అమ్మమ్మ పరిచిన విస్తరి | Nilza Wangmo Restaurants Successfully Running 3 Popular Branches Across Ladakh | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ పరిచిన విస్తరి

Published Mon, Dec 9 2019 12:26 AM | Last Updated on Mon, Dec 9 2019 12:26 AM

Nilza Wangmo Restaurants Successfully Running 3 Popular Branches Across Ladakh - Sakshi

నలభై ఏళ్ల కశ్మీరీ మహిళ నీల్జాకి జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. ప్రతి ఆకును ఏరి తెచ్చి కుట్టుకుని, తిండి గింజల్ని మోసుకొచ్చి స్వయంగా వండి వార్చి వడ్డించుకున్న విస్తరి. ‘ఆల్చి కిచెన్‌’ పేరుతో ఆమె 2016లో స్థాపించిన రెస్టారెంట్‌ మూడేళ్లలో మూడు బ్రాంచ్‌లకు విస్తరించింది. ఇక లధాక్‌ దాటి ముంబయి, ఢిల్లీలకు విస్తరించడమే తరువాయి. అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న వంటలే ఆమె ఆహార వ్యాపారానికి ఆవిరి పట్టు అయ్యాయి!  

ఆల్చి మోనాస్ట్రీ ప్రముఖ బౌద్ధక్షేత్రం, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా. ఇది లధాక్‌ రాష్ట్ర రాజధాని లేహ్‌ నగరానికి 66 కిమీల దూరంలో ఉంది. అలాంటి చోట ఒక పెద్ద వంటగది స్థాయిలో చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించింది నీల్జా. ఆల్చి ప్రజలు రోజూ చేసుకునే సంప్రదాయ వంటకాలు, స్థానికులు మర్చిపోతున్న రుచులతో రెస్టారెంట్‌ పెట్టాలనే ఆమె ఆలోచనకు ఒక్క ఓటు కూడా పడలేదు. ‘మనవాళ్లే మన వంటకాలను మానేసి టీవీలు చూసి కొత్త వంటలు వండుకుంటున్నారు, ఇప్పుడు మన వంటలతో వ్యాపారం మొదలు పెడితే లొట్టలు వేసుకుంటూ తినేదెవ్వరు?’ అని స్నేహితులు, బంధువులు కూడా భయపెట్టారు. వాళ్ల అమ్మ అయితే ’ఈ ప్రయత్నం మనల్ని గట్టెక్కిస్తుందంటావా’ అని దీనంగా అడిగింది. ’గట్టెక్కి తీరుతాం అన్నది’ నీల్జా ధీమాగా. 

పర్యాటకులే లక్ష్యం
లధాక్‌ వాసుల జీవనం అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సాగుతుంది. వారి ఆహారపు అలవాట్లు కూడా వాతావరణానికి అనుగుణంగానే ఉంటాయి. బార్లీ, బక్‌ వీట్, మిల్లెట్‌ ప్రధాన ఆహారం. బక్‌వీట్‌ గోధుమ గింజలకంటే చిన్నవిగా బార్లీ గింజలకంటే పెద్దవిగా ఉంటాయి. దేహంలో వేడిని నిలుపుతాయి. కాబట్టి పర్యాటకులు లధాక్‌ వాతావరణంలో పర్యటన కాలమంతా ఆరోగ్యంగా ఉండాలంటే స్థానిక ఆహారం రోజులో ఒక్కసారయినా తింటే మంచిది. ఆక్రోటు గింజల చట్నీ, బ్రెడ్‌లో మాంసాన్ని స్టఫ్‌ చేసిన ’ఖాంబిర్‌’, ఇటాలియన్‌ పాస్తాను పోలిన ‘చుతాగి’ వంటి వాటిని నీల్జా తన మెనూలో చేర్చారు. ఆల్చిలో ఇతర రెస్టారెంట్‌ల వాళ్లు కూడా లధాకీ ఆహారాన్ని ఇస్తున్నప్పటికీ, నీర్జా రెస్టారెంట్‌కి ఆదరణ పెరగడానికి కారణం కామన్‌గా కొన్ని లధాకీయేతర వంటకాలను కూడా అందుబాటులో ఉంచగలగడం. అలాగే పర్యాటకులు అలసిపోకుండా ఉండడానికి మెనూలో మిల్లెట్‌ డ్రింక్‌ ఉండడం!  రోజుకు వంద మంది వరకు మాత్రమే వస్తున్నప్పటికీ వంట నుంచి ప్రతిదీ స్వయంగా పర్యవేక్షించడమే తన విజయ రహస్యం అంటారు నీల్జా. 

తల్లి పడిన కష్టమే స్ఫూర్తి 
నీల్జా తల్లి గర్భంలో ఉండగానే తండ్రి పోవడంతో అమ్మమ్మ గారింట్లోనే పెరిగింది. తల్లి  కష్టపడి కాలేజ్‌ వరకు చదివించింది. నీల్జాకు ఊహ తెలిసిన తర్వాత ఒకసారి అమ్మమ్మ గారి ఊరు ‘స్తాక్‌’ నుంచి తల్లితోపాటు ఆల్చిలోని తాతగారింటికి (తండ్రి కి తండ్రి) వెళ్లడం, వాళ్లు తమను రానివ్వకపోవడం ఇంకా జ్ఞాపకమేనంటారు నీల్జా.‘‘అప్పుడు తాత (అమ్మ నాన్న) ధైర్యం చేసి ఆల్చిలో మా కోసం ఒక ఇల్లు కట్టించి ఇచ్చి అందులోనే వారి ఎదురుగా ఉండమని చెప్పడం కూడా ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటారామె. 
– మంజీర

నాకున్న ధైర్యం ఒక్కటే
బ్యాంకు నుంచి చిన్న మొత్తం లోన్‌ తీసుకుని ఇంటి ఆవరణలోనే రెస్టారెంట్‌లా ప్రారంభించాను. చదువుకుంటున్న రోజుల్లో టూరిస్ట్‌ గైడ్‌గా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేశాను. పర్యాటకులు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి వంటకాలను రుచి చూడడానికి ఆసక్తి చూపిస్తారని తెలిసింది. మంచి రెస్టారెంట్‌ పెట్టాలనే కోరిక అప్పటి నుంచి ఉండేది. నాకున్న ధైర్యమంతా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న వంటలే.  ఇప్పుడు ముంబయి, ఢిల్లీ నగరాల్లో కొత్తగా రెస్టారెంట్‌ వ్యాపారంలోకి రావాలనుకుంటున్న వాళ్లు మా ఫ్రాంచైసీ అడుగుతున్నారు.
– నీల్జా వాంగ్‌ మూ, ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement