మేనిఫెస్టో... మా ఇష్టమంటే కుదరదు | telangana elections 2023: Manifestos cannot be design at will | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టో... మా ఇష్టమంటే కుదరదు

Published Sun, Oct 15 2023 2:45 AM | Last Updated on Sun, Oct 15 2023 3:01 AM

telangana elections 2023: Manifestos cannot be design at will - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటనలో రాజకీయపార్టీల ఇష్టారాజ్యం ఉండదు. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం...గెలిచాక అమలు చేయకపోవడం..లేకపోతే ఆచరణ సాధ్యంకాని హామీలతో ఓట్లు కొల్లగొడదామంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంగీకరించదు. ఎందుకంటే..ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా మేనిఫెస్టో  చేర్చుతూ 2015 ఏప్రిల్‌ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీలు ఎలా ఉండాలి? ఎలా ఉండరాదు? అన్న అంశాలు ఉన్నాయి. దీంతో మేనిఫెస్టోల విషయంలో రాజకీయపార్టీ లు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు ఈ నిబంధనలు అంగీకరించవు. 

‘హామీలు’ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి  

  • రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించే అంశాలేమీ మేనిఫెస్టోలో ఉండరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఉండాలి.   
  • పౌరులకు వివిధ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలని.. ప్రభుత్వ విధానాలపై రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మేనిఫెస్టోల్లో వాగ్దానాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఆ హామీలు ఉండరాదు. ఓటు వినియోగించే విషయంలో ఓటర్లను అనుచిత ప్రలోభాలకు గురి చేయకూడదు.  
  • మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. వీటి అమలుకు అనుసరించే మార్గాలు, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం సవివరంగా ఓటర్లకు తెలియజేయాలి. నెరవేర్చగలిగే వాగ్దానాల ద్వారానే ఓటర్ల నమ్మకాన్ని కోరాలి.  

నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తే... 
ప్రజాప్రాతినిధ్య చట్టం–195లోని సెక్షన్‌ 126లో నిర్దేశించిన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పుడు మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు.  

  • ఒకేవిడత ఎన్నికల విషయంలో పోలింగ్‌కు ముందు అమలుచేసే నిషేధాజ్ఞల కాలవ్యవధిలో మేనిఫెస్టోలు ప్రకటించరాదు.  
    ఒకటికంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే..ప్రతి విడత పోలింగ్‌కు ముందు ప్రకటించే నిషేధాజ్ఞల వ్యవధిలో మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు.   

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి 
గతంలో రాజకీయపార్టీలు ప్రజలకు మీడియా ద్వారా మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేవి. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా సమర్పించాల్సిందే. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కి రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల/హిందీ భాషల్లో మూడు ప్రతులు సమర్పించాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి.

ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు పొందుపర్చినట్టు స్వీయ ధ్రువీకరణ పత్రం(డిక్లరేషన్‌) సైతం మేనిఫెస్టోతో పాటు సీఈఓకు సమర్పించాలి. 2016 డిసెంబర్‌ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఉత్తర్వుల కారణంగా రాజకీయపార్టీ ల ఎన్నికల మేనిఫెస్టోలను భవిష్యత్‌ అవసరాల కోసం ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది.   

‘సుప్రీం’ చొరవతో మేనిఫెస్టోకు పారదర్శకత  
ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన హామీల విషయంలో రాజకీయ పార్టీ లతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలను నిర్దేశించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 జూలై 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్‌.సుబ్రమణ్యం బాలాజీ వేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తన తీర్పులో చేసిన సూచనల ఆధారంగా మేనిఫెస్టోలపై మార్గదర్శకాలను ఈసీఐ రూపకల్పన చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు ఇవే... 

మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 ప్రకారం అవినీతి చర్యలుగా పరిగణించడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ, ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలకు ఇలాంటి హామీలతో తీవ్రస్థాయిలో కుదుపునకు గురవుతాయి.  

ఎన్నికల్లో పోటీపడే పార్టీ లు/అభ్యర్థుల సమాన అవకాశాలను పరిరక్షించడానికి, స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికలసంఘం గతంలో సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 324 ద్వారా ఎన్నికల సంఘానికి ఇలాంటి అధికారాలు లభించాయి.  

సాధారణంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీ లు మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందటి చర్యలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి ఏ మాత్రం లేదు. అయితే, మేనిఫెస్టోలు ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వీటి విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు కలిగి ఉంటుంది.  

ప్రధాన దేశాల్లో పార్టీ ల విధానాలే హామీలు   
అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, స్వీడన్, కెనడా, నెదర్లాండ్, ఆ్రస్టియా, ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లొ వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు మేనిఫెస్టోల్లో ప్రకటించరు. రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలు, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనాసంస్కరణలు, పర్యావరణ అంశాలు, వలసలు వంటి అంశాలపై తమ విధానాలను మాత్రమే ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి.  

భూటాన్, మెక్సికో వంటి దేశాల్లో రాజకీయ పార్టీలు/అభ్యర్థుల ఎన్నికల మేనిఫెస్టోలను ఆయా దేశాల ఎన్నికల యంత్రాంగానికి తొలుత సమర్పి స్తాయి. ఎన్నికల యంత్రాంగం  పరిశీలించి అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగించాలని ఆదేశిస్తుంది. యూకేలో సైతం మేనిఫెస్టోలపై మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. 

మన దగ్గరా మేనిఫెస్టోలు ఈసీ పరిశీలించాలనే డిమాండ్‌  
మన దేశంలో సైతం రాజకీయపార్టీ లు మేనిఫెస్టోలను తొలుత ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఎన్నికల సంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే  ప్రజలకు

ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించి ఆచరణకు సాధ్యం కాని, ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగింపునకు ఆదేశించాలని స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మరోవైపు మేనిఫెస్టోలను తాము పరిశీలించడం ఆచరణలో సాధ్యం కాదని ఎన్నికల సంఘం అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ మేనిఫెస్టోల్లో మార్పులు సూచిస్తే రాజకీయ పార్టీలు న్యాయస్థానాలకు వెళ్లే అవకాశముందని, దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమవుతుందంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత  విస్మరిస్తే ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని అధికారులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement