బీజేపీకీ ‘బొగ్గు’ మసి | Coalgate: BJP leader named in CBI FIR | Sakshi
Sakshi News home page

బీజేపీకీ ‘బొగ్గు’ మసి

Published Thu, Jan 9 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

బీజేపీకీ ‘బొగ్గు’ మసి

బీజేపీకీ ‘బొగ్గు’ మసి

న్యూఢిల్లీ: తాజాగా బీజేపీకీ ‘బొగ్గు’ మసి అంటుకుంది. ఎన్డీఏ హయాంలో 1993-2005 మధ్య జరిగిన బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ బుధవారం రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. వాటిలో ఒకదాంట్లో బీజేపీ నేత అనూప్ అగ్రవాలా, ఆయన కంపెనీల పేర్లు ఉన్నాయి.
 
 
 బీఎల్‌ఏ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ అనూప్ అగ్రవాలా, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, కేస్ట్రన్ టెక్నాలజీస్, కేస్ట్రన్ మైనింగ్ కంపెనీలు, వాటి డెరైక్టర్లు, గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజ్యసభ మాజీ సభ్యుడు పీకే అగ్రవాలా కుమారుడైన అనూప్ అగ్రవాలా బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర శాఖ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడిగా, పార్టీ జాతీయ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గు కుంభకోణంలో విపక్ష నేత ఒకరి పేరు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీనిపై అగ్రవాలా, ఆయన కంపెనీ నుంచి మీడియాకు ఎలాంటి ప్రతిస్పందన లభించలేదు.
 
  అగ్రవాలా మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా, ఆయన అందుబాటులో లేరని ఆయన అనుచరుడు ఎస్‌కే శుక్లా బదులిచ్చారు. ముంబైలో ప్రధాన కార్యాలయం గల బీఎల్‌ఏ ఇండస్ట్రీస్ కంపెనీ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పుతామంటూ మధ్యప్రదేశ్‌లో రెండు బొగ్గు బ్లాకులు పొందింది. అయితే, ఈ కంపెనీ బహిరంగ మార్కెట్‌లో బొగ్గును అమ్ముకుంటోందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. బహిరంగ మార్కెట్‌లో ఈ సంస్థ జరిపే బొగ్గు అమ్మకాల విలువ ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. బొగ్గు శాఖలోని గుర్తు తెలియని అధికారులతో కుమ్మక్కైన బీఎల్‌ఏ కంపెనీ, బొగ్గు ను విద్యుదుత్పాదన కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపించింది. జార్ఖం డ్‌లో బొగ్గు బ్లాకులు పొందిన కేస్ట్రన్ సంస్థ కోల్‌కతా కేంద్రం గా పనిచేస్తోంది. తాజాగా నమోదు చేసుకున్న రెండు ఎఫ్‌ఐఆర్‌ల నేపథ్యంలో సీబీఐ అధికారులు ధన్‌బాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  
 
 భారీ పెట్టుబడులు ప్రాతిపదిక కాబోదు: ‘సుప్రీం’
 బొగ్గు గనుల లెసైన్సులు రద్దు చేయకుండా ఉండటానికి, ఆయా గనుల్లో కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయనే అంశం ప్రాతిపదిక కాబోదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అన్ని అనుమతులు రాక ముందే కంపెనీలు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. గనుల కేటాయింపులను రద్దు చేయాలని భావిస్తున్నారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని అనుమతులు రాకుండానే గనుల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తమ సొంత రిస్కుతోనే ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాయని, కంపెనీలు ఏ మేరకు పెట్టుబడులు పెట్టినా, తర్వాత తలెత్తే పర్యవసానాలకు అవే బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement