సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు.
పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి
గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు.
స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది.
పట్టించుకోని ప్రయాణికులు
కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్‌బిన్‌లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు.
మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు.
అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment