అధిక సంపన్నులున్న నగరాల్లో ముంబై, ఢిల్లీ
♦ జాబితాలో టోక్యో నంబర్ వన్
♦ హైదరాబాద్‌లో సంపన్నులు 7,800 మంది...
న్యూఢిల్లీ: సంపన్నులు (మిలియనీర్లు) అధికంగా ఉన్న ఆసియా పసిఫిక్ ప్రాంతపు నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ స్థానం దక్కించుకున్నాయి. 41,200 మంది సంపన్నులతో ముంబై 12వ స్థానంలో, 20,600 మంది సంపన్నులతో ఢిల్లీ 20వ స్థానంలో నిలిచాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్ 2016 వెల్త్’ నివేదిక ప్రకారం.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపన్నులు అధికంగా ఉన్న నగరాల్లో 2.64 లక్షల మంది సంపన్నులతో టోక్యో అగ్రస్థానంలో ఉంది.
ఒక మిలియన్ డాలర్లకు సమానంగా లేదా అధికంగా సంపదను కలిగిన వారిని ధనవంతులుగా (మిలియనీర్లు) పరిగణనలోకి తీసుకుంటారు. కాగా పది మిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన మల్టీ మిలియనీర్ల జాబితాలో 9,650 మందితో హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో 2,690 మందితో ముంబై 8వ స్థానంలో, 1,340 మందితో ఢిల్లీ 14వ స్థానంలో నిలిచాయి. దేశంలో 10,000 మందికి లోపు సంపన్నులను కలిగిన నగరాల జాబితాలో 7,800 మందితో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
అగ్రస్థానంలో కోల్‌కతా (8,700 మంది) నిలిచింది. ఇక వీటి తర్వాతి స్థానాల్లో బెంగళూరు (6,700 మంది), చెన్నై (6,000 మంది) ఉన్నాయి. కాగా భారత్‌లో మల్టీ మిలియనీర్లు కోల్‌కతాలో 560 మంది, హైదరాబాద్‌లో 510 మంది, బెంగళూరులో 430 మంది ఉన్నారు. వచ్చే పదేళ్లలో సంపన్నులు వేగంగా పెరుగుతున్న పట్టణాల జాబి తాలో ముంబై, ఢిల్లీ ప్రాంతాలు టాప్-3లోకి చేరవచ్చని ‘న్యూ వరల్డ్ వెల్త్’ పేర్కొంది.