సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. వినూత్న రీతిలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు నిరసనలు చేపడుతూ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళుతున్నారు.
కడపలో రింగ్‌రోడ్డు చుట్టూ 36 కిలోమీటర్ల మేర మహా మానవహారం పేరుతో వేలాది మంది చేతులు కలిపి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా బారులు తీరి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఇంజనీర్లు కడపలోని ఇరిగేషన్ రెగ్యులర్ కార్యాలయంలో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. జేఏసీ చైర్మన్‌గా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ సుధాకర్‌బాబును ఎన్నుకున్నారు. గురువారం నుంచే సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు.
కడప నగరం రింగ్‌రోడ్డు చుట్టూ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మహా మానవహారంగా ఏర్పడి సమైక్య ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బి అంజాద్‌బాష నేతృత్వంలో నేతలు మౌన దీక్షలు చేపట్టారు.
జమ్మలమడుగులో ఎస్‌పీడీ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ప్రిన్సిపాల్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు విద్యుత్ షాక్ ఇచ్చి దహనంచేశారు. వీటికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నేత తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
ప్రొద్దుటూరు పట్టణంలో నారాయణ స్కూలు విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసనను తెలియజేశారు. విద్యార్థి జేఏసీ, వైద్యులు, న్యాయవాదులు, మున్సిపల్, ప్రైవేటు విద్యాసంస్థలు, ఏపీఎస్‌ఆర్‌టీసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు బస్టాండు ప్రాంతంలో రోడ్డుపైనే విద్యుత్ తీగలు లాగి దుస్తులు ఆరవేసి వినూత్నంగా నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యరశాల సర్పంచ్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యోగులు పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలతో నిరసన తెలిపారు.
రాజంపేట పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బోయనపల్లె అన్నమయ్య విగ్రహం వద్ద జాతీయ రహదారిపై వేలాది మంది మానవహారంగా ఏర్పడి దిగ్బంధనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.
రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ టోపీలు ధరించి ఆందోళన చేపట్టారు. సిల్వర్ బెల్ట్ స్కూలు విద్యార్థులు తెలుగు తల్లి, జాతీయ నాయకుల వేషధారణతోపాటు పిరమిడ్ ఆకృతుల్లో ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమం 50 రోజులకు చేరడంతో ‘50’ ఆకారంలో కూర్చొన్నారు. దేశభక్తి గేయాలను ఆలపించారు. వైఎస్సార్ సీపీ నేతలు పంజం సుకుమార్‌రెడ్డి, రమేష్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.
రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు సాగాయి.
పులివెందుల పట్టణంలో ఉపాధ్యాయ, సమైక్యాంధ్ర జేఏసీ, హౌసింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. 500 మీటర్ల నల్లజెండాలతో నిరసన ర్యాలీని చేపట్టారు. కేసీఆర్ సోనియాలకు దున్నపోతుల వేషధారణ వేసి నిరసన వ్యక్తం చేశారు.
జేఏసీ దీక్షా శిబిరంలో 50 మంది దంపతులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వివేకానంద విద్యాధరి స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ టీఎఫ్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ సద్భావన బస్సుయాత్రకు వైఎస్సార్ సీపీ ముఖ్య నేత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
మైదుకూరులో సప్లయర్స్ యజమానులు, వర్కర్ల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు వీరికి మద్దతు తెలిపారు.
సమైక్య ఘోష
Published Thu, Sep 19 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
Advertisement
Advertisement