కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. నిర్వాహకులకు చెల్లించే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచినా మెనూకు అనుగుణంగా వారు భోజనం పెట్టడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం 3,053 పాఠశాల ల్లో అమలవుతోంది. 2 లక్షల 62వేల 738 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. 6వేల 417 మంది నిర్వాహకులు ఉపాధి పొం దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు హాజరు శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.
నిర్వహణను ఏజెన్సీలకు అప్పగించింది. మెజారిటీ పాఠశాలల్లో స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో, కొన్ని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు భోజనం వండిపెడుతున్నారు. నిర్వాహకులకు గౌరవ వేతనంగా నెలకు రూ.వెయ్యి చెల్లిస్తూ బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. మిగతా సరుకులైన పప్పు, కారం, నూనె, కోడిగుడ్ల కొనుగోలుకు నగదు చెల్లిస్తుంది. కట్టెల పొయ్యితో ఇబ్బందులెదురవుతున్నాయని ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను కూడా సరఫరా చేసింది. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.4, ప్రాథమికోన్నత విద్యార్థులకు రూ.4.65 పైసలు చెల్లించేది. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం మెనూ చార్జీలను ఇటీవల పెంచింది. ప్రాథమిక పాఠశాల స్థాయికి రూ.4.35 పైసలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6కు పెంచింది. దీంతో పౌష్టికాహారం అందుతుందని భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులకు పౌష్టికాహారం అందని ద్రాక్షే అయింది. సిలిండర్లను వినియోగించకుండా వంట చెరుకు సులువుగా దొరుకుతోందని కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు.
పర్యవేక్షించని కమిటీలు
పథకం సక్రమంగా అమలవుతుందా? లేదా? అని పర్యవేక్షించేందుకు మండలస్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలైనా ఏ ఒక్కరోజు కమిటీ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఎంపీడీవో, ఎంఈవోతోపాటు ఈవోపీఆర్డీలతో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు నిత్యం ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడంతోపాటు పారిశుధ్య కార్యక్రమాన్ని గమనించాల్సి ఉంది. వీరు సందర్శించిన పాఠశాలల వివరాలు 15 రోజులకోసారి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక పంపాలి. కానీ, జిల్లాలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు.
కోడిగుడ్డు మాయం
పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారానికి రెండుసార్లు గుడ్డు ఇవ్వాలి. కానీ, జిల్లాలో అనేక చోట్ల విద్యార్థులకు కోడి గుడ్డు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. సోమ, గురువారాల్లో కోడిగుడ్డు, సాంబారు, కూరగాయలు అందించాల్సి ఉంది. మంగళ, శుక్రవారాల్లో పప్పు, కూరగాయలు, బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలతో భోజనం అందించాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు గుడ్డుకు బదులుగా అరటిపళ్లను అందిస్తుండగా మరికొన్ని పాఠశాలల్లో రెండింట్లో వేటినీ అందించడం లేదు. తమకు రెండు మూడు నెలలుగా బిల్లులు రావడం లేదని, దుకాణదారులు అప్పు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నెలనెలా బిల్లులు సక్రమంగా ఇస్తే మంచి భోజనం అందించే వీలుంటుందని పేర్కొంటున్నారు.
అందని పౌష్టికాహారం
Published Fri, Dec 20 2013 3:42 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement