న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మహిళలకే కాదు పిల్లలకూ భద్రత కరువైంది. పిల్లల అపహరణలు, వారిపై అఘాయిత్యాలు దేశంలోని 53 నగరాల్లోకెళ్ల ఢిల్లీలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సగటున రోజుకు 16 మంది పిల్లలు ఏదోరకంగా బలిపశువులవుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పిల్లలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఇంతగా లేదు. ముంబైలో సగటున రోజుకు ముగ్గురు పిల్లలపై నేరాలు జరుగుతున్నట్లు జాతీయ నేర గణాంకాల విభాగం(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. పిల్లల కోసం శ్రీనగర్ దేశంలోనే అత్యంత భద్రమైన నగరంగా పేర్కొంది.
ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన 2013 గణాంకాల ప్రకారం ఢిల్లీలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో 6,124 కేసులు నమోదుకాగా ముంబైలో 902 కేసులు నమోదయ్యా. రాంచీ, జంషెడ్‌పూర్(జార్ఖండ్), అన్సోల్(పశ్చిమ బెంగాల్) పట్టణాల్లో కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే కేసులు పెట్టేందుకు ఇక్కడికి ఎవరూ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణమని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఇక జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీన గర్ పట్టణంలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. అయితే ఇక్కడి ప్రజల్లో పోలీసులు, స్టేషన్లు, కేసులు, కోర్టులపై కొంతమేర అవగాహన ఉంది. నిజానికి ఇక్కడ పిల్లలపైనే కాకుండా ఇతర నేరాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది.
ఇక దేశవ్యాప్తంగా పిల్లలపై జరుగుతున్న నేరాల సంఖ్య 52.5 శాతం పెరిగింది. 2012లో 38,172 కేసులు నమోదు కాగా 2013లో 58,224 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా.. అంటే 54.2 శాతం అపహరణ కేసులే. అపహరణకు గురవుతున్న చిన్నారుల్లో కూడా బాలికల సంఖ్య సగానికిపైగానే ఉంది. ఇక నమోదైన మిగతా కేసుల్లో సింహభాగం అత్యాచారాలకు సంబంధించినవే. 44.7 శాతం కేసులు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులేనని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. ఇక దేశంలోనే బాలలపై నేరాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రంగా కూడా ఉత్తరప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఇక్కడ ఏకంగా 8,247 కేసులు నమోదయ్యాయి.
మహిళలకే కాదు...పిల్లలకూ భద్రత కరువే..!
Published Mon, Jul 21 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement