ishtarajyam
-
మేనిఫెస్టో... మా ఇష్టమంటే కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటనలో రాజకీయపార్టీల ఇష్టారాజ్యం ఉండదు. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం...గెలిచాక అమలు చేయకపోవడం..లేకపోతే ఆచరణ సాధ్యంకాని హామీలతో ఓట్లు కొల్లగొడదామంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంగీకరించదు. ఎందుకంటే..ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా మేనిఫెస్టో చేర్చుతూ 2015 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీలు ఎలా ఉండాలి? ఎలా ఉండరాదు? అన్న అంశాలు ఉన్నాయి. దీంతో మేనిఫెస్టోల విషయంలో రాజకీయపార్టీ లు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు ఈ నిబంధనలు అంగీకరించవు. ‘హామీలు’ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించే అంశాలేమీ మేనిఫెస్టోలో ఉండరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. పౌరులకు వివిధ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలని.. ప్రభుత్వ విధానాలపై రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మేనిఫెస్టోల్లో వాగ్దానాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఆ హామీలు ఉండరాదు. ఓటు వినియోగించే విషయంలో ఓటర్లను అనుచిత ప్రలోభాలకు గురి చేయకూడదు. మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. వీటి అమలుకు అనుసరించే మార్గాలు, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం సవివరంగా ఓటర్లకు తెలియజేయాలి. నెరవేర్చగలిగే వాగ్దానాల ద్వారానే ఓటర్ల నమ్మకాన్ని కోరాలి. నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తే... ప్రజాప్రాతినిధ్య చట్టం–195లోని సెక్షన్ 126లో నిర్దేశించిన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పుడు మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు. ఒకేవిడత ఎన్నికల విషయంలో పోలింగ్‌కు ముందు అమలుచేసే నిషేధాజ్ఞల కాలవ్యవధిలో మేనిఫెస్టోలు ప్రకటించరాదు. ఒకటికంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే..ప్రతి విడత పోలింగ్‌కు ముందు ప్రకటించే నిషేధాజ్ఞల వ్యవధిలో మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి గతంలో రాజకీయపార్టీలు ప్రజలకు మీడియా ద్వారా మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేవి. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా సమర్పించాల్సిందే. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కి రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల/హిందీ భాషల్లో మూడు ప్రతులు సమర్పించాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు పొందుపర్చినట్టు స్వీయ ధ్రువీకరణ పత్రం(డిక్లరేషన్) సైతం మేనిఫెస్టోతో పాటు సీఈఓకు సమర్పించాలి. 2016 డిసెంబర్ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఉత్తర్వుల కారణంగా రాజకీయపార్టీ ల ఎన్నికల మేనిఫెస్టోలను భవిష్యత్ అవసరాల కోసం ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది. ‘సుప్రీం’ చొరవతో మేనిఫెస్టోకు పారదర్శకత ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన హామీల విషయంలో రాజకీయ పార్టీ లతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలను నిర్దేశించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 జూలై 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్.సుబ్రమణ్యం బాలాజీ వేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తన తీర్పులో చేసిన సూచనల ఆధారంగా మేనిఫెస్టోలపై మార్గదర్శకాలను ఈసీఐ రూపకల్పన చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు ఇవే... మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతి చర్యలుగా పరిగణించడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ, ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలకు ఇలాంటి హామీలతో తీవ్రస్థాయిలో కుదుపునకు గురవుతాయి. ఎన్నికల్లో పోటీపడే పార్టీ లు/అభ్యర్థుల సమాన అవకాశాలను పరిరక్షించడానికి, స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికలసంఘం గతంలో సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి ఇలాంటి అధికారాలు లభించాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీ లు మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందటి చర్యలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి ఏ మాత్రం లేదు. అయితే, మేనిఫెస్టోలు ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వీటి విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు కలిగి ఉంటుంది. ప్రధాన దేశాల్లో పార్టీ ల విధానాలే హామీలు అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, స్వీడన్, కెనడా, నెదర్లాండ్, ఆ్రస్టియా, ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లొ వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు మేనిఫెస్టోల్లో ప్రకటించరు. రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలు, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనాసంస్కరణలు, పర్యావరణ అంశాలు, వలసలు వంటి అంశాలపై తమ విధానాలను మాత్రమే ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. భూటాన్, మెక్సికో వంటి దేశాల్లో రాజకీయ పార్టీలు/అభ్యర్థుల ఎన్నికల మేనిఫెస్టోలను ఆయా దేశాల ఎన్నికల యంత్రాంగానికి తొలుత సమర్పి స్తాయి. ఎన్నికల యంత్రాంగం పరిశీలించి అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగించాలని ఆదేశిస్తుంది. యూకేలో సైతం మేనిఫెస్టోలపై మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. మన దగ్గరా మేనిఫెస్టోలు ఈసీ పరిశీలించాలనే డిమాండ్ మన దేశంలో సైతం రాజకీయపార్టీ లు మేనిఫెస్టోలను తొలుత ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఎన్నికల సంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే ప్రజలకు ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించి ఆచరణకు సాధ్యం కాని, ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగింపునకు ఆదేశించాలని స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మేనిఫెస్టోలను తాము పరిశీలించడం ఆచరణలో సాధ్యం కాదని ఎన్నికల సంఘం అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ మేనిఫెస్టోల్లో మార్పులు సూచిస్తే రాజకీయ పార్టీలు న్యాయస్థానాలకు వెళ్లే అవకాశముందని, దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమవుతుందంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తే ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
ఇష్టారాజ్యం
– యూజీ పరీక్షల విభాగం అస్తవ్యస్తం !! – డిగ్రీ కాన్వొకేషన్ సర్టిఫికెట్లు పరిశీలించకుండానే బీఈడీ సర్టిఫికెట్ల జారీ – రాష్ట్రేతర విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలు – డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల్లోనూ తప్పిదాలు – ఇంటర్నల్ మార్కులు కలపకుండానే ఫలితాల ప్రకటన – ప్రొఫెసర్ల కమిటీ నిర్ధారణ ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూజీ పరీక్షల విభాగం పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల నమోదు, ప్రకటన, సర్టిఫికెట్ల జారీ ఇలా ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నా చర్యలు శూన్యం. ఫలితంగా విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి. నిర్ణీత శాతానికి మించి రాష్ట్రేతరులు.. బీఈడీ ప్రవేశాలు 85 శాతం స్థానికులు, 15 శాతం రాష్ట్రేతర విద్యార్థులతో భర్తీ చేయాల్సి ఉంది. కానీ 2014–15 విద్యాసంవత్సరంలో బీఈడీ రాష్ట్రేతర విద్యార్థులతో నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మందికి ప్రవేశాలు కల్పించారు. వీరిలో అధికంగా పశ్చిమబెంగాల్‌కు చెందిన విద్యార్థులూ ఉన్నారు. అనంతపురం జిల్లాలోని కళాశాలల్లోను ఇదే పరిస్థితి . 2014–15లో బీఈడీ ప్రాక్టికల్ రికార్డులు పశ్చిమబెంగాల్ విద్యార్థులు ఇంగ్లిష్‌లో రాయాల్సి ఉన్నప్పటికీ, తెలుగులో రాయడం వివాదమైంది. ఇందుకోసం కమిటీని నియమించి ఆయా కళాశాలలకు, విద్యార్థులకు జరిమానా విధించారు. తిరిగి రికార్డులు రాయాలని కమిటీ స్పష్టం చేసింది. సీడీసీ పూర్వానుమతి లేనిదే బీఈడీ సర్టిఫికెట్లు ఇవ్వరాదని యూజీ విభాగాలకు సూచించారు. యూజీ కాన్వోకేషన్ సర్టిఫికెట్లు సక్రమమైనవా? కాదా ? అని పరిశీలించకుండా బీఈడీ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల్లో తప్పిదాలు.. డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేశారు. ఇంటర్నల్ మార్కులు ఆయా డిగ్రీ కళాశాలలు పంపలేదని ఇబ్బడిముబ్బడిగా విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇందుకోసం ఆచార్య ఏ. మల్లిఖార్జున రెడ్డి నేతత్వంలో కమిటీని నియమించారు. కమిటీ దర్యాప్తును వేగవంతం చేసింది. కొన్ని కళాశాలలు ఇంటర్నల్ మార్కులు పంపినప్పటికీ , ఆయా సబ్జెక్టులకు కలపలేదని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ట్యాబులేషన్‌లో పరిశీలించకుండానే నేరుగా ఫలితాలు ప్రకటించడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందని కమిటీ భావించింది. ఇంటర్నల్ మార్కులు ఆయా కళాశాలలు పంపకపోతే ఫలితాలు విత్‌హెల్డ్, ఎనౌన్స్ లేటర్ అని ప్రకటించాలని కానీ.. ఎందుకు ఫెయిల్‌గా చూపించారని యూజీ విభాగం అధికారులతో కమిటీ ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు యూజీ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.