సాక్షి, కడప : ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గత రబీ, ఇప్పుడు ఖరీఫ్ సీజన్‌లోను ఊరటకలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ సిద్ధిక్ యోజన పేరిట నగదును రైతుల ఖాతాలకు అందజేసింది. ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మాన్‌ధన్ యోజన కింద పింఛన్ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగులకు ఇతర వర్గాలకు ఇచ్చే పింఛన్ మాదిరిగా రైతులకు కూడా వ్యవసాయం చేయలేక వృద్ధాప్యం మీద పడినప్పుడు కుటుంబ సభ్యుల నుంచి చీదరింపులు ఎదురుకాకుండా ఉండేలా, వారిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ పధకాన్ని తీసుకొచ్చింది.
ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయశాఖామంత్రి నరేంద్రసింగ్ తోమర్ దీనిని ప్రారంభించారు. 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించిన రైతులకు 61 ఏట నుంచి నెలకు రూ.3వేలు అందజేస్తారు.18–60 ఏళ్ల మధ్య వయసు ఉండే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో చేరిన రైతు మధ్యలో కన్నుమూస్తే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం తోపాటు బోనస్ లేదా వడ్డీ కలిసి నామినీ కూడా పాలసీని కొనసాగించుకునే వెసులుబాటు ఉండడం, ప్రీమియంలో సగం మాత్రమే చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించారు. పాలసీ చేసిన రైతు 61 ఏళ్ల తరువాత చనిపోతే నామినీకి సగం పెన్షన్ రూ.1500 చెల్లించనున్నట్లు ప్రకటించడం విశేషం.
చిన్న, సన్నకారు రైతులకే...:
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం పూర్తిగా చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. జిల్లాలో మొత్తం రైతులు 6.30లక్షల మంది ఉండగా ఇందులో చిన్నసన్నకారు రైతులు 3.65లక్షల మంది ఉన్నారు. వీరు మాత్రమే ఈ పథకానికి అర్హులు కానున్నారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులై ఉండి ఎలాంటి ఉద్యోగం, వ్యాపారం లేకుండా కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తున్న వారు ఈ పింఛన్ పథకానికి అర్హులు. ఇందులో చేరిన రైతులు ప్రీమియంలో సగం చెల్లిస్తే మిగతా సగం ప్రభుత్వమే జమ చేస్తుంది. నెల, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేలా వీలు కల్పించారు. ఎల్‌ఐసీ ఎలా కంతులుగా చెల్లిస్తారో ఈ ప్రీమియం కూడా అలానే చెల్లించాల్సి ఉంటుంది.
చెల్లింపులు బ్యాంకు ఖాతా ద్వారా ఆటోమేటిక్ డెబిట్ పద్థతిలో జరుగుతుంది. అంతేకాకుండా పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని సైతం ఈ పింఛన్ ప్రీమియం చెల్లింపునకు వినియోగివచుకోవచ్చు. ఒకనెల దాటినా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మరో నెలలో ప్రీమియం చెల్లించవచ్చు. ఇలా మూడుసార్లు వీలుకల్పించారు. ఆరు ప్రీమియంలు వరుసగా చెల్లించకపోతే మాత్రం ప్రభుత్వం చెల్లించే వాటా నిలిచిపోతుంది. నిలిచిపోయిన ఈ పథకాన్ని మూడేళ్ల వరకు తిరిగి కొనసాగించుకోవచ్చు. ఏడాది తరువాత చెల్లింపులు నిలిపివేసి పెన్షన్ పథకం నుంచి తప్పుకుంటే నామ మాత్రపు వడ్డీతో అప్పటి వరకు కట్టిన మొత్తాన్ని రైతుకు చెల్లిస్తారు. ఈ పథకంలో చేరేందుకు రైతులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని కామన్ సర్వీస్ సెంటర్ల (ఇంటర్‌నెట్, మీ–సేవా) కు వెళ్లి ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ద్వారా సెల్ఫ్‌డిక్లరేషన్ ఇవ్వాలి. నామినీని మధ్యలో మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
ఇది మంచి పథకం...:
రైతుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా బాగుంది. ఉద్యోగులకు, ఇతర వర్గాల వారికి పింఛన్ వస్తుంది. కానీ రైతుకు ఇలాంటివి లేవు. రైతులకు ఎంత వీలైతే అంత చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా ప్రీమియం చెల్లించడం మంచిదే.–బాలరాజు, రైతు, వెలంవారిపల్లె, వేంపల్లె మండలం.
రైతులకు ఆసరా..
రైతులు ఎన్నో విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వృద్ధాప్యంలోని రైతులకు ఇది ఒక వరం, ఆసరాగా ఉంటుంది. –పి.బ్రహ్మం, రైతు, గోనమాకులపల్లె, వీరపునాయునిపల్లె మండలం.
Comments
Please login to add a commentAdd a comment