CM YS Jagan: చదువుతోనే వెలుగు | CM YS Jagan On Education Govt Schools AP Assembly Sessions | Sakshi
Sakshi News home page

CM YS Jagan: చదువుతోనే వెలుగు

Published Wed, Sep 21 2022 3:19 AM | Last Updated on Wed, Sep 21 2022 8:03 AM

CM YS Jagan On Education Govt Schools AP Assembly Sessions - Sakshi

ప్రపంచం మారుతోంది. చదువులు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా 2040 నాటికి చదువులు ఎలా ఉండాలి? వాటికి తగ్గట్టుగా పిల్లలను ఎలా తయారు చేసుకోవాలి? అనే ప్రణాళికను ప్రపంచం రచించుకుంటోంది. రాష్ట్రంలో మాత్రం 2019కి ముందు వరకూ 1950 నాటి విద్యా విధానం, దశాబ్దాలుగా పట్టించుకోని ప్రభుత్వ పాఠశాలలే కనిపించేవి. చదువుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడే పరిస్థితి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను సమూలంగా మార్చేశాం. తద్వారా ప్రభుత్వబడుల్లో (2018–19లో) ఉన్న 37,20,988 మంది పిల్లల సంఖ్య ఇప్పుడు 44,29,561కు పెరిగింది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఉన్నత ప్రమాణాలు, అత్యుత్తమ బోధనతో కూడిన మంచి చదువులను పిల్లలకు అందించడం ద్వారానే  రాష్ట్రంలోని పేదల ఇళ్లలో వెలుగులు నింపగలుగుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యా రంగంపై చేసే ఖర్చు మానవ వనరులపై, భవిష్యత్తుపై పెట్టుబడేనని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, వేల కోట్ల రూపాయల నిధులతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

గత ప్రభుత్వంలో కార్పొరేట్‌ స్కూళ్ల మేలు కోసం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారని, చివరకు నాటి సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలోని స్కూళ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అసెంబ్లీలో మంగళవారం విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమం అమలుపై జరిగిన చర్చలో ఆయన సమాధానమిచ్చారు.

‘విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, వ్యయంపై రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా రకరకాలుగా మాట్లాడుతోంది. విద్యా రంగం, పిల్లల చదువుల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి వంటింది. రాబోయే సమాజం మీద, మంచి పౌరులను తయారు చేసేందుకు పెట్టుబడి పెడుతున్నాం’ అని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం.. 
► స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఆర్థిక, సామాజిక కారణాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించలేకపోతున్నారు. ప్రపంచం అంతా ఇంగ్లిష్‌ మీడియం వైపు అడుగులు వేస్తుంటే.. ప్రభుత్వమే దగ్గరుండి అటు వైపు అడుగులు వేయించకుండా అడ్డుకోవడం చూశాం.
► వచ్చే తరం పిల్లలు నాణ్యమైన అభివృద్ధి వైపు అడుగులు వేయించేలా చదువుల్లో మార్పులు తీసుకువస్తేనే  ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయి. ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. ఆ లక్ష్యంతోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం. రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ కేవలం ఒక నినాదంగా కాకుండా రైట్‌ టు ఇంగ్లిష్‌.. రైట్‌ టు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌గా పేదరికంలో ఉన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి, వారందరినీ గొప్పగా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది.

మనబడి నాడు–నేడుతో ప్రస్ఫుటమైన మార్పు 
గత ప్రభుత్వ హయాంలో కునారిల్లిన్న ప్రభుత్వ విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది. నాడు–నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ బడిలో 12 రకాల మౌలిక సదుపాయాలు సమకూరాయి. 
► ప్రతి పాఠశాలలో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన మంచి టాయిలెట్‌
► మంచి నీటి సరఫరా
► చిన్నా, పెద్ద రిపేర్లు ఏమైనా ఉంటే చేయించడం
► ప్రతి క్లాస్‌ రూమ్‌లో విద్యుదీకరణ, ట్యూబ్‌ లైట్, ఫ్యాన్‌లు అందుబాటులోకి తేవడం
► విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచి ఫర్నీచర్‌ సమకూర్చడం
► ప్రతి క్లాస్‌ రూమ్‌లో గ్రీన్‌ చాక్‌ బోర్డుల ఏర్పాటు
► స్కూల్‌ బిల్డింగ్‌కు మంచి రంగులు వేయించడం
► ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌ ఏర్పాటు
► ప్రహరీ నిర్మాణం
► ప్రతి స్కూల్‌లో మంచి కిచెన్‌ షెడ్‌ నిర్మాణం
► అవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం
► నాడు–నేడు పూర్తయిన క్లాస్‌ రూమ్‌లను డిజిటలైజేషన్‌  

స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్నాం..
► రాష్ట్ర వ్యాప్తంగా 45 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు, ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మారుతున్న అంగన్‌వాడీలు, హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద 57 వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇందుకోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
► తొలి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,700 కోట్ల నిధులతో సమూలమైన మార్పులు తెచ్చాం. ఈ పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు పెడుతున్నాం. నాడు–నేడు రెండో దశ కింద 22,344 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నాం. వీటిలో రూ.8 వేల కోట్లతో సకల సదుపాయాలు కల్పించనున్నాం. 
► అభివృద్ధి చేసిన ప్రతి పాఠశాలలో టాయిలెట్‌ల నిర్వహణ, స్కూల్‌ నిర్వహణ కోసం ఫండ్‌ను ఏర్పాటు చేశాం. ఈ తరహాలో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఇలా ఏటా రూ.448 కోట్లు టాయిలెట్‌ నిర్వహణ కోసం కేటాయిస్తున్నాం. టాయిలెట్‌లు, పాఠశాలల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44,968 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 47 వేల మంది ఆయాలను రూ.6 వేల గౌరవ వేతనంతో నియమించి, నిర్వహణ కోసం అవసరమైన సదుపాయాలను కల్పించాం.
► స్కూళ్ల భవన నిర్వహణ కోసం ఈ ఏడాది నుంచి నిధిని ఏర్పాటు చేస్తున్నాం. చిన్న చిన్న రిపేర్లను పట్టించుకోకుంటే పాఠశాలలు అధ్వాన్నంగా మారుతాయని అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి సేకరించిన రూ.450 కోట్లు నిధికి జమ చేశాం. ఈ నిధి ద్వారా స్కూల్స్‌లో అప్పటికప్పుడు అవసరమైన రిపేర్లు, ఇతర పనులు చేస్తారు. 
► ఉన్నత విద్యా రంగంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల వల్ల కళాశాలల్లో గరిష్ట చేరికల నిష్పత్తి (జీఈఆర్‌) పెరిగేలా చేస్తున్నాం. ఉన్నత విద్యలో జీఈఆర్‌.. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌లో 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం ఉండగా మన దేశంలో 29 శాతంగా ఉంది. రాష్ట్రంలో దీన్ని 2030 నాటికి 70 శాతానికి తీసుకు వెళ్లాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. 
కృష్ణాజిల్లా కంకిపాడు మండల పరిషత్‌ పాఠశాల నేడు. (ఇన్‌సెట్‌లో) నాడు 

ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు 
► ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌సీ సిలబస్‌ లేకుండా చేయడం, పాఠ్య పుస్తకాలు నెలల తరబడి అందించకపోవడం గతంలో ఉండేది. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరు గార్చారు. వీటన్నిటి ద్వారా అసలు ప్రభుత్వ బడులకు పిల్లలను పంపండమే వేస్ట్‌.. అనే ఆలోచనను తల్లిదండ్రుల్లో తీసుకొచ్చారు. ఇలాంటి చర్యల ద్వారా తమకు కావాల్సిన ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలకు మేలు చేశారు. 
► ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు లేక ఆడ పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని తెలిసినా నాడు పట్టించుకోలేదు. మంచి నీరు, కాంపౌండ్‌ వాల్స్, బల్లలు, చివరికి బ్లాక్‌ బోర్డు కూడా సరిగా లేని పరిస్థితులను తీసుకువచ్చి.. ప్రభుత్వ బడుల్లో ఏమీ ఉండదనేలా చేశారు. 
► ఈ కారణాల వల్ల డ్రాపౌట్‌ రేటు గణనీయంగా పెరిగింది. వసతులు లేకనే డ్రాపౌట్‌ రేటు పెరుగుతున్నా దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోని అధ్వాన్న పాలనను అప్పట్లో చూశాం.   

నాడు కునారిల్లిన చదువులు
► చంద్రబాబు హయాంలో పాఠశాల విద్యలో గరిష్ట చేరికల రేషియో చాలా అధ్వాన్నంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా అట్టడుగున ఉండేది. కేంద్ర విద్యా శాఖ గణాంకాలు 2018 ప్రకారం 2015–16లో ప్రైమరీ పాఠశాలల్లో చేరే గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో దేశంలో 99.21 శాతంగా ఉండగా, మన రాష్ట్రంలో 84.48 శాతం ఉండింది. 
► అప్పట్లో రాష్ట్రం చంఢీఘర్, డామన్‌డయూ, లక్ష్య ద్వీప్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాలతో మాత్రమే పోటీ పడేలా ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలకు పూర్వ వైభవం తేవడం కోసం విప్లవాత్మకంగా అడుగులు ముందుకు వేశాం. 
► దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు సాయం చేస్తున్నాం. ఇలా ఈ మూడేళ్లలో 84 లక్షల మందికి పిల్లలకు సంబంధించి 44.5 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.19,617.60 కోట్లు జమ చేశాం. గోరు ముద్ద పథకం ద్వారా రోజుకో మెనూతో మధ్యాహ్న భోజనం కింద పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇదే గోరు ముద్ద పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఏటా రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
► విద్యా కానుక కింద పాఠశాలలో చేరే సమయానికి ప్రతి పిల్లవాడికి బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, కుట్టుకూలి, బెల్ట్, ఒక జత షూస్, రెండు జతల సాక్స్‌లు, బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, నోట్‌ బుక్స్, ఇంగ్లిష్‌ టూ తెలుగు డిక్షనరీ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

8వ తరగతి పిల్లలకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు 
► విద్యా కానులో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులు, దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులకు రూ.665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను నవంబర్‌ చివరి వారంలో పంపిణీ  చేయనున్నాం. బయటి మార్కెట్లో రూ.16 వేల విలువైన ఈ ట్యాబ్‌లను రివర్స్‌ టెండర్ల ద్వారా రూ.12,840కే కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నాం. 
► ఇప్పుడు 8వ తరగతి పిల్లలు 2025లో సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీరికి బైజూస్‌ ఆన్‌లైన్‌ కంటెంట్‌తో పాఠాలు అందించేలా ఆ సంస్థతో  ఒప్పందం చేసుకున్నాం. రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు ఖర్చయ్యే బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ను ట్యాబ్‌లలో పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోంది. 

24.74 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన 
► ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు తోడుగా ఉండేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా 24.74 లక్షల మంది పిల్లలకు రూ 8,365 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,777 కోట్లు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. 
► వసతి దీవెన పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.3349.57 కోట్లు అందించాం. ఈ రెండు పథకాల కోసం గత మూడేళ్లలో రూ.11,715 కోట్లు ఖర్చు చేశాం. 

ఆకట్టుకున్న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 
సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనబడి నాడు–నేడు, గోరుముద్దతో సహా విద్యా రంగ కార్యక్రమాలపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఆకట్టుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని స్కూళ్లలో, ఆయన సొంత గ్రామం నారావారిపల్లెలోని స్కూళ్లలో నాటి స్థితిగతులు, నాడు–నేడు కార్యక్రమంతో ఇపుడు సర్వాంగ సుందరంగా మారిన స్థితిని ఫొటోలతో సహా ప్రదర్శిస్తూ వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement