Andhra Pradesh: స్కూళ్ల భద్రతపై దృష్టి  | CM Jagan Review Meeting On schools and mid-day meal scheme | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: స్కూళ్ల భద్రతపై దృష్టి 

Published Thu, Aug 25 2022 3:28 AM | Last Updated on Thu, Aug 25 2022 10:02 AM

CM Jagan Review Meeting On schools and mid-day meal scheme - Sakshi

స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

స్కూళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే ముందు వాటి నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలి. బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్న భోజనం లేదా ఐసీడీఎస్‌ బియ్యంగా లేబుల్స్‌ వేయాలి. ప్రతినెలా నాణ్యత పరీక్షలు జరగాలి. ఆహారాన్ని రుచిగా వండడంపై వంట పని వారికి (కుక్స్‌) తగిన తర్ఫీదు ఇవ్వాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలి. గుడ్లు సరఫరాలో స్టాంపింగ్‌ తప్పనిసరి.
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద పలు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన స్కూళ్లలో  భద్రత కోసం వాచ్‌మెన్‌లను నియమించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు–నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్‌  చేయించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై బుధవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనబడి నాడు–నేడు కింద నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? తదితర అంశాలపై ఆడిట్‌ చేయించాలన్నారు.

క్రమం తప్పకుండా ఏటా నాలుగుసార్లు ఆడిట్‌ జరగాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే స్కూలు మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌), టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. నాడు–నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వారంటీ ఉన్నందున సమస్య రాగానే, మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీటికోసం గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను వినియోగించుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ  
► రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపైనా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. నాడు–నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఈ పర్యవేక్షణ పక్కాగా కొనసాగాలంటే ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుంది.  
► స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌ సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. తద్వారా స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించొచ్చు. స్కూళ్లలో వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేసినా, అవి పని చేయడం లేదన్న మాట రాకూడదు. అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి. 

చిక్కీల నాణ్యతపై మూడు దశల్లో పరీక్షలు 
► నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించాలి. క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ చేయాలి. దీనికోసం సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీటి పర్యవేక్షణలో హెచ్‌ఎం, సచివాలయ సిబ్బంది పాత్ర కీలకంగా ఉండాలి. ఆ మేరకు వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి. 
► మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీల నాణ్యతపై తయారీదారుల వద్ద, సరఫరా సమయంలో, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు.. ఇలా మూడు దశల్లో నాణ్యతపై ర్యాండమ్‌ పరీక్షలు చేయాలి. స్టాంపింగ్‌ లేకుండా  గుడ్లు పంపిణీ చేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమంపై కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలి. ఇందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలి.  
► ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎ.సిరి, సెర్ప్‌ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement