రమంపై కలెక్టర్ ‘సాక్షి’తో ముఖాముఖిలో తన అభిప్రాయాలు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని... అప్పుడు ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అధికారులే గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగపు పనితీరు... ప్రజలు పడుతున్న ఇబ్బందులు... వివిధ కార్యక్రమాల అమలు తీరు గ్రామ సందర్శనతో తనకు నేరుగా తెలిసిపోతాయన్నారు. మండలస్థాయిలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధించటం తేలికవుతుందన్నారు. ‘ప్రతి మండలంలో వివిధ విభాగాల్లో దాదాపు 20 మంది అధికారులుంటారు. వీరందరూ కలుసుకోకపోతే ప్రతీ చిన్న సమస్య పరిష్కారానికి ఉత్తర ప్రత్యుత్తరాల పేరుతో జాప్యం జరుగుతుంది. గ్రామ సందర్శనతో ప్రతీ గురువారం వీరందరూ కలుసుకుంటున్నారు. దీంతో కొన్ని అర్జీలు అక్కడికక్కడే పరిష్కారమవుతున్నాయి..’ అని చెప్పారు. ‘జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలు, 326 వార్డులున్నాయి. ఇప్పటికే ఒకసారి అన్నింటినీ సందర్శించాం. 1540 ఆరోగ్య శిబిరాలు, 1300 పశు వైద్య శిబిరాలు నిర్వహించాం. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పీహెచ్‌సీలు, హాస్టళ్లను తనిఖీ చేయటంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాం...’ అని వివరించారు. మరోవైపు గ్రామసభల్లో ప్రజల వ్యక్తిగత అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. మౌలిక వసతులు, సామాజిక అవసరాలను సైతం గుర్తిస్తున్నామన్నారు. వీటిని ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 380 బోరుబావి మరమ్మతులు, 405 కొత్త బోర్లకు విజ్ఞప్తులు, 686 పైపులైన్లు, 5,701 ఇతర అవసరాలకు సంబంధించిన వినతులు అందినట్లు వివరించారు. గ్రామ సందర్శనలో గుర్తించిన పనులకు జిల్లా పరిషత్తు నుంచి రూ.3.5 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్తులో జనరల్ ఫండ్, అందుబాటులో ఉన్న నిధుల నుంచి వీటిని మంజూరు చేస్తామన్నారు. మొత్తంగా రూ.7 కోట్లు అందుబాటులో ఉన్నాయని... వీటిలో సగం నిధులు ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకు కేటాయించి... మిగతా సగం నిధులు గ్రామ సందర్శనలో గుర్తించిన సామాజిక సమస్యల పరిష్కారానికి వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వార్డు సందర్శనలో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతగా మున్సిపాలిటీల్లో ఉన్న నిధులను ఖర్చు చేస్తామన్నారు. -
బీజేపీకీ ‘బొగ్గు’ మసి
న్యూఢిల్లీ: తాజాగా బీజేపీకీ ‘బొగ్గు’ మసి అంటుకుంది. ఎన్డీఏ హయాంలో 1993-2005 మధ్య జరిగిన బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ బుధవారం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. వాటిలో ఒకదాంట్లో బీజేపీ నేత అనూప్ అగ్రవాలా, ఆయన కంపెనీల పేర్లు ఉన్నాయి. బీఎల్ఏ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ అనూప్ అగ్రవాలా, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, కేస్ట్రన్ టెక్నాలజీస్, కేస్ట్రన్ మైనింగ్ కంపెనీలు, వాటి డెరైక్టర్లు, గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాజ్యసభ మాజీ సభ్యుడు పీకే అగ్రవాలా కుమారుడైన అనూప్ అగ్రవాలా బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర శాఖ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడిగా, పార్టీ జాతీయ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గు కుంభకోణంలో విపక్ష నేత ఒకరి పేరు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీనిపై అగ్రవాలా, ఆయన కంపెనీ నుంచి మీడియాకు ఎలాంటి ప్రతిస్పందన లభించలేదు. అగ్రవాలా మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా, ఆయన అందుబాటులో లేరని ఆయన అనుచరుడు ఎస్కే శుక్లా బదులిచ్చారు. ముంబైలో ప్రధాన కార్యాలయం గల బీఎల్ఏ ఇండస్ట్రీస్ కంపెనీ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పుతామంటూ మధ్యప్రదేశ్‌లో రెండు బొగ్గు బ్లాకులు పొందింది. అయితే, ఈ కంపెనీ బహిరంగ మార్కెట్లో బొగ్గును అమ్ముకుంటోందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. బహిరంగ మార్కెట్లో ఈ సంస్థ జరిపే బొగ్గు అమ్మకాల విలువ ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. బొగ్గు శాఖలోని గుర్తు తెలియని అధికారులతో కుమ్మక్కైన బీఎల్ఏ కంపెనీ, బొగ్గు ను విద్యుదుత్పాదన కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపించింది. జార్ఖం డ్లో బొగ్గు బ్లాకులు పొందిన కేస్ట్రన్ సంస్థ కోల్‌కతా కేంద్రం గా పనిచేస్తోంది. తాజాగా నమోదు చేసుకున్న రెండు ఎఫ్ఐఆర్ల నేపథ్యంలో సీబీఐ అధికారులు ధన్‌బాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ పెట్టుబడులు ప్రాతిపదిక కాబోదు: ‘సుప్రీం’ బొగ్గు గనుల లెసైన్సులు రద్దు చేయకుండా ఉండటానికి, ఆయా గనుల్లో కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయనే అంశం ప్రాతిపదిక కాబోదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అన్ని అనుమతులు రాక ముందే కంపెనీలు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. గనుల కేటాయింపులను రద్దు చేయాలని భావిస్తున్నారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని అనుమతులు రాకుండానే గనుల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తమ సొంత రిస్కుతోనే ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాయని, కంపెనీలు ఏ మేరకు పెట్టుబడులు పెట్టినా, తర్వాత తలెత్తే పర్యవసానాలకు అవే బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. -
సమైక్య ఘోష
సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. వినూత్న రీతిలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు నిరసనలు చేపడుతూ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళుతున్నారు. కడపలో రింగ్‌రోడ్డు చుట్టూ 36 కిలోమీటర్ల మేర మహా మానవహారం పేరుతో వేలాది మంది చేతులు కలిపి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా బారులు తీరి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఇంజనీర్లు కడపలోని ఇరిగేషన్ రెగ్యులర్ కార్యాలయంలో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. జేఏసీ చైర్మన్‌గా హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ సుధాకర్‌బాబును ఎన్నుకున్నారు. గురువారం నుంచే సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. కడప నగరం రింగ్‌రోడ్డు చుట్టూ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మహా మానవహారంగా ఏర్పడి సమైక్య ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బి అంజాద్బాష నేతృత్వంలో నేతలు మౌన దీక్షలు చేపట్టారు. జమ్మలమడుగులో ఎస్పీడీ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ప్రిన్సిపాల్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు విద్యుత్ షాక్ ఇచ్చి దహనంచేశారు. వీటికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నేత తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో నారాయణ స్కూలు విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసనను తెలియజేశారు. విద్యార్థి జేఏసీ, వైద్యులు, న్యాయవాదులు, మున్సిపల్, ప్రైవేటు విద్యాసంస్థలు, ఏపీఎస్ఆర్టీసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు బస్టాండు ప్రాంతంలో రోడ్డుపైనే విద్యుత్ తీగలు లాగి దుస్తులు ఆరవేసి వినూత్నంగా నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యరశాల సర్పంచ్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యోగులు పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలతో నిరసన తెలిపారు. రాజంపేట పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బోయనపల్లె అన్నమయ్య విగ్రహం వద్ద జాతీయ రహదారిపై వేలాది మంది మానవహారంగా ఏర్పడి దిగ్బంధనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ టోపీలు ధరించి ఆందోళన చేపట్టారు. సిల్వర్ బెల్ట్ స్కూలు విద్యార్థులు తెలుగు తల్లి, జాతీయ నాయకుల వేషధారణతోపాటు పిరమిడ్ ఆకృతుల్లో ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమం 50 రోజులకు చేరడంతో ‘50’ ఆకారంలో కూర్చొన్నారు. దేశభక్తి గేయాలను ఆలపించారు. వైఎస్సార్ సీపీ నేతలు పంజం సుకుమార్‌రెడ్డి, రమేష్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు సాగాయి. పులివెందుల పట్టణంలో ఉపాధ్యాయ, సమైక్యాంధ్ర జేఏసీ, హౌసింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. 500 మీటర్ల నల్లజెండాలతో నిరసన ర్యాలీని చేపట్టారు. కేసీఆర్ సోనియాలకు దున్నపోతుల వేషధారణ వేసి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ దీక్షా శిబిరంలో 50 మంది దంపతులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వివేకానంద విద్యాధరి స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ టీఎఫ్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ సద్భావన బస్సుయాత్రకు వైఎస్సార్ సీపీ ముఖ్య నేత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మైదుకూరులో సప్లయర్స్ యజమానులు, వర్కర్ల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు వీరికి మద్దతు తెలిపారు. -
సమైక్య హారం.. సమర నినాదం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: లక్ష గళ ఘోషతో కర్నూలు నగరం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు లక్షల జన మహా మానవహారంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నగరాన్ని ఒక వస్తువుగా చేసి, దానికి మానవహారం వేసినట్లుగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేసమయంలో హారంగా నిలబడి కేంద్రానికి రాష్ట్ర విభజనపై తమ నిరసనను తెలియజెప్పారు. అరగంట పాటు నగరమంతా ఒకేసారి సాగిన ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా ఒకేసారి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో కర్నూలు దిక్కులు పిక్కటిల్లాయి. జిల్లా విద్యాసంస్థల జేఏసీ శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన లక్షల జన మహా మానవహారం విజయవంతమైంది. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో ఔటు పేల్చిన వెంటనే అప్పటికే రహదారులపై చేరుకున్న లక్షలాది మంది ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, బీఈడీ, టీటీసీ, పండిట్ ట్రైనింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, ఆయా కళాశాలల సిబ్బంది, బ్యాంకింగ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మేధావులుఅన్ని రకాల కుల సంఘాలు, అన్ని జేఏసీ సంఘాల సభ్యులు, స్థానిక, స్థానికేతరులు మానవహారంగా ఏర్పడ్డారు. ఎక్కడ చూసినా జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్రజలు తమ వాణిని వినిపించారు. వీరికి వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమాన్ని జేఏసీ నాయకులు డాక్టర్ కె. చెన్నయ్య, వి. జనార్దన్‌రెడ్డి, జి. పుల్లయ్య, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, సోమశేఖర్, రాఘవరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, స్వామి, నాగరాజు తదితరులు పర్యవేక్షించారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నెలరోజులుగా సీమాంధ్ర ప్రజలు అలుపెరగకుండా ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రజాప్రతినిదులు సైతం రాజీనామాలు చేయకుండా ఢిల్లీలో దాక్కుని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటన్నింటినీ చూస్తున్న ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇకపై శాంతియుతంగా ఉద్యమాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, ప్రజలు ఆవేశంతో ఉన్నారని అన్నారు. తాము కూడా రెండో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి కేంద్రం మేల్కొనే ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యమాన్ని మరో ఏడాదిపాటైనా నిర్వహంచేందుకు వెనుకాడబోమన్నారు. రాజీనామాలు చేస్తేనే విభజన ఆగుతుంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయని, అప్పుడు రాష్ట్ర విభజన మాటే తలెత్తదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల పదవీ కాలం కాపాడుకునేం దుకు, అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఉబలాటపడుతున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వస్తే తిరగబడతారని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొనాలంటే తప్పనిసరిగా రాజీనామాలు చేసి ఆమోదించుకుని రావాలని చెప్పారు. -
సీపీఎస్‌పై స్టాక్ మార్కెట్ ప్రభావం
మానకొండూర్, న్యూస్‌లైన్ : రూపాయి విలువ పతనంతోపాటు స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు అందరినీ కలవరపెడుతున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానంలో నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులపై ఈ ప్రభావం భారీగా పడనుంది. అవసరాలకు దాచుకున్న డబ్బులు స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా అ సలు కంటే తగ్గుముఖం పట్టగా కనీసం తాము జమ చేసిన సొమ్ము కూడా చేతికి వస్తుందో లేదోననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ప్ర భుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్) అమలు చేస్తోంది. ఉద్యోగి వేతనంలో బేసిక్‌తోపాటు డీఏలో పది శాతం మినహాయించి, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటా కింద ప్రాన్(పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్)లో జమ చేస్తోంది. ఇలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఎన్ఎస్డీఎల్ ద్వారా ఎస్బీఐ పెన్షన్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కింద, యూటీఐ సొల్యూషన్ లిమిటెడ్, ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో పెట్టుబడిగా పెడుతోంది. ఉద్యోగులకు ఆప్షన్స్ ఉన్నా ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో డీఫాల్ట్‌గా ఈ కంపెనీల్లోనే పెట్టుబడిగా వెళ్తాయి. నెల రోజులుగా ఈ మూడు కంపెనీల షేర్ల విలువలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందుకు రూపా యి విలువ పతనం కూడా ఓ కారణమవుతోంది. దీంతో ప్రాన్‌లో జమ అయిన అసలు మొత్తం కూడా తగ్గిపోతోంది. ఉదాహరణకు 2005 నవంబర్ 21న ఉద్యోగంలో చేరిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన అప్రెంటిస్ కాలం పూర్తయిన తర్వాత 2008 ఏప్రిల్ నుంచి పెన్షన్ మొత్తాన్ని ప్రాన్‌లో జమ చేయడం మొదలెట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 20 నాటికి ఆయన ప్రాన్ అకౌంట్లో రూ.లక్షా 45 వేల 386 జమయ్యాయి. స్టాక్ మార్కెట్ ప్రభావం కారణంగా అది కాస్త రూ.లక్షా 43 వేల 769.90కి తగ్గింది. అంటే వడ్డీ పోను తన అసలు కంటే రూ.వెయ్యి 616.10 తగ్గిపోయింది. నెల క్రితం వరకు స్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. నెలరోజుల్లోనే తమ అసలు మొత్తాలు తగ్గిపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2004 సెప్టెంబర్‌కు ముందు నియామకమైన ఉద్యోగులు వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి యాభై శాతం తీసుకునే వీలుంది. కానీ సీపీఎస్ విధానంలో ఉద్యోగులు ప్రాన్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకునే వీలులేదు. ఉద్యోగి రిటైరైనా, ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా విరమణ పొందినా, మరణించినా ప్రాన్‌లో జమైన మొత్తం నుంచి 60 శాతం వరకు తీసుకునే వీలుంది. తమ కనీస అవసరాలకు పనికి రాని ఈ సొమ్ము వయసు పైబడిన తర్వాత ఎంత వచ్చినా వృథానే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సొమ్ముకు భద్రత లేని ఈ నూతన పెన్షన్ పథకం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సొమ్ముకు జీపీఎఫ్ ప్రకారం వడ్డీ ఇస్తూ అసలుకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.