దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో గాలి పీల్చితే రోజుకు 7.7 సిగరెట్లు తాగినట్లే. అదే మన ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఒక రోజు శ్వాస తీసుకుంటే 4 సిగరెట్లు తాగినట్లే. దేశంలోని మిగతా పెద్ద నగరాల్లో కూడా గాలి స్వచ్చత అంతంత మాత్రమే. వీటిలో నివసిస్తున్న సగటు వ్యక్తి రోజుకు రెండు నుంచి ఎనిమిది సిగరెట్లు కాల్చుతున్నట్లే లెక్క. అవును. వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఏప్రిల్‌లో ‘షూట్ ఐ స్మోక్’ అనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను పారిస్‌లో విడుదల చేశారు.
ఈ యాప్ ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లోని గాలి స్వచ్చతను సిగరెట్ పొగతో పోల్చి అంచనాలను చూపుతుంది. ఇలా భారత్‌లోని కీలక నగరాల గాలి స్వచ్చత తీవ్ర స్థాయిలో దిగజారినట్లు ఈ యాప్ తెలుపుతోంది. కాగా, కేంద్ర కాలుష్య నివారణ సంస్థ(సీపీసీబీ) మాత్రం ఈ యాప్ అంచనాలు సరైనవి కావంటూ కొట్టి పారేసింది. విదేశాల్లో చేసిన పరిశోధనల ఆధారంగా భారత్‌లో వాయు కాలుష్యాన్ని సిగరెట్ పొగతో పోల్చి చెప్పడం సరికాదని పేర్కొంది.
దేశంలో గాలి కాలుష్యానికి సంబంధించిన డేటాను మాత్రమే అధికారికంగా సీపీసీబీ మాత్రమే విడుదల చేస్తుందని తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీని పేర్కొన్న విషయం తెలిసిందే. సంస్థ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన తొలి 20 నగరాల్లో భారత్‌కు చెందినవి 14 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment