ఒక్క లక్ష్యం కోసం.. అన్ని వర్గాల వారు సమైక్యపోరులో ‘మేము సైతం’ అంటూ పోరు సాగిస్తున్నారు. రాజకీయపార్టీల అండలేదు.. వారి నుంచి దన్ను లేదు..అయినా ఏ మాత్రం పట్టుసడలించకుండా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు అడుగులేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సకలజనుల సమ్మె పేరుతో 42రోజుల పాటు పోరు జరిగింది. సమైక్యరాష్ట్రంగానే కొనసాగాలని సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం 44రోజులు దాటి నేటితో 45 రోజులకు చేరింది.
సాక్షి, కడప: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ‘సకలజనుల సమ్మె’ పేరుతో 42రోజుల పాటు ఉద్యమం నడిచింది. 2011 సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకూ ఆ సమ్మె కొనసాగింది. ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలు సమ్మెను విరమించారు. ప్రస్తుతం సమైక్యరాష్ట్రం కోసం సీమాంధ్రలోని 13 జిల్లాలలో ఉద్యమం నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై జూలై 30న ఏఐసీసీ ప్రకటన చేసింది. దీంతో అదే నెల 31 నుంచి సాధారణ ప్రజానీకం ఉద్యమాన్ని నడిపారు. వారంరోజుల పాటు నిరవధికంగా జిల్లా బంద్‌ను కొనసాగించారు. ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు...ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు.
అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ సమైక్యరాష్ట్రం కోసం ఇబ్బందులను పక్కనపెట్టి సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలో తమవంతు పోరు సాగించారు. ఆగస్టు 1 నుంచి న్యాయవాదులతో పాటు పలువురు ఉద్యోగులు రిలేదీక్షలు మొదలుపెట్టారు. ఆపై అదే నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. ఉద్యమం నిరాటంకంగా సాగేందుకు సమైక్యపరిరక్షణ కమిటీ, జేఏసీ నేతలతో పాటు అందరూ ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ భవిష్యత్ ఉద్యమకార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.
అక్కడ రాజకీయపార్టీల అండ...ఇక్కడ ప్రజలే సారథులుగా:
తెలంగాణలో 42రోజులు జరిగిన సకలజనుల సమ్మె పూర్తిగా రాజకీయపార్టీల అండతో, మద్దతుతో సాగింది. ఓ రాజకీయ ఉద్యమంలా పోరు నడిచింది. కానీ సమైక్య ఉద్యమం ఏ రాజకీయపార్టీ అండ లేకుండా స్వతంత్రంగా సాగుతోంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకూ వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలు సాగాయి. టీడీపీ ఆధ్వర్యంలో కొద్దిరోజులు దీక్షాశిబిరం నడిచింది. అయితే ఉద్యోగులు, సామాన్య ప్రజలు మాత్రం అలుపెరగకుండా పోరు చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ఎవరో ఒకరు, ఏదోఒక నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేధిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలో కూర్చుంటున్నారు. 43రోజులుగా నిరవధికంగా న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారు. జిల్లా యంత్రాంగంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా తక్కిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు. జిల్లా చరిత్రలో ఇన్ని రోజుల పాటు కలెక్టరేట్ నిర్మానుష్యంగా పాలన లేకుండా ఉండటం ఇదే ప్రథమం.
స్తంభించిన పాలన:
రెవెన్యూతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రభుత్వపాలన స్తంభించింది. ప్రభుత్వశాఖల సముదాయమైన ఓల్డ్‌రిమ్స్‌లో ఏ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. జిల్లాలోని మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడిఫైళ్లు అక్కడే నిలిచిపోయాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించే ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. వీరిపై ప్రభుత్వం ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించినా బెదరలేదు. దీంతో జిల్లాలోని 26వేలమందికి ఈ నెల 1న రూ. 80 కోట్ల మేరకు జీతాలు అందలేదు. అయినా ఎవరూ బాధపడటంలేదు. నీరసించలేదు. మరింత పట్టుదలతో పోరు సాగిస్తున్నారు.
సై.. సమైక్యాంధ్ర...!
Published Fri, Sep 13 2013 2:51 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement