‘అన్ని పనులకు నిధులు అవసరం లేదు... ప్రభుత్వ టీచర్లు సమయానికి బడికి వెళ్లాలి. విద్యార్థులకు పాఠాలు బోధించాలి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. సబ్ సెంటర్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఏఎన్‌ఎంలు గ్రామాల్లో పర్యటించి అవసరమైన వైద్య సేవలు అందించాలి. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రీ స్కూల్ నడపటంతోపాటు మాతాశిశు సంరక్షణలో పాలుపంచుకోవాలి. హాస్టళ్లలో వార్డెన్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, కార్యదర్శులు స్థానికంగా అందుబాటులో ఉండాలి. వీటికి డబ్బులతో పని లేదు.
ఎవరికివారుగా ప్రభుత్వ ఉద్యోగులు.. అధికారులు తమ విధుల పట్ల బాధ్యతగా, అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. వీటిని పట్టించుకోకపోతే... ప్రభుత్వ పాఠశాలలన్నా.. వైద్య శాలలన్నా... అంగన్‌వాడీలన్నా... ప్రభుత్వ పథకాలన్నా ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే పంచాయతీ, వార్డు స్థాయి నుంచే ప్రభుత్వ సేవలు మెరుగుపడాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు, పర్యవేక్షణతోనే అది సాధ్యమవుతుంది. ఆ సదుద్దేశంతోనే వారానికోరోజు ‘గ్రామసందర్శన’కు బయల్దేరుతున్నాను..’ అని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య
అభిప్రాయపడ్డారు.
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
విజయనగరం జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ వీరబ్రహ్మయ్య తన స్వీయ ఆలోచనతో విజయవంతంగా నిర్వహించిన గ్రామ సందర్శన కార్యక్రమాన్ని కరీంనగర్‌లోనూ పక్కాగా ఆచరణలో పెట్టారు. రెండు నెలలపాటు అనారోగ్యంతో సెలవులో ఉన్న కలెక్టర్... వచ్చీ రాగానే గ్రామ సందర్శనకు బయల్దేరారు. గడిచిన ఆరు నెలలుగా... 23 వారాలుగా నిర్విరామంగా సాగుతున్న ఈ కార్యక్రమంపై కలెక్టర్ ‘సాక్షి’తో ముఖాముఖిలో తన అభిప్రాయాలు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని... అప్పుడు ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అధికారులే గ్రామసభలు నిర్వహిస్తామన్నారు.
ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగపు పనితీరు... ప్రజలు పడుతున్న ఇబ్బందులు... వివిధ కార్యక్రమాల అమలు తీరు గ్రామ సందర్శనతో తనకు నేరుగా తెలిసిపోతాయన్నారు. మండలస్థాయిలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధించటం తేలికవుతుందన్నారు. ‘ప్రతి మండలంలో వివిధ విభాగాల్లో దాదాపు 20 మంది అధికారులుంటారు. వీరందరూ కలుసుకోకపోతే ప్రతీ చిన్న సమస్య పరిష్కారానికి ఉత్తర ప్రత్యుత్తరాల పేరుతో జాప్యం జరుగుతుంది. గ్రామ సందర్శనతో ప్రతీ గురువారం వీరందరూ కలుసుకుంటున్నారు. దీంతో కొన్ని అర్జీలు అక్కడికక్కడే పరిష్కారమవుతున్నాయి..’ అని చెప్పారు. ‘జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలు, 326 వార్డులున్నాయి. ఇప్పటికే ఒకసారి అన్నింటినీ సందర్శించాం. 1540 ఆరోగ్య శిబిరాలు, 1300 పశు వైద్య శిబిరాలు నిర్వహించాం. రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పీహెచ్‌సీలు, హాస్టళ్లను తనిఖీ చేయటంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాం...’ అని వివరించారు. మరోవైపు గ్రామసభల్లో ప్రజల వ్యక్తిగత అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. మౌలిక వసతులు, సామాజిక అవసరాలను సైతం గుర్తిస్తున్నామన్నారు. వీటిని ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 380 బోరుబావి మరమ్మతులు, 405 కొత్త బోర్లకు విజ్ఞప్తులు, 686 పైపులైన్లు, 5,701 ఇతర అవసరాలకు సంబంధించిన వినతులు అందినట్లు వివరించారు.
గ్రామ సందర్శనలో గుర్తించిన పనులకు జిల్లా పరిషత్తు నుంచి రూ.3.5 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్తులో జనరల్ ఫండ్, అందుబాటులో ఉన్న నిధుల నుంచి వీటిని మంజూరు చేస్తామన్నారు. మొత్తంగా రూ.7 కోట్లు అందుబాటులో ఉన్నాయని... వీటిలో సగం నిధులు ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకు కేటాయించి... మిగతా సగం నిధులు గ్రామ సందర్శనలో గుర్తించిన సామాజిక సమస్యల పరిష్కారానికి వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వార్డు సందర్శనలో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతగా మున్సిపాలిటీల్లో ఉన్న నిధులను ఖర్చు చేస్తామన్నారు.
గ్రామసందర్శన భేష్
Published Thu, Jan 30 2014 3:27 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
Advertisement